First Mahindra Thar Roxx Car To Be Auctioned: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 2024 ఆగష్టు 15న దేశీయ విఫణిలోకి ‘థార్ రోక్స్’ (Mahindra Thar Roxx) లేదా 5 డోర్స్ థార్ లాంచ్ చేసింది. సంస్థ ఈ కొత్త కారు కోసం అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. అంతకంటే ముందు కంపెనీ తన మొదటి రోక్స్ కారును వేలం వేయడానికి సంకల్పించింది. దీని నుంచి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు సమాచారం.
థార్ రోక్స్ కారును కంపెనీ వేలం వేయడానికి సిద్ధమైంది, కాబట్టి ఇందులో పాల్గొనాలనుకునేవారు సెప్టెంబర్ 12నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్ లాంచ్ అయినప్పుడు కూడా కంపెనీ వేలం నిర్వహించి.. మొదటి కారును ఏకంగా రూ. 1.1 కోట్లకు విక్రయించింది. దీనిని ఢిల్లీకి చెందిన ఆకాష్ మిండా కొనుగోలు చేసారు. అప్పట్లో ఈ వేలంలో సుమారు 5500 కంటే ఎక్కువమంది పాల్గొన్నారు.
మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ మాదిరిగానే.. థార్ రోక్స్ కూడా భారీ ధరకు వేలంలో అమ్ముడవుతుందని భావిస్తున్నాము. అయితే ఎవరు సొంతం చేసుకోనున్నారు? ఎంత ధరకు సొంతం చేసుకోనున్నారు? అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. వేలంలో విక్రయించనున్న మహీంద్రా థార్ రోక్స్ కారు టాప్ స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది VIN001 అనే బ్యాడ్జింగ్ పొందుతుంది. అంతే కాకుండా #1 అనే బ్యాడ్జింగ్ కూడా కనిపించనున్నట్లు సమాచారం.
క్యాబిన్ లోపల మెటల్ ప్లేట్స్, వీఐపీ నెంబర్ మరియు ”మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్” అని కూడా ఉంటుంది. వేలంలో కారును సొంతం చేసుకునే బిడ్డర్ కోరిక మేరకు కలర్ మరియు పవర్‌ట్రెయిన్ వంటివి అందిస్తారు. కాబట్టి విజేత ఎవరనేది త్వరలోనే తెలిసిపోతుంది.
థార్ రోక్స్ గురించి
మహీంద్రా థార్ రోక్స్ అనేది.. 3 డోర్ థార్ మోడల్ యొక్క నవీనీకరణ. కాబట్టి చూడటానికి థార్ మాదిరిగానే ఉన్నప్పటికీ పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఇది 5 డోర్స్ పొందుతుంది. ఇది స్టీల్త్ బ్లాక్, బర్న్ సియన్నా, డీప్ ఫారెస్ట్, బాటిల్‌షిప్ గ్రే, నెబ్యులా బ్లూ, టాంగో రెడ్ మరియు ఎవరెస్ట్ వైట్ అనే ఏడు రంగులలో లభిస్తుంది. ఈ కారు కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్మితమై ఉండటం చేత.. చాలా దృఢంగా ఉంటుంది.
థార్ రోక్స్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, 6 స్లాట్ గ్రిల్, ట్వీక్ చేయబడిన వీల్ ఆర్చెస్, కొత్త రూఫ్ లైన్, అప్డేటెడ్ రియర్ ఫ్రొఫైల్ మరియు 19 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఇది పూర్తిగా మెటాలిక్ బాడీ పొందుతుంది. ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అప్డేట్ పొందుతుంది. కాబట్టి ఇది విశాలమైన క్యాబిన్ పొందుతుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. మహీంద్రా థార్ రోక్స్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమాటిక్ ఏసీ, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లువంటి అనేక అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టం కూడా పొందుతుంది. ఇది వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో ఉపయోగపడుతుంది.
మహీంద్రా థార్ రోక్స్ 2.2 ఎంహాక్ డీజిల్ ఇంజిన్ మరియు 2.0 ఎంస్టాలిన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 173 బ్రేక్ హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 175 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది.
Don’t Miss: కొత్త కారు కొనుగోలుపై లక్షల డిస్కౌంట్స్!.. పండుగ సీజన్‌లో సరికొత్త ఆఫర్స్
థార్ 5 డోర్ వెర్షన్ అత్యుత్తమ పనితీరును అందించడానికి కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. పెట్రోల్ మోడల్ 12.4 కిమీ/లీ మైలేజ్ అందించగా.. డీజిల్ వెర్షన్ 15.20 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మహీంద్రా థార్ రోక్స్ 4×2 వేరియంట్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ 4×4 వెర్షన్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా కంపెనీ ఈ కారును బుక్ చేసుకున్న వారికి విజయదశమి నాటికి డెలివరీ చేసే అవకాశం ఉంది.