బీవైడీ కారు కొన్న ఫస్ట్ ఇండియన్ సింగర్ ‘జస్లీన్’: ఫోటోలు చూశారా?

Singer Jasleen Royal Buys BYD Atto3 Electric Car: సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ సింగర్ ‘జస్లీన్ రాయల్’ (Jasleen Royal) చైనా బ్రాండ్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

జస్లీన్ రాయల్ కొత్త కారు

సింగర్ జస్లీన్ కొనుగోలు చేసిన కొత్త కారు బీవైడీ కంపెనీకి చెందిన ‘ఆట్టో3 ఈవీ’ (Atto3 EV) అని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన ఈ కారు చాలామంది కొనుగోలు చేసినప్పటికీ.. సెలబ్రిటీలు కొనుగోలు చేయలేదు. కాబట్టి బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన మొదటి సెలబ్రిటీగా జస్లీన్ రాయల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

జస్లీన్ కారు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. బీవైడీ ఆట్టో3 అనేది నా ప్రయాణానికి సంగీతం, ఇది నన్ను నడిపిస్తుంది అని వెల్లడించింది. అంతే కాకుండా బీవైడీ కుటుంబంలో భాగమైనందుకు మరియు బీవైడీ ఆట్టో3 కారుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

బీవైడీ ఆట్టో3 (BYD Atto3)

భారతదేశంలో విక్రయించబడుతున్న బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) కంపెనీ యొక్క ఆట్టో3 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ప్రస్తుతం కంపెనీ ఇండియన్ మార్కెట్లో మూడు కార్లను విక్రయిస్తోంది. అవి ఈవీ6, ఆట్టో3 మరియు సీల్. ఈ మూడు కార్లు కొత్త డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

జస్లీన్ రాయల్ కొనుగోలు చేసిన బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు నలుపు రంగులో ఉంది. ఇది చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. ఈ కారులో 12.8 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటి వాటితో పాటు.. లెథెరెట్ అపోల్స్ట్రే మరియు ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఏడాది కంపెనీ బేస్ వేరియంట్ (డైనమిక్) లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 24.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు 49.92 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 60.48 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 468 కిమీ రేంజ్ మరియు 521 కిమీ రేంజ్ అందిస్తాయి.

ఛార్జింగ్ విషయానికి వస్తే.. బీవైడీ ఆట్టో3 ఎలక్ట్రిక్ కారు 80 kW ఛార్జర్ ద్వారా 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. సాధారణ ఛార్జర్ ద్వారా ఈ కారు 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 9.5 గంటల నుంచి 10 గంటలు అని తెలుస్తోంది. మొత్తం మీద బీవైడీ ఆట్టో3 కారు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని మరియు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని చాలామంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఎవరీ జస్లీన్ రాయల్?

నిజానికి జస్లీన్ రాయల్ పూర్తి పేరు జస్లీన్ కౌర్ రాయల్. ఈమె ఒక ఇండియన్ సింగర్ మరియు పాటల రచయిత్రి కూడా. జస్లీన్ పంజాబ్, హిందీ, బెంగాలీ, గుజరాతీ మరియు ఇంగ్లీష్ భాషల్లో పాటలు పాడింది. కాబట్టి బహుశా జస్లీన్ పేరు తెలుగు ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈమె పాపులర్ సింగర్. ఈమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.

Don’t Miss: ఆరు నెలల్లో 1.26 లక్షల మంది కొనేశారు!.. టాటా కారంటే ఆ మాత్రం ఉంటది

సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జస్లీన్ రాయల్ ఎట్టకేలకు ఓ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. కొత్త కారు కొనుగోలు చేసిన ఈమెకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. సెలబ్రిటీలు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలామంది ప్రముఖులు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేశారు. ఈ జాబితాలోకి జస్లీన్ కూడా ఇప్పుడు చేరింది.