మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు ఇవే.. వీటిని ఒక్కసారైనా చూశారా?

These Are the Cars Used by Mahatma Gandhi Have You Ever Seen: మారణాయుధాలు ముట్టరాదని, రక్తపు బిందువు చిందరాదని చెప్పిన మహోన్నత వ్యక్తి మన గాంధీజీ. అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని తలచి, తాను అనుకున్న సిద్ధాంతాలను మాత్రమే అనుసరించి భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన బాపూజీ.. ఒక్కడిగా ప్రారంభమై దేశంలోనే ఎంతమంది ప్రజలను ఒకేతాటిపై నడిపించి దేశం యొక్క దాస్య శృంఖలాలను తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ గురించి చాలా విషయాలనే తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు గాంధీ కాలంలో ఎలాంటి వాహనాలను ఉపయోగించారు. ప్రస్తుతం అలాంటి కార్లు ఎందుకు అందుబాటులో లేదు అనే చాలా విషయాలను వివరంగా పరిశీలిద్దాం.

గాంధీ కాలంలో అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు.. ప్రజలను ఉత్తేజ పరచడానికి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గాంధీ వెల్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో కాలినడకనే ప్రయాణించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో కార్లలో కూడా ప్రయాణించేవారు. గాంధీజీ ప్రయాణించిన కార్లలో ఫోర్డ్ మోటార్స్ యొక్క ‘మోడల్ టీ’ ఒకటి.

ఫోర్డ్ మోడల్ టీ (Ford Model T)

ప్రస్తుతం అమెరికాలో అగ్రగామి వాహన తయారీ సంస్థగా నిలిచిన ఫోర్డ్ మోటార్స్.. స్వాతంత్య్రం రాకముందే మార్కెట్లో కార్లను విక్రయించింది. అంతే ఫోర్డ్ కంపెనీకి కూడా దశాబ్దాల చరిత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఫోర్స్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తుల్లో ఒకటైన మోడల్ టీ కారులో మహాత్మా గాంధీ అనేక సార్లు ప్రయాణించారు. 1927లో బరేలీ సెంట్రల్ జైలు నుంచి గాంధీ విడుదలైన తరువాత ఉత్తరప్రదేశ్ ర్యాలీలో ఈ కారును ఉపయోగించారు.

ఫోర్డ్ మోడల్ టీ కారు 2.9 లీటర్ సైడ్ వాల్వ్ రివర్స్ ప్లో సిలిండర్ హెడ్ ఇన్‌లైన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందింది. ఇది 20 హార్స్ పవర్ శక్తిని విడుదల చేసేది. ఈ రోజుల్లో ఈ కారు పెద్దగా చెప్పుకోదగ్గ మోడల్ కానప్పటికీ.. అప్పట్లో ఇదే పాపులర్ మోడల్. సంపన్నులు చాలామంది ఇలాంటి కార్లనే ఉపయోగించేవారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 72 కిమీ మాత్రమే.

ప్యాకర్డ్ 120 (Packard One Twenty)

గాంధీ ప్రయాణించిన కార్ల జాబితాలో మరోకారు ప్యాకర్డ్ 120. 1940లలో గాంధీ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ కారులో ప్రయాణించినట్లు సమాచారం. ఫోర్డ్ కార్ల మాదిరిగానే ప్యాకర్డ్ 120 కూడా కొంత పొడవైన బోనెట్ కలిగి, పెద్ద ఇంజిన్ కలిగి ఉండేది. ఇది 110 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇన్‌లైన్ ఎయిట్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉండేది. ఇంజిన్ వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

నిజానికి మహాత్మ గాంధీకి సొంతంగా కారు లేదు. గాంధీ ప్రయాణించిన కార్లన్నీ కూడా ఆయన మద్దతుదారులు లేదా ఆయనకు అనుచరులలోని సంపన్నులకు చెందినవి మాత్రమే. అప్పట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా మరియు ఢిల్లీ క్లాత్ అండ్ జనరల్ మిల్స్ ఫౌండర్ లాలా శ్రీరామ్ మొదలైన వారు ఉండేవారు. వీరికి చెందిన కార్లలో గాంధీ తన ప్రయాణాలను కొనసాగించారు.

స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ (Studebaker President)

గాంధీ ప్రయాణించడానికి ఉపయోగించిన మరో కారు స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ 8 సెలూన్. గాంధీ మైసూర్ పర్యటన సందర్భంగా ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు కూడా అమెరికాలో తయారైనట్లు సమాచారం. అప్పట్లోనే అత్యంత విలాసవంతమైన కారుగా ప్రజాదరణ పొందిన ఈ కారు 5.5 లీటర్ ఇన్‌లైన్ ఎయిట్ సిలిండర్ ఇంజిన్ పొందింది. ఇది 100 పీఎస్ పవర్ మరియు 353 న్యూటన్ మీటర్ టార్క్ అందించేది. ఇంజిన్ 3 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండేది.

స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ కారు 1926 నుంచి 1942 మధ్య అందుబాటులో ఉండేదని సమాచారం. గాంధీ ఉపయోగించిన ఈ స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ కారు ఎవరిదనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ఇది ప్రస్తుతం మైసూర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేలోని పయన కార్ మ్యూజియంలో ప్రదర్శనాకు ఉన్నట్లు సమాచారం.

గాంధీ ఉపయోగించిన స్టూడ్‌బేకర్ కారు కాకుండా.. ఫోర్డ్ మోడల్ టీ మరియు ప్యాకర్డ్ 120 కార్లు ప్రస్తుతం ఎక్కడున్నాయో స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే అప్పట్లో ఇండియన్ రోడ్ల మీద అమెరికన్ బ్రాండ్ కార్లు ఎక్కువగా తిరగడానికి ప్రధాన కారణం.. మనదేశంలో సొంత కార్ల తయారీ సంస్థ లేకపోవడమే తెలుస్తోంది. కాబట్టి సంపన్నులు లేదా పారిశ్రామిక వేత్తలు వారి సొంత అవసరాల కోసం విదేశాల నుంచి తిగుమతి చేసుకునేవారు.

Don’t Miss: స్కూటర్ చిన్నదే.. ధర మాత్రం లక్షల్లోనే! బీఎండబ్ల్యూ సీఈ 02 ఇదే

పాత కార్లు అంతరించిపోవడానికి కారణం ఇదే..

భారతదేశంలో హిందూస్తాన్ మోటార్స్ వంటి సంస్థలు.. కార్లను తయారు చేయడం ప్రారంభించిన తరువాత అమెరికన్ కార్ల వాడకం అప్పట్లో చాలా తగ్గిపోయింది. 1942లో హిందూస్తాన్ మోటార్స్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత అంబాసిడర్ కార్ల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత విదేశీ కార్ల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఆ తరువాత కాలంలో పుట్టుకొచ్చిన కొత్త కంపెనీల కార్ల కారణంగా.. పాత కార్ల వినియోగం బాగా తగ్గింది. దీంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు కేవలం అవగాహన కోసం (సూచన ప్రాయం) మాత్రమే. గాంధీ ఈ బ్రాండ్ కార్లను ఉపయీగించారు అని చెప్పడానికి మాత్రమే. పాఠకులు గమనించగలరు.