BYD eMax 7 Electric Car Launched in India: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనీస్ వాహన తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఎట్టకేలకు దేశీయ విఫణిలో తన ఈమ్యాక్స్ 7 (eMax 7) ఎంపీవీ లాంచ్ చేసింది. ఇప్పటికే బీవైడీ కంపెనీ ఆట్టో 3, సీల్ వంటి కార్లను విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు ఈ మ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా హుందాగా ఉంది.
ధర
మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బీవైడీ ఈమ్యాక్స్ 7 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ప్రీమియం, సుపీరియర్. వీటిని ధరలు వరుసగా రూ. 26.9 లక్షలు, రూ. 29.9 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). సెప్టెంబర్ 20 నుంచి కంపెనీ ఈ కారు కోసం రూ. 51000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
కలర్ ఆప్షన్స్ & డిజైన్
కొత్త బీవైడీ ఈమ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్ మరియు కాస్మోస్ బ్లాక్ కలర్స్.
మూడు వరుసల సీటింగ్ పొజిషన్ కలిగిన ఈ కారు.. ఇండియన్ మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు 6 సీటర్ మరియు 7 సీటర్ రూపంలో అందుబాటులో ఉంది. అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్, కొత్త బంపర్, రెండు చివర్లలో క్రోమ్ ఎలిమెంట్స్ వంటివి ఈ కారులో ఉన్నాయి. 225/55 ఆర్17 టైర్లతో కొత్త డిజైన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు.
ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్
ఎక్స్టీరియర్ డిజైన్ మాదిరిగానే.. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 12.8 ఇంచెస్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీని చుట్టూ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉండటం చూడవచ్చు. అయితే సెంటర్ కన్సోల్ కొంత సవరించబడి ఉండటం చూడవచ్చు. ఈ కారులో రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, కొత్త స్విచ్‌గేర్, డ్రైవ్ సెలెక్టర్ లివర్ వంటివి ఉన్నాయి. స్టీరింగ్ వీల్ కూడా కొత్తది కావడం గమనార్హం.
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచెస్ ఎల్‌సీడీ ఎమ్ఐడీతో అనలాగ్ డయల్స్ ఉన్నాయి. ఈమ్యాక్స్ 7 యొక్క రెండు వేరియంట్లలోనూ.. లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్ ఉంటుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్, పవర్ అండ్ వెంటలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫ్రేమ్‌లెస్ ఫ్రంట్ వైపర్స్, రూఫ్ రెయిల్స్ కూడా ఈ కారులో ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఇందులో ఉన్నట్లు సమాచారం.
బ్యాటరీ మరియు రేంజ్
బీవైడీ ఈమ్యాక్స్ 7 యొక్క ప్రీమియం వేరియంట్ 55.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 420 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే సుపీరియర్ వేరియంట్ 71.8 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈమ్యాక్స్ 7 ప్రీమియం ట్రిమ్ 163 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 10.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. సుపీరియర్ ట్రిమ్ 204 హార్స్ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
Don’t Miss: మహీంద్రా థార్ కొనుగోలుపై రూ.1.60 లక్షల డిస్కౌంట్స్: మళ్ళీ రాదు ఈ ఆఫర్
ఈ రెండు వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ కావడం గమనార్హం. ఈ రెండు ట్రిమ్స్ 7కేడబ్ల్యు ఛార్జర్ పొందుతాయి. ప్రీమియం వేరియంట్ 89కేడబ్ల్యు డీసీ ఛార్జర్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోగలదు. సుపీరియర్ వేరియంట్ 115కేడబ్ల్యు ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. బీవైడీ కంపెనీ బ్యాట్రీపైన 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీ వారంటీ అందిస్తుంది. మోటార్ మీద 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిమీ వారంటీ అందిస్తుంది.