Manmohan Singh: మీకు తెలుసా?.. మన్మోహన్ సింగ్‌ మనసుదోచిన కారు ఇదే!

Manmohan Singh Favorite Car: చాలామంది చిన్న రాజకీయ నాయకులే.. ఖరీదైన కార్లను ఉపయోగించేస్తున్నారు. అలాంటిది ఒక దేశ ప్రధాని ఎలాంటి కారు ఉపయోగిస్తారో?.. ఎలాంటి కార్లను ఉపయోగించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ని కార్లు ఉన్నా.. మన దివంగత ప్రధాని ‘మన్మోహన్ సింగ్’ (Manmohan Singh)కు ఇష్టమైన కారు ఏదో తెలిస్తే తప్పకుండా నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత? ఆ కారుకు మార్కెట్లో ఏమైనా డిమాండ్ ఉందా? అనే వివరాలు వివరంగా ఇక్కడా తెలుసుకుందాం.

మాజీ ప్రధానమంత్రి ‘మన్మోహన్ సింగ్’ మృతికి.. యావత్ భారతదేశం సంతాపం తెలుపుతోంది. రాజకీయం నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు అందరూ.. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సహాయమంత్రి ‘అసిమ్ అరుణ్’ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. మన్మోహన్ సింగ్ చాలా నిరాడంబరమైన వ్యక్తి అని పేర్కొన్నారు.

మన్మోహన్ సింగ్‌ మనసుదోచిన కారు

దేశానికీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ.. చాలా నిరాడంబరంగా ఉండేవారని.. ఆయన కోసం అనేక భద్రతా విమానాలు, బీఎండబ్ల్యూ సెడాన్స్ వంటివి ఉన్నప్పటికీ.. మన్మోహన్ సింగ్ మాత్రం ‘మారుతి సుజుకి 800’ (Maruti Suzuki 800) కారును ఎక్కువగా ఇష్టపడేవారిని ‘అసిమ్ అరుణ్’ (Asim Arun) చెప్పారు. ఇది ఒక విధంగా మధ్యతరగతితో సింగ్‌కు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని మరియు శ్రామిక వర్గం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు.

అసిమ్ అరుణ్ సుమారు మూడేళ్లపాటు మన్మోహన్ సింగ్ స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (SPG)లో అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో చాలా సన్నిహితంగా ఉన్నారు. అప్పుడే మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం, వినయం వంటి వాటి గురించి తెలుసుకున్నారు. ఆ సమయంలోనే విమానాలు, ఖరీదైన కార్లలో ప్రయాణించడం కంటే.. మారుతి సుజుకి 800 కారులో ప్రయాణించడం తనకు ఇష్టమని తెలుసుకున్నారు.

మన్మోహన్ సింగ్ తన వ్యక్తిగత కారుగా ‘మారుతి 800’ కారును కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే సింగ్ ప్రోటోకాల్ ప్రకారం.. అతనికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో జర్మన్ బ్రాండ్ కార్లను ఉపయోగించారు. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఆయన ప్రయాణానికి ఉపయోగించారు. ఏది ఏమైనా అసిమ్ నాకు ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం ఇష్టం లేదు, నా కారు మారుతి అని చెప్పినట్లు అసిమ్ పేర్కొన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1994 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి కారు లాంచ్ సందర్భంగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మారుతి కారు మీద మన్మోహన్ సింగ్‌కు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.

మారుతి సుజుకి 800

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసిన కార్ల జాబితాలో మారుతి సుజుకి 800 ఒకటి. దశాబ్దాల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఈ కారును ఇప్పటికి కూడా కొంతమంది వాహన ప్రేమికులు.. తమ రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పాత 800 మోడల్ కారు మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో లేదు.

Also Read: చిన్నప్పుడే తల్లి మరణం.. యూనివర్సిటీలో ప్రొఫెసర్: మన్మోహన్ సింగ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

ప్రస్తుతం భారతదేశంలో మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10) రూపంలో.. మారుతి 800 వారసత్వంగా అమ్మకానికి ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు.. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, మంచి డిజైన్ కలిగి.. వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది.

మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ మారుతి ఆల్టో కే10 కారులో.. 1.0 లీటర్ త్రీ సిలిండర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 హార్స్ పవర్, 89 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. మాన్యువల్ వెర్షన్ 24.39 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. ఆటోమాటిక్ వెర్షన్ 24.90 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగా కూడా ఎక్కువమంది మారుతి కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

Leave a Comment