Tesla Showrooms in And First Car in India: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలో.. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా (Tesla) కంపెనీ, భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పుడు కంపెనీ తన షోరూమ్‌లను ఎక్కడ ప్రారంభిస్తుందని విషయం కూడా తెలిసిపోయింది.
గతంలో టెస్లా కంపెనీ బెంగళూరులో, ముంబైలో తన షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు తన రెండు షోరూమ్‌లలో.. ఒకదాన్ని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో, మరొకదాన్ని ఢిల్లిలోని ఏరోసిటీలో ప్రారంభించనుంది. దీనికోసం ఇక్కడా స్థలాలను కూడా లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఈ రెండూ కూడా విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నాయి.
ఉద్యోగుల కోసం అన్వేషణ
కంపెనీ ప్రారంభించనున్న కొత్త షోరూమ్‌లలో పని చేయడానికి.. స్టోర్ మేనేజర్, సర్వీస్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాల కోసం నిపుణులను కూడా వెతుకుతోంది. కాగా.. కంపెనీ కార్లను కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా టెస్లా మోడల్ 3 కార్లను.. మాత్రమే మొదట ఇండియన్ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందని సమాచారం.
టెస్లా కంపెనీకి.. భారతదేశంలో తన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన లేనట్లే తెలుస్తోంది. ఈ కారణంగానే టెస్లా కార్లు సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి వస్తాయి. ఇండియన్ గవర్నమెంట్ కూడా 40000 డాలర్ల కంటే ఎక్కువ.. ఖరీదైన కార్ల మీద సుంకాలను 100 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ.. టెస్లా కార్లు ఖరీదైనవిగానే ఉండే అవకాశం ఉంది. మోడల్ 3 కార్ల ధరలు రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే అమెరికా విధించే సుంకాల కారణంగా.. ఎలక్ట్రిక్ కార్లపైన భారత్ సుంకాలను మరింత తగ్గిస్తుందా?.. లేదా? విషయం తెలియాల్సి ఉంది.
భారతదేశం కోసం తీసుకొచ్చే టెస్లా కార్ల యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. భారతీయ రోడ్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న టెస్లా కార్లు.. ఎలాంటి డిజైన్? ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంటాయనేది తెలియాల్సి ఉంది.
మోదీతో మస్క్ భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశం తరువాత, ఇండియాలో టెస్లా అరంగేట్రం ఖాయమైంది. ఈ కారణంగానే.. కంపెనీ కూడా ఉద్యోగుల కోసం నియమాలను చేస్తోంది. కాగా కంపెనీ ప్రారంభించనున్న ఒక్కో షోరూమ్ 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ షోరూమ్‌లను కంపెనీ ఎప్పుడు ప్రారంభిస్తుందనే విషయం మాత్రమే అధికారికంగా వెల్లడి కాలేదు.
టెస్లా మోడల్ 3 (Tesla Model 3)
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం.. టెస్లా భారతదేశంలో లాంచ్ చేయాలని భావిస్తున్న ‘మోడల్ 3’, బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఇది చూడటానికి బీఎండబ్ల్యూ 3 సిరీస్ మాదిరిగా ఉంటుంది. బ్యాటరీ ఎంపికలను బట్టి ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇండియన్ మార్కెట్లో టాప్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయ్యే సూచనలు ఉన్నాయి.
Also Read: బీవైడీ సీలియన్ 7 కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే ఎలా?
చూడటానికి అద్భుతంగా కనిపించే.. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ లాంగ్ రేంజ్ మోడల్ 78.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా.. ఒక సింగిల్ ఛార్జితో 678 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. 977 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు 5 సీటింగ్ ఆప్షన్ పొందుతుంది. అంతే కాకుండా ఇది వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుందని సమాచారం.
ఫీచర్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు 15.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది. పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, క్లైమేట్ కంట్రోల్ వంటివన్నీ పొందుతుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఇవి కాకుండా ఇతర ఫీచర్స్ ఏమైనా ఉంటాయా?.. ధరలు ఎలా ఉండనున్నాయి? అనే వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
Also Read: ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్: టెస్లాతో ఎలా పోటీ పడతామంటే?
టెస్లా కార్ల విక్రయాలు 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. కంపెనీ అప్పటికి షోరూమ్‌లను సిద్ధం చేయాలి.
మస్క్ సంపద మరియు కార్ కలెక్షన్స్ (ELon Musk Networth and Car Collection)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో టెస్లా మాత్రమే కాకుండా, ఎక్స్ (ట్విటర్), స్పేస్ఎక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత.. మస్క్ షేర్స్ భారీగా పెరిగాయి. దీంతో ఈయన సంపద భారీగా పెరిగిపోయింది. మొత్తం మీద ఈయన సంపద రూ. 34 లక్షల కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈయన ఉపయోగించే కార్ల జాబితాలో పోర్స్చే 911 టర్బో, హామాన్ బీఎండబ్ల్యూ ఎం5, 1920 ఫోర్డ్ మోడల్ టీ, 2010 ఆడి క్యూ7, 2008 టెస్లా రోడ్‌స్టర్, 1997 మెక్‌లారెన్ ఎఫ్1, టెస్లా మోడల్ ఎక్స్, టెస్లా మోడల్ ఎస్ మరియు టెస్లా సైబర్ ట్రక్ మొదలైనవి ఉన్నాయి.