Car Sales in 2025 January: 2024లో సజావుగా సాగిన కార్ల అమ్మకాలు.. 2025లో కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. జనవరిలో కూడా పలు కంపెనీలు మంచి సంఖ్యలో కార్లను విక్రయించాయి. మారుతి సుజుకి, ఎంజీ మోటార్ మరియు టయోటా కంపెనీలు అమ్మకాల్లో దూసుకెళ్లాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ కథనంలో ఏ బ్రాండ్ కార్లు ఎన్ని అమ్ముడయ్యాయో వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి (Maruti Suzuki)
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి 2025 జనవరిలో దేశీయ విఫణిలో 1,73,599 ప్యాసింజర్ కార్లను విక్రయించింది. ఈ సేల్స్ 2024 జనవారితో పోలిస్తే 4 శాతం ఎక్కువ. మినీ కార్ల అమ్మకాల్లో కంపెనీ కొంత నత్తనడకగానే ముందుకు సాగింది. 2024తో పోలిస్తే ఈ అమ్మకాలు కూడా 10 తక్కువని తెలుస్తోంది. కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 7.4 శాతం పెరిగాయి. యుటిలిటీ వాహనాల సేల్స్ కూడా 4.92 శాతం పెరిగింది. ఎగుమతులు 27100 కావడం గమనార్హం. మొత్తం మీద భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచింది.
హ్యుందాయ్ (Hyundai)
దేశంలో అత్యధిక కార్లను విక్రయించిన కార్ల కంపెనీల జాబితాలో హ్యుందాయ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ గత నెలలో 65,603 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య అంతకు ముందు ఏడాదితో (2024 జనవరి) పోలిస్తే 3 శాతం తక్కువ (67,615 యూనిట్లు). దేశీయ అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ.. ఎగుమతులు కొంత పెరిగాయి. కంపెనీ 2025 జనవరిలో 11600 కార్లను ఎగుమతి చేసింది. ఈ సంఖ్య 2024 జనవరితో పోలిస్తే 10.47 శాతం ఎక్కువ. కాగా కంపెనీ జనవరి ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో క్రెటా ఈవీ లాంచ్ చేసింది. కాబట్టి అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.
టాటా మోటార్స్ (Tata Motors)
భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా గత నెలలో కొంత ఆశాజనక అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఈవీ అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. జనవరి 2025లో కంపెనీ విక్రయించిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 48,316 యూనిట్లు. ఈ సంఖ్య 2024 జనవారితో పోలిస్తే 11 శాతం తక్కువ. అంటే ఆ సమయంలో మార్కెట్లో అమ్ముడైన కార్ల సంఖ్య 53,663 యూనిట్లు.
టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ 25 శాతం తగ్గింది. 2025 జనవరిలో కంపెనీ 5240 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ అమ్మకాలు 2024 జనవరిలో 6,979 కావడం గమనార్హం. ఎగుమతులు కూడా 40 శాతం తగ్గాయి. మొత్తం మీద గత నెలలో ఎక్కువ కార్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టాటా మోటార్స్ మూడో స్థానంలో నిలిచింది.
టయోటా (Toyota)
ఇక టయోటా యొక్క అమ్మకాల విషయానికి వస్తే.. ఈ కంపెనీ జనవరిలో 29371 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ సేల్స్ 23197 యూనిట్లు. అంటే కంపెనీ సేల్స్ 2025లో 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎగుమతులు కూడా కొంత పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor)
ఎంజీ మోటార్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సంస్థతో జత కట్టిన తరువాత విపరీతంగా పెరిగాయి. కంపెనీ 2025 జనవరిలో 4455 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ సేల్స్ 2024 జనవరితో పోలిస్తే.. 256 శాతం ఎక్కువ. ఈవీ అమ్మకాలు కూడా 70 శాతం పెరిగాయి. కంపెనీ ఎప్పటికప్పుడు తన అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే జనవరి ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో పలు కొత్త కార్లను ఆవిష్కరించింది. కాబట్టి ఎంజీ మోటార్ అమ్మకాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra)
దేశీయ దిగ్గజం మహీంద్రా కంపెనీ జనవరి 2025లో 18 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అంటే సంస్థ గత నెలలో 50659 కార్లను విక్రయించింది. ఎగుమతులతో కలిపి ఈ అమ్మకాలు 52,306 కావడం గమనించదగ్గ విషయం. మహీంద్రా కంపెనీ ఇటీవల బీఈ 6 మరియు ఎక్స్ఈవీ 9ఈ అనే ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇవి చూడటానికి కొత్తగా అనిపించడమే కాకుండా.. సేఫ్టీలో కూడా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. కాబట్టి ఈ కార్ల సేల్స్ మొదలైన తరువాత మహీంద్రా అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.
కియా మోటార్స్ (Kia Motors)
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. 5 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ గత నెలలో 25,025 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో సోనెట్, కారెన్స్ మరియు సెల్టోస్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు కార్ల అమ్మకాలు వరుసగా.. 7194, 5522 మరియు 6470 యూనిట్లుగా ఉన్నాయి.
Also Read: సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ధర ఎంతో తెలుసా?
హోండా (Honda)
భారతదేశంలో హోండా అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2024 జనవరి కంటే 2025 జనవరిలో కంపెనీ సేల్స్ 7 శాతం తగ్గాయి. గత నెలలో సంస్థ 12304 కార్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు 7325 యూనిట్లు అని తెలుస్తోంది. ఎగుమతులు మాత్రం కొంత పెరుగుదలను నమోదు చేశాయి. హోండా జనవరి 2025లో 4979 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది. 2024 జనవరిలో కంపెనీ ఎగుమతి చేసిన కార్లు 4531 మాత్రమే.