Kawasaki KLX230: భారత్‌లో అడుగెట్టిన కొత్త జపనీస్ బైక్: దీని ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

Kawasaki KLX230 launched in India: కవాసకి బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ‘కేఎల్ఎక్స్230’ (KLX230) లాంచ్ చేసింది. ఈ బైక్ ధర, ఫీచర్స్, డిజైన్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర

కవాసకి లాంచ్ చేసిన కేఎల్ఎక్స్230 బైక్ ధర రూ. 3.30 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ఇది ప్రస్తుతం భారతదేశంలో అమ్మాయుడవుతున్న అత్యంత ఖరీదైన రోడ్ లీగల్ డ్యూయెల్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ పనితీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

కొత్త కవాసకి కేఎల్ఎక్స్230 బైక్.. 233 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 18.1 హార్స్ పవర్ మరియు 6400 rpm వద్ద 18.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ బైక్ 7.6 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

పొట్టి రైడర్లకు సైతం

కవాసకి కేఎల్ఎక్స్230 బైక్ 240 మిమీ ట్రావెల్‌తో ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ పోర్క్, వెనుక 250 మిమీ ట్రావెల్‌తో మోనోషాక్ సెటప్ ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ.. కవాసకి కొత్త బైక్ 880 మిమీ పొడవైన సీటును పొందుతుంది. దీని బరువు కేవలం 139 కేజీలు మాత్రమే. ఇది పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సింపుల్ డిజైన్ కలిగిన ఈ కవాసకి బైకులో ఫీచర్స్ కూడా చాలా పరిమితంగానే ఉంటాయి. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని అనుమతించే LCD యూనిట్ పొందుతుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఇసుకలో లేదా గడ్డి ప్రాంతాల్లో కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది.

కవాసకి లాంచ్ చేసిన కేఎల్ఎక్స్230 బైక్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయానికి ఉన్న.. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ (రూ. 1.51 లక్షలు) మరియు ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో (రూ. 1.64 లక్షలు) వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా. ధరల పరంగా చూస్తే కేఎల్ఎక్స్320.. దాని ప్రత్యర్థుల కంటే రెండు రెట్లు ఎక్కువని స్పష్టమవుతోంది.

మార్కెట్లో ఇలాంటి బైకులకున్న డిమాండ్?

ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి బైకులకు పెద్దగా డిమాండ్ లేదనే తెలుస్తోంది. బహుశా ఆటోమొబైల్ ఔత్సాహికులు, రైడింగ్ పట్ల ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఈ తరహా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. సాధారణ ప్రజలు లేదా రోజువారీ వినియోగం కోసం కావాలనుకునే వారు ఇలాంటి బైకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే ధర ఎక్కువనే కాదు.. ఫీచర్స్ కూడా రైడర్లకు కావలసినన్ని ఇందులో లేకపోవడమే. ఇవి కాకుండా ఈ బైక్ ఇచ్చే మైలేజ్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉండదు.

Also Read: మీకు తెలుసా?.. ఈ ఏడాది (2024) కనుమరుగైన కార్లు ఇవే!

కంపెనీ మార్కెట్లో ఇలాంటి బైకులను లాంచ్ చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి బైకులను విరివిగా మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఎప్పుడు ఇలాంటి బైకులను లాంచ్ చేసినా.. దీనికి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ మాత్రం వెల్లడించలేదు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లు ఈ బైకును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ముందుకు రారు.

కవాసకి బైకులు

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైకులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ‘నింజా హెచ్2’ (Ninja H2) అనేది.. కవాసకి బ్రాండ్. దీని ధర రూ. 79 లక్షల కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశీయ విఫణిలో జెడ్900, నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా 300, డబ్ల్యు 175, నింజా 1100ఎస్ఎక్స్, నింజా 500, నింజా జెడ్ఎక్స్ 6ఆర్, జెడ్650, నింజా 650, నింజా జెడ్ఎక్స్-4ఆర్, ఎలిమినేటర్, నింజా హెచ్2 హెచ్ఎక్స్, నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్, వెర్సిస్ 650, జెడ్900ఆర్ఎస్, జెడ్650ఆర్ఎస్ మరియు నింజా హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ మొదలైన బైకులను విక్రయిస్తోంది.

Leave a Comment