కేవలం 100మందికి మాత్రమే ‘ధోని స్పెషల్ ఎడిషన్’ – ధర కూడా తక్కువే!

Citroen C3 Aircross Dhoni Special Edition Launched in India: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ‘సిట్రోయెన్’ (Citroen).. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ‘సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్’ (C3 Aircross Dhoni Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం ఈ రోజు (జూన్ 18) నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో విక్రయించబడుతుంది. ఈ కొత్త కారు కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే దీన్ని కేవలం వందమంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

డిజైన్

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ అనేది ఇండియన్ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జెర్సీ ఆధారంగా.. కారు మీద 7 నెంబర్ చూడవచ్చు. అంటే ఇది 7 సీటర్ వేరియంట్. ఇది 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కొనుగోలు చేసేవారికి ధోని సంతకం చేసిన కీపింగ్ గ్లోవ్ అందిస్తారు. ఇవి కారు యొక్క గ్లోవ్ బాక్సులో ఉంచి అందిస్తారు. ఇది చూడటానికి సాధారణ మోడల్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

కొత్త సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డాష్‌క్యామ్, కుషన్ ఎల్లో, సీట్ బెల్ట్ కుషన్ మరియు ఇల్యూమినేటెడ్ స్టెప్ బోర్డ్ మొదలైనవి ఉన్నాయి.ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ డ్యూయెల్ టోన్ (వైట్ రూప్ మరియు బ్లూ బాడీ) కలర్ పొందుతుంది. సైడ్ ప్యానెల్‌లోని ఫ్రంట్ డోర్ మీద ధోని ఎడిషన్ స్టిక్కర్, వెనుక భాగం సెవెన్ (7) అనే నెంబర్ కనిపిస్తుంది.

ఫీచర్స్

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం మీద ఇందులోని ఫీచర్స్ దాదాపు దాని స్టాండర్డ్ ఎడిషన్‌లోని ఫీచర్స్ మాదిరిగానే ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇంజిన్

సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్.. స్టాండర్డ్ సీ3 ఎయిర్‌క్రాస్‌లోని అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో అదే 1.2 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 110 హార్స్ పవర్ మరియు 190 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

కంపెనీ యొక్క సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ లాంచ్ సందర్భంగా.. సిట్రోయెన్ ఇండియా డైరెక్టర్ శిశిర్ మిశ్రా మాట్లాడుతూ.. ధోని పేరుతో స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. ఇది మా బ్రాండ్ అంబాసిడర్ ధోని లీడర్షిప్, ఎక్సలెన్స్ వంటివి వాటిని చూపిస్తుంది. ఇది తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Don’t Miss: హిందూపూర్ ఎంఎల్ఏ ‘బాలయ్య’ వాడే రూ.4 కోట్ల కారు గురించి తెలుసా!

గతంలో సచిన్ టెండూల్కర్‌తో ఫియట్

నిజానికి వాహన తయారీ సంస్థలు క్రికెటర్లతో చేతులు కలపడం ఇదే మొదటిసారి కాదు. 2002లో ఫియట్ కంపెనీ సచిన్ టెండూల్కర్‌తో చేతులు కలిపి పాలియో ఎస్10ని విడుదల చేసింది. అప్పట్లో ఇది 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడిన లిమిటెడ్ ఎడిషన్. ఈ కారు సచిన్ గుర్తులకు దగ్గరగా ఉన్నట్లు డిజైన్ చేశారు. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్, సచిన్ ఆటోగ్రాఫ్ మొదలైనవన్నీ ఉండేవి. ఆ తరువాత ఇప్పుడు సిట్రోయెన్ ధోనితో జత కట్టి సీ3 ఎయిర్‌క్రాస్ ధోని ఎడిషన్ అనే కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.