India Bike Week 2024 Dates: ఆసియాలోనే అతిపెద్ద బైకింగ్ పెస్టివల్ ‘ఇండియా బైక్ వీక్ 2024 లేదా ఐబీడబ్ల్యు 2024’ (India Bike Week 2024) ఎప్పటిలాగే గోవాలోని వాగేటర్‌లో నిర్వహించబడుతుంది. ఇది డిసెంబర్ 6 మరియు 7వ తేదీలలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బైక్ రైడర్లు విచ్చేయనున్నారు.
ఇండియా బైక్ వీక్ అనేది కేవలం బైకింగ్ ఫెస్టివల్ మాత్రమే కాదు.. ఈ ఈవెంట్‌లో అనేక కొత్త బైకులు లాంచ్ అవుతాయి. గత ఏడాది ఐబీడబ్ల్యు 2024 ఈవెంట్‌లో ట్రయంఫ్ రాకెట్ 3, కెటిఎమ్ 790 అడ్వెంచర్, కవాసకి ఎలిమినేటర్, ఏప్రిలియా ఆర్ఎస్457 యొక్క 2024 ఎడిషన్ వంటి కొత్త బైకులు ప్రారంభించబడ్డాయి. ఈ ఏడాది కూడా ఐబీడబ్ల్యు 2024 వేదికగా సరికొత్త బైకులు లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఐబీడబ్ల్యు 2024 ఈవెంట్‌లో బైక్ రేసింగ్, మోటార్‌సైకిల్స్ మరియు బైకింగ్ గేర్‌ల కోసం వివిధ స్టాల్స్, రైడింగ్‌కు సంబంధించిన సెమినార్స్, లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు వంటివి ఉంటాయి. అంతే కాకుండా ఇప్పటి వరకు కనిపించని చాలా రకాల విచిత్రమైన బైకులు ఈ ఈవెంట్‌లో దర్శనమిస్తాయి. గత ఏడాది జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలను మీరు గమనిస్తే.. బైక్ వీక్ ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమైపోతుంది.
గోవా ఐబీడబ్ల్యు 2024 ఈవెంట్‌లో బైకుల ప్రదర్శన, రేసింగ్ వంటి వాటితో పాటు ప్రత్యేకమైన గోవా వంటకాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త ఉత్పత్తులు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏ బైకులు లాంచ్ అవుతాయి అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలంటే
గోవాలో డిసెంబర్ 6, 7న జరిగే.. ఇండియా బైక్ వీక్ 2024లో పాల్గొనాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొనాలంటే డే పాస్ కోసం రూ. 1999, వీకెండ్ పాస్ కోసం రూ. 2999 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫుడ్ మరియు బెవరేజ్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇండియా బైక్ వీక్ ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు
బైక్ రైడర్లు ఎంతగానో ఎదురుచూసే ఈ ఇండియా బైక్ అనేది 2013లో ప్రారంభమైనట్లు సమాచారం. దీనిని మార్టిన్ డా కోస్టా ప్రారంభించారు. ఈ బైక్ ఫెస్టివల్ ప్రారంభమైనప్పుడే సుమారు 5000 కంటే ఎక్కువమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ బైక్ వీక్ ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు.
ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌లో పెట్రోల్‌హెడ్‌లు, భారీ ఆకారంలో ఉండే వివిధ రకాల బైకులు కనిపిస్తాయి. భారతీయ మోటార్ సైకిల్ సంస్కృతిని అన్వేషించడానికి, వివిధ రకాల బైకులను ఒకే చోట చూడటానికి ఐబీడబ్ల్యు ఓ మంచి వేదిక. 2013 నుంచి విజయవంతంగా నిర్వహించబడుతున్న ఈ ఈవెంట్‌కు.. కరోనా మహమ్మారి ఆటంకం కలిగించింది. ఆ తరువాత మళ్ళీ ఈ ఈవెంట్ యధావిధిగా నిర్వహించబడుతోంది. ఈ సారి కూడా ఈ ఈవెంట్ నిర్విఘ్నంగా ముగుస్తుందని భావిస్తున్నాము.
ఇండియా బైక్ వీక్‌లో పాల్గొనే దేశాలు
డిసెంబర్ 6, 7వ తేదీలలో జరగనున్న ఇండియా బైక్ వీక్ 2024లో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి ఔత్సాహికులు రానున్నారు. అయితే ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ రెండు రోజులు జరిగే ఈ ఈవెంట్ కన్నుల పండుగగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు.
Don’t Miss: చిత్రం.. అంతా విచిత్రం!.. ప్రపంచంలో అతిపెద్ద కార్ల మ్యూజియం
ఇప్పటి వరకు మీ కంటికి కనిపించిన ఎన్నో చిత్రమైన వాహనాలను, పురాతన వాహనాలను ఇక్కడ చూడవచ్చు. ఈ కారణంగానే ఐబీడబ్ల్యు ఈవెంట్ ప్రపంచలో ఓ పెద్ద బైక్ ఈవెంట్‌గా నిలిచింది. ఇండియా బైక్ వీక్ చూడటానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటం వల్ల.. ఇప్పటికే చాలామంది బైకర్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొనటానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ సందర్శించాలనుకునే వారు ఎవరైనా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళవచ్చు.