దిగ్గజ తబలా విద్వాంసుడు ‘జాకీర్ హుస్సేన్’ ఇక లేరు

Famous Tabla Maestro Ustad Zakir Hussain Passes Away: ప్రముఖ తబలా విద్వాంసుడు మరియు కంపోజర్ ‘జాకీర్ హుస్సేన్’ (Zakir Hussain) ఈ రోజు (డిసెంబర్ 15) శాన్ ప్రాన్సిస్కోలో కన్నుమూశారు. 73 సంవత్సరాల హుస్సేన్ దిగ్గజ తబలా విద్వాంసుడు ‘ఉస్తాద్ అల్లా రఖా’ కుమారుడు. ఈయన గత రెండు వారాల నుంచి గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అయితే నేడు కన్నుమూశారు.

అనారోగ్యం కారణంగానే హుస్సేన్ పలు కచేరీలు కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. అతని ఆరోగ్య పరిస్థితి కొంత నిరాశాజనంగానే ఉన్నట్లు గత వారంలోనే వైద్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కూడా జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం చూసుకోడడానికి భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు.

చిన్నతనం నుంచే తబలా విద్య

1951 మార్చి9న ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ పూర్తి పేరు ‘జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి’. తండ్రి తబలా విద్వాంసుడు కావడం చేత హుస్సేన్ కూడా చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర తబలా నేర్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే తండ్రిని మించిన తనయుడిగా ప్రసిద్ధి చెందిన జాకీర్ హుస్సేన్ అనేక జాతీయ, అంతర్జాతీయ పురష్కారాలు కూడా సొంతం చేసుకున్నారు.

భారత ప్రభుత్వం ‘జాకీర్ హుస్సేన్’ను పద్మ భూషణ్, పద్మశ్రీ మరియు పద్మ విభూషణ్ వంటి అత్యున్నత సత్కారాలతో గౌరవించింది. అయితే ఈయన పదేళ్ల క్రితమే.. భారత్ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనేక సినిమాల్లో కూడా నటించిన జాకీర్ హుస్సేన్.. పలు గ్రామీ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

అంటొనియా మిన్నేకోలాతో వివాహం

ముంబైలో పూటి పెరిగిన జాకీర్ హుస్సేన్.. అక్కడే చదువుకున్నాడు. ఇతడు మాహిమ్‌లోని సెయింట్ మైఖేల్స్ హైస్కూల్‌లో తన ప్రాధమిక విద్యను పూర్తి చేసి.. ఆ తరువాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. ఈయన కథక్ నృత్యకారిణి మరియు ఉపాధ్యాయురాలు అయిన ‘అంటొనియా మిన్నేకోలా’ను వివాహం చేసుకున్నారు. వీరికి అనిసా ఖురేషి మరియు ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనిసా యూసీఎల్ఏ నుంచి పట్టభద్రురాలు అయింది. ఈమె ఫిల్మ్ మేకర్ కూడా. ఇక ఇసాబెల్లా మాన్‌హాటన్‌లో డ్యాన్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం.

దిగ్గజాల సంతాపం

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణం చాలామందిని కలచి వేచింది. కమల్ హాసన్, ఆనంద్ మహీంద్రా, హన్సల్ మెహతా, పినరయి విజయన్, హర్ష గోయెంకా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలైనవారు జాకీర్ హుస్సేన్ మరణం శాస్త్రీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సంతాపం తెలియజేసారు.

తబలా విద్వాంసుడుగా ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినా.. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలనేది జాకీర్ హుస్సేన్ సిద్ధాంతం. మనల్ని మనం బెస్ట్ అని ఎప్పడూ అనుకోకూడదని మా నాన్న చుబుతూ ఉండేవాడని హుస్సేన్ గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. నా రంగంలో నేను ఎన్ని ఉత్తమ ప్రదర్శనకు ఇచ్చినప్పటికీ.. నా కంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు కనీసం 15 కంటే ఎక్కువ చెప్పగలను అని అంటూ ఉండేవారు జాకీర్ హుస్సేన్. దీన్ని బట్టి చూస్తే ఈయన ఎంత వినయమైన స్వభావం కలిగిన వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు.

Leave a Comment