భారతీయుడు 2: కమల్ హాసన్ కార్లు చూశారా? లోకనాయకుడంటే ఆ మాత్రం ఉంటది!

Bharateeyudu 2 Actor Kamal Haasan Car Collection: కమల్ హాసన్ (Kamal Haasan).. ఈ పేరుకు యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే మూడున్నర సంవత్సరాల పసి వయసులోనే కలత్తూర్ కన్నమ్మ అనే సినిమాలో సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన కేవలం నటుడుగా మాత్రమే కాకుండా.. గాయకుడుగా, నిర్మాతగా, కథా రచయితగా, రాజకీయ నాయకుడుగా.. అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టి లోక నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. కాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న (జులై 12) విడుదులకానుంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని భావిస్తున్నాము.

సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసి ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న కమల్ హాసన్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారు. వాటి ధర ఎంత? వాటి వివరాలు ఏంటి అనేది వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

కమల్ హాసన్ కార్లు

నటుడు కమల్ హాసన్ ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ, లెక్సస్ ఎల్ఎక్స్ 570, టయోటా ప్రాడో, మిత్సుబిషి పజెరో, మెర్సిడెస్ బెంజ్ ఈ 220, హమ్మర్ హెచ్3, రేంజ్ రోవర్ ఎవోక్ మరియు ఆడి ఏ8 ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ (BMW 730Ld)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన 730ఎల్‌డీ కారు కమల్ హాసన్ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.35 కోట్లు వరకు ఉంటుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 2993 సీసీ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 262 Bhp పవర్ మరియు 2000 rpm వద్ద 620 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం.ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. తద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 (Lexus LX 570)

భారతీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన జపాన్ కార్ల తయారీ సంస్థ లెక్సస్ కంపెనీకి చెందిన ఎల్ఎక్స్ 570 కారు కూడా కమల్ హాసన్ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 2.33 కోట్లు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఒక్క చూపుతోనే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు 5663 సీసీ 8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5600 rpm వద్ద 362 Bhp పవర్ మరియు 3200 rpm వద్ద 530 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 220 కిమీ కావడం గమనార్హం.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో (Toyota Landcruiser Prado)

ఒకప్పుడు ఎక్కువమంది సెలబ్రటీలకు ఇష్టమైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసిన టయోటా కంపెనీకి చెందిన ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కూడా నటుడు కమల్ హాసన్ గ్యారేజిలో ఉంది. దీని ధర సుమారు రూ. కోటి వరకు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని దేశీయ మార్కెట్లో నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ల్యాండ్ క్రూయిజర్ అప్డేటెడ్ మోడల్స్ మాత్రం అమ్మకానికి ఉన్నాయి.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కారు 2982 సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి 171 Bhp పవర్ మరియు 410 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే పనితీరు పరంగా ఇది చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

మిత్సుబిషి పజెరో (Mitsubishi Pajero)

సుమారు రూ. 30 లక్షల ఖరీదైన మిత్సుబిషి పజెరో కూడా కమల్ హాసన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. నిజానికి ఈ కారు ఒకప్పుడు అత్యుత్తమ అమ్మకాలు పొంది ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఆ తరువాత కాలంలో కంపెనీ ఇందులోనే అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేసింది. మిత్సుబిషి పజెరో కేవలం కమల్ హాసన్ గ్యారేజిలో మాత్రమే కాకుండా ఇతర ప్రముఖుల గ్యారేజిలో కూడా ఉందని సమాచారం.

మెర్సిడెస్ బెంజ్ ఈ220 (Mercedes Benz E220)

కమల్ హాసన్ గ్యారేజిలోని మరో జర్మన్ లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ220. దీని ధర రూ. 72.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది 1950 సీసీ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 3800 rpm వద్ద 192 Bhp పవర్ మరియు 1600 – 2800 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ టాప్ స్పీడ్ 240 కిమీ/గం.

హమ్మర్ హెచ్3 (Hummer H3)

మహేంద్ర సింగ్ ధోని, అల్లు అర్జున్ వంటి ప్రముఖుల గ్యారేజిలో కూడా హమ్మర్ కార్లు ఉన్నట్లు గతంలో తెలుసుకున్నాం. కాగా హమ్మర్ హెచ్3 కారు కమల్ హాసన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. ఈ కారు ధర రూ. 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 3700 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque)

భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసిన కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు ఈ రేంజ్ రోవర్ ఎవోక్. ఇది కమల్ హాసన్ గ్యారేజిలో కూడా ఉంది. దీని ధర రూ. 67.90 లక్షలు ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి కమల్ హాసన్ గ్యారేజిలోని కారు ఏ ఇంజిన్ ఆప్షన్ పొంది ఉందని ఖచ్చితంగా తెలియడం లేదు. అయితే ఈ మోడల్ టాప్ 213 నుంచి 221 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది దాని ప్రత్యర్థుల కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది.

Don’t Miss: లక్షల ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి – ఫోటోలు చూశారా?

ఆడి ఏ8 ఎల్ (Audi A8 L)

కమల్ హాసన్ గ్యారేజిలోని మరో కారు ఆడి కంపెనీకి చెందిన ఏ8 ఎల్. దీని ధర రూ. కోటి కంటే ఎక్కువే. ఇది 2995 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 344 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. ఆధునిక డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో విరివిగా అందుబాటులో ఉన్నాయి.