Ram Charan New Rolls Royce Spectre: చిరుత సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ (Ram Charan) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. అయితే రామ్ చరణ్ ఇటీవల ఓ ఖరీదైన ‘రోల్స్ రాయిస్’ (Rolls Royce) ఎలక్ట్రిక్ కారులో కనిపించారు. ఇంతకీ రామ్ చరణ్ కనిపించిన ఎలక్ట్రిక్ కారు ఏది? దాని ధర ఎంత? ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఈ కారును మరెవరైనా కొనుగోలు చేశారా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రామ్ చరణ్ కొత్త కారు
నటుడు రామ్ చరణ్ ఇటీవల తన భార్య ఉపాసన కొణిదెల మరియు ముద్దుల కూతురు క్లింకరాతో కలిసి రోల్స్ రాయిస్ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రామ్ చరణ్ స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నారు. రామ్ చరణ్ సతీ సమేతంగా రేపు (జులై 12) ముంబైలో జరగనున్న ‘అనంత్ అంబానీ, రాధిక మర్చంట్’ పెళ్ళికి హాజరు కావడానికి వెళ్తున్నట్లు సమాచారం. వీరు రోల్స్ రాయిస్ కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
రామ్ చరణ్ ఈ కారును కొనుగోలు చేసినట్లు పలు కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే నిజంగా కొనుగోలు చేసారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేలా రామ్ చరణ్ ఈ కారును కొనుగోలు చేసినట్లయితే.. మెగాస్టార్ ఫ్యామిలీలో ఇది రెండో రోల్స్ రాయిస్ అవుతుంది. గతంలో చిరంజీవి ఓ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. కాగా ఇది మరో రోల్స్ రాయిస్ అవుతుంది.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ అనేది కంపెనీ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ. 7.5 కోట్లు ఉంటుందని సమాచారం. అయితే ఏ కారును ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు. కాబట్టి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారుకు హైదరాబాద్‌లో ఫస్ట్ ఓనర్ మన రామ్ చరణ్ కావడం విశేషం. ఈ కారు నలుపు రంగులో చూడచక్కగా ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే రామ్ చరణ్ కారును డ్రైవ్ చేస్తున్నారు. ఉపాసన బిడ్డతో విమానాశ్రయంలో దిగారు. ఆ తరువాత వీరిద్దరూ విమానాశ్రయం లోపలి వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ కొత్త కారు కొన్నాడన్న సంగతి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను విక్రయిస్తున్న ప్రముఖ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్.. స్పెక్టర్ కారుతో ఎలక్ట్రిక్ విభాగంలో ప్రవేశించింది. అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.5 కోట్లు. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ చార్జితో 530 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి 585 హార్స్ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి.
సుమారు 2890 కేజీలు బరువున్న రోల్స్ రాయిస్ స్పెక్టర్ కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారును 195 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 34 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో 50 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి పట్టే సమయం 95 నిమిషాలు.
Don’t Miss: భారతీయుడు 2: కమల్ హాసన్ కార్లు చూశారా? లోకనాయకుడంటే ఆ మాత్రం ఉంటది!
పొడవైన బానెట్, ఫాస్ట్‌బ్యాక్ టెయిల్ కలిగిన ఈ కారు పొడవు 5475 మిమీ, వెడల్పు 2017 మిమీ. ఇది ఏరో ఆప్టిమైజ్ 23 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఈ కారు లోపలి భాగం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. పైకప్పుతో పాటు డోర్ ప్యాడ్‌లలో స్టార్‌లైట్ లైనర్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ ‘స్పెక్టర్’ నేమ్‌ప్లేట్ పొందుతుంది. లోపల మొత్తం 5500 నక్షత్రాల మాదిరిగా ఉండే ఇల్యూమినేషన్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.