Hyundai Reach New Milestone at 10 Crore Vehicles Globally: సౌత్ కొరియా కార్ల తయారీ దిగ్గజం ‘హ్యుందాయ్ మోటార్’ (Hyundai Motor) ఉత్పత్తిలో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే సుమారు 57 సంవత్సరాల్లో 100 మిలియన్ యూనిట్లు (10 కోట్లు) వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోనే అత్యంత వేగవంతమైన ఉత్పత్తిగా సంస్థ ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.
హ్యుందాయ్ కంపెనీ తన 10 కోట్ల వాహనంగా ఐయోనిక్ 5 (ioniq 5)ను దక్షిణ కొరియాలోని ఉల్సావ్ ప్లాంట్‌లో కస్టమర్‌కు పంపిణీ చేసింది. ఈ కారుకు సంబంధించిన ఫోటోలను కూడా కంపెనీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జేహోన్ చాంగ్ మాట్లాడుతూ.. ”ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ వాహనాల ఉత్పత్తి చాలా గొప్ప విషయం. హ్యుందాయ్ బ్రాండ్ వాహనాలను ఎంచుకుని మాకు మద్దతు ఇస్తున్న మా కస్టమర్లకు ధన్యవాదాలు” తెలిపారు.
మొదటి కారు ‘పోనీ’
1968లో హ్యుందాయ్ కంపెనీ ఉల్సాన్ ప్లాంట్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. కొరియన్ ఆటోమొబైల్ పరిశ్రమకు ఇదే జన్మస్థలం కావడం గమనార్హం. కంపెనీ ఉత్పత్తి చేసిన మొట్టమొదటి ఉత్పత్తి పోనీ. దీనిని కంపెనీ 1975లో ఉత్పత్తి చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కంపెనీ ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే హ్యుందాయ్ కంపెనీకి ఆటోమొబైల్ పరిశ్రమలో ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.
కంపెనీ 10 కోట్ల వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ అండ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ హెడ్, చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ‘డాంగ్ సియోక్ లీ’ మాట్లాడుతూ.. కంపెనీ ఉన్నతికి, ఉత్పత్తిలో 100 మిలియన్ రికార్డ్ కైవసం చేసుకోవడానికి సహకరించిన ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు. కంపెనీ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి ఇదొక అడుగు అన్నారు.
2013లో 50 మిలియన్ వాహనాలు
హ్యుందాయ్ కంపెనీ 2013లో 50 మిలియన్ వాహనాల ఉత్పత్తి చేసిన ఘనత సాధించింది. కాగా ఇప్పటికి ఈ సంఖ్య 100 మిలియన్లకు చేరింది. కంపెనీ తన వాహనాలను సౌత్ కొరియాలో మాత్రమే కాకుండా టర్కీ, ఇండియా మరియు అమెరికా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా ఉత్పత్తి చేస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తన ఉనికిని మరింత పెంచుకోనుంచి. అంతే కాకుండా గ్లోబల్ మార్కెట్లో మరిన్ని కొత్త వాహనాలను లాంచ్ చేయనుంది.
ఇండియాలోని హ్యుందాయ్ కార్లు
ప్రస్తుతం భారదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో హ్యుందాయ్ కంపెనీ తన వాహనాలను విజయవంతంగా విక్రయిస్తోంది. కంపెనీ ఇప్పుడు భారతదేశంలో సుమారు 18 కార్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇందులో హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ టక్సన్, హ్యుందాయ్ ఐయోనిక్ 5, హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఆల్కజార్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్, హ్యుందాయ్ ఐయోనిక్ 6 మొదలైనవి ఉన్నాయి.
హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా మరియు వెన్యూ వంటి కార్లు భారతదేశంలో అధిక అమ్మకాలను పొందగలిగాయి. ఇటీవల కంపెనీ తన 2024 ఆల్కజార్ కారును లాంచ్ చేసింది. కంపెనీ యొక్క దాదాపు అన్ని వాహనాలు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా హ్యుందాయ్ కార్లను షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇవి రోజువారీ వినియోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.
Don’t Miss: మొన్ననే ఇల్లమ్మేసింది.. ఇంతలోనే కోట్లు పెట్టి కొత్త కారు కొన్న బ్యూటీ
అప్‌కమింగ్ హ్యుందాయ్ కార్లు
ఆటోమొబైల్ పరిశ్రమలో నిరంతరం తన ఉనికిని చాటుకుంటున్న హ్యుందాయ్ కంపెనీ రాబీయే రోజుల్లో మరికొన్ని కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, 2024 కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 6, హ్యుందాయ్ న్యూ శాంటా ఫే మొదలైనవి ఉన్నాయి. ఇవి ఈ ఏడాది చివర నాటికి లేదా.. వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ కానున్నాయి.