Birthday Special Taapsee Pannu Expensive Car Collection: ప్రముఖ నటి ‘తాప్సి’ (Taapse Pannu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తాప్సి పన్ను.. ఆ తరువాత వీర, షాడో, మొగుడు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అతి తక్కువ కాలంలోనే సినీ ప్రపంచంలో గొప్ప పేరుతెచ్చుకున్న ఈమె ఖరీదైన కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతుంది. ఈ రోజు (ఆగష్టు 1) తాప్సి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందో.. వివరంగా తెలుసుకుందాం.
మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 (Mercedes Benz GLS 600)
తాప్సి గ్యారేజిలో ఉన్న ఖరీదైన లగ్జరీ కార్లలో జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన ‘బెంజ్’ కంపెనీకి చెందిన ‘మేబ్యాక్ జీఎల్ఎస్ 600’ ఒకటి. సుమారు రూ. 3.5 కోట్లు ఖరీదైన ఈ కారు మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు ఈ కారుని ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.
పల్లాడియం సిల్వర్ షేడ్‌లో ఉన్న మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 కారుని తాప్సి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ కారు నాప్పా లెదర్ అప్‌హోల్‌స్టరీ, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ మసాజింగ్ సీట్లు మరియు మరెన్నో విలాసవంతమైన ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది.
మేబ్యాక్ జీఎల్ఎస్ 600 కారు 4.0 లీటర్ వీ8 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 557 పీఎస్ పవర్ మరియు 730 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని 48వీ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ 22 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350 (Mercedes Benz GLE 350)
తాప్సీ పన్ను వద్ద మరో ఖరీదైన లగ్జరీ కారు ‘మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350’. దీని ధర రూ. 60 లక్షలు నుంచి రూ. 80 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారుపై తాప్సి పడుకున్న ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ఆమె మార్గరెట్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350 SUV 2.9 లీటర్ 6 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 268 బిహెచ్‌పి పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్1 (BMW X1)
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్1 కూడా తాప్సి గ్యారేజిలోని మరో ఖరీదైన కారు. బెంజ్ కారు కొనుగోలు చేయడానికి ముందు ఈమె ఈ కారునే ఎక్కువగా వినియోగించినట్లు సమాచారం. ఇక్కడ కనిపిస్తున్న తాప్సి బీఎండబ్ల్యూ ఎక్స్1 అనేది ఫస్ట్ జనరేషన్ కారు.
బీఎండబ్ల్యూ ఎక్స్1 కారులో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 105 Bhp పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 184 Bhp పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
జీప్ కంపాస్ (Jeep Compass)
అమెరికన్ కార్ల తయారీ సంస్థ ‘జీప్’ కంపెనీకి చెందిన కంపాస్ కూడా నటి తాప్సి గ్యారేజిలో ఉంది. 2019 జూన్ నెలలో కొనుగోలు చేసిన ఈ కారు అద్భుతమైన మెగ్నీసియో గ్రే యొక్క చాలా క్లాసీ షేడ్‌లో కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ఫోటోలను గమనించినట్లయితే ఇది బ్రాండ్ యొక్క టాప్ ఎండ్ మోడల్ అని తెలుస్తోంది.
Don’t Miss: సునీల్ శెట్టి మనసు దోచిన బుల్లి కారు! ధర చాలా తక్కువ..
జీప్ కంపాస్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. పెట్రోల్ వేరియంట్‌లు 1.4 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా 160 బిహెచ్‌పి పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వేరియంట్‌లలో 2.0 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 171 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.