దివికేగిన ‘కెప్టెన్’ – విజయకాంత్ గురించి ఆసక్తిర విషయాలు

Interesting Facts About Captain Vijayakanth: విజయకాంత్‌ (Vijayakanth).. ఈ పేరు కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు కూడా సుపరిచయమే. 1952 ఆగష్టు 25న మధురైలో కేఎన్ అళగర్‌స్వామి మరియు ఆండాళ్ అళగర్‌స్వామి దంపతులకు జన్మించిన విజయకాంత్ అసలు పేరు ‘నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి’. అయితే ఈయన సినిమాల్లోకి వచ్చిన తరువాత ‘విజయకాంత్’అనే పేరుతోనే అందరికి పరిచమయ్యారు.

తమిళ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయకాంత్ ఈ రోజు మదురైలో ఒక ఆసుపత్రిలో కన్ను మూసారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. అనేక సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానుల మనసుస గెలుచుకున్న ‘కెప్టెన్ విజయకాంత్’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూద్దాం..

సినీరంగ ప్రవేశం..

27 సంవత్సరాల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన విజయకాంత్ మొదటి సినిమా ‘ఇనిక్కుమ్ ఇలమై’ కాగా, ఆయన చివరి చిత్రం ‘సగప్తం’ అని తెలుస్తోంది. పదుల సంఖ్యల సినిమాల్లో నటించిన విజయకాంత్ సుమారు 20 కంటే ఎక్కువ సినిమాల్లో పోలీసుగా కనిపించారు. దేశ భక్తి, సందేశాత్మక చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపే విజయకాంత్.. అలాంటి సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.

భార్య & పిల్లలు

విజయకాంత్ 1990 జనవరి 31న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. వీరికి షణ్ముగ పాండియన్‌ మరియు విజయ్ ప్రభాకర్ అళగర్‌స్వామి అనే ఇద్దరు కుమారు ఉన్నారు. షణ్ముగ పాండియన్‌ 2015లో తెరమీదికి వచ్చిన సగప్తం మరియు 2018లో విడుదలైన మధుర వీరన్ సినిమాల్లో నటించినట్లు సమాచారం.

రాజకీయ రంగప్రవేశం

సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకున్న విజయకాంత్.. రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 2005లో DMDK (Desiya Murpokku Dravida Kazhagam) అనే పార్టీ స్థాపించి వరుసగా రెండు సార్లు ‘విరుధాచలం మరియు రిషివండియం’ నియోజకవర్గాల నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2011 నుంచి 2016 వరకు తమిళనాడు రాజకీయ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

ముక్కుసూటి తనం మరియు నిజాయితీ

కెప్టెన్ విజయకాంత్ కేవలం తమిళ నటుడు మాత్రమే కాకుండా.. నిర్మాత కూడా. ఈయన రాజకీయ నాయకుడుగా పేద ప్రజలకు తనవంతు సాయం చేశారు. మొత్తం మీద విజయకాంత్ తమిళనాడులో ప్రముఖ వ్యక్తిగా, ముక్కుసూటి తనం మరియు నిజాయితీ గల వ్యక్తిత్వానికి పేరుగాంచాడు. క్రమశిక్షణ మరియు సామాజిక న్యాయం పట్ల అతని నిబద్ధతకు కూడా చెప్పుకోదగ్గదే.

కెప్టెన్ అనే పేరు ఎందుకొచ్చిందంటే

1991లో విజయకాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకరన్ చిత్రంలో అతడి పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ సినిమాలో విజయకాంత్ అటవీ అధికారిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అప్పటి నుంచి ఈయన పేరుకు ముందు ‘కెప్టెన్’ అని చేర్చడం జరిగింది.

కార్ కలెక్షన్స్

సినిమాల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన విజయకాంత్ ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నారు. ఇందులో క్లాసిక్ కార్ల దగ్గర నుంచి ప్రీమియం కార్ల వరకు ఉన్నాయి.

  • ఆడి క్యూ7 (Audi Q7) – రూ. 87 లక్షలు
  • టయోటా ఇన్నోవా క్రిష్టా (Toyota Innova Crysta) – రూ. 25 లక్షలు
  • బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5) – రూ. 96 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ ఎస్350 (Mercedes Benz S350) – రూ. 1.2 కోట్లు
  • ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour) – రూ. 36 లక్షలు
  • వోల్వో ఎస్90 (Volvo S90) – రూ. 66 లక్షలు
  • హ్యుందాయ్ శాంటా ఎస్ఈ (Hyundai Santa SE) – రూ. 26 లక్షలు

ఆస్తులు విలువ (Networth)

నటుడు విజయకాంత్ విలాసవంతమైన జీవితం గడిపిన నటులలో ఒకరు. అయితే ఈయన మొదటి సంపాదన 1970లలో కేవలం రూ. 200 మాత్రమే కావడం గమనార్హం. ఆ తరువాత ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు నుంచి రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం విజయకాంత్ మొత్తం ఆస్తుల విలువ 6 నుంచి 7 మిలియన్ డాలర్లు ఉండవచ్చని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 50 నుంచి రూ. 60 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది.

Don’t Miss: 2023లో ఎక్కువ రెమ్యునరేషన్ (Remuneration) తీసుకున్న హీరోయిన్స్.. వీరే!

విజయకాంత్ సినిమాలు, రాజకీయాల్లో మాత్రమే కాకుండా హీరో మోటోకార్ప్, పెప్సీ మరియు పాండ్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా కూడా కొంత మొత్తంలో డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది.

స్విమ్మింగ్ పూల్ మరియు గార్డెన్‌తో కూడిన విజయకాంత్‌కు చెందిన ఖరీదైన ఇంటిని 2023 జూలైలో రూ. 4.25 కోట్లకు వేలంలో ఉంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కాలేజీ స్థలాన్ని కూడా వేలం పాడనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నుంచి రూ. 5.52 కోట్లు లోన్ తీసుకున్నట్లు.. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్యాంకు ఇంటిని వేలంలో ఉంచినట్లు సమాచారం.