Ford New Plan For India Engine Manufacturing Chennai Plant: 2021లో ఉత్పత్తిని నిలిపివేసి భారతదేశాన్ని వీడిన అమెరికన్ కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ (Ford).. మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే మూతపడిన చెన్నై ప్లాంట్‌ను కంపెనీ మళ్ళీ ప్రారంభించనున్నట్లు సమాచారం. నిజంగా ఫోర్డ్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెడుతుందా? అని ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తుంటే.. మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఫోర్డ్ కంపెనీ.. తన చెన్నై కర్మాగారంలో కార్లను కాకుండా.. ఇంజిన్లు, విడి భాగాలను తయారు చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ కంపెనీ 2021లోనే వాహనాల ఉత్పత్తిని నిలిపివేయగా.. 2022 మధ్యలో మొత్తం కార్యకలాపాలను నిలిపివేసి.. భారత్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం?
చెన్నైలోని ఫోర్డ్ ప్లాంట్ పునరుద్దరణకు సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాగా ఇందులో రేంజర్ మరియు ఎవరెస్ట్ వంటి ఎలక్ట్రిక్ కార్లను భవిష్యత్తులో తయారు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ప్లాంట్‌ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనుగుణంగా మోడిఫై చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
ట్రంప్ సుంకాల ప్రభావం
అమెరికా అద్యక్షడు డొనాల్డ్ ట్రంప్.. చైనా, మెక్సికో, కెనడా దేశాలకు సంబంధించిన వస్తువుల దిగుమతులపై భారీ సుంకాలను విధించారు. అయితే ఈ సుంకాల ప్రభావం భారతదేశం మీద పెద్దగా లేదు. అంతే కాకుండా.. అమెరికన్ కంపనీలు ఇక్కడే (అమెరికాలోనే) ఉత్పత్తులను పెంచాలని కోరారు. ఇలాంటి సందర్భంలో ఫోర్డ్ ఇండియాలో తన ఉత్పత్తిని మళ్ళీ కొనసాగించడం సాధ్యమవుతుందా? అనేది ఓ ప్రశ్నగా మిగిలింది.
ట్రంప్ మాటలకు కట్టుబడి.. ఫోర్డ్ కంపెనీ అమెరికాలోనే ఉత్పత్తిని పెంచితే.. ఇండియాలో ఫోర్డ్ ఉత్పత్తి సాధ్యం కాదు. అయితే దిగుమతులు మాత్రమే జరుగుతాయి. టెస్లా కంపెనీ కూడా ఇండియన్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లను విక్రయించనున్నట్లు ప్రకటించింది. కానీ ఇక్కడ ఉత్పత్తి చేయడం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఫోర్డ్ కూడా టెస్లా బాటలోనే నడిచే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?
ఫోర్డ్ ఎలక్ట్రిక్ కార్లు
నిజానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలుపొందటానికి ముందు నుంచే.. ఫోర్డ్ ఇండియాలో మళ్ళీ తన కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా ఫోర్డ్ మళ్ళీ దేశీయ విఫణిలోకి అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదే నిజమైతే.. ఫోర్డ్ రేంజర్ మరియు ఎవరెస్ట్ వంటి కార్లను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయనుంది.
ప్రస్తుతం ఫోర్డ్ వాహనాల ఉత్పత్తి భారతదేశంలో లేకపోయినప్పటికీ.. కంపెనీ కార్లు మాత్రం దేశంలో లెక్కకు మించి వినియోగంలో ఉన్నాయి. ఒకప్పుడు గొప్ప అమ్మకాలతో.. సంచలనం సృష్టించిన ఫోర్డ్ కంపెనీ, ఆ తరువాత కాలంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో విజయం సాధించలేకపోయింది. ఈ కారణంగానే తన ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. కాగా దేశీయ విఫణిలోకి ఫోర్డ్ అడుగుపెట్టనున్నట్లు సమాచారం.