10లక్షల మందికి నచ్చిన బ్రాండ్ ఇది!.. భారత్‌లో దూసుకెళ్తున్న కొరియన్ కంపెనీ

Kia Crosses 10 Lakh Unit Sales in India: ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో మూడో స్థానంలో ఉన్న భారతదేశంలో అనేక అన్యదేశ్య కార్ బ్రాండ్ ఉన్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీవైడీ, కియా మోటార్స్ మొదలైనవి. ఇలా ఎన్నెన్ని ఇతర దేశాల బ్రాండ్స్ ఉన్నప్పటికీ సౌత్ కొరియా బ్రాండ్ ‘కియా మోటార్స్’కు (Kia Motors) మాత్రం ఓ ప్రత్యేకమైన ఆదరణ మరియు డిమాండ్ ఉంది.

2017 దేశీయ మార్కట్లో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. ఈ రోజు సెల్టోస్, సోనెట్, కారెన్స్, ఈవీ6 వంటి కార్లను విక్రయిస్తూ ప్రధాన వాహన తయారీదారులకు సైతం గట్టిపోటీ ఇస్తోంది. అయితే 2019లో కియా తన అమ్మకాలను ప్రారంభించినప్పటి నుంచి 2024 జులై వరకు ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయిస్తూ.. విక్రయాల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

10 లక్షల కంటే ఎక్కువ సేల్స్

2019లో అమ్మకాలను ప్రారంభించి జులై 2024కు 10,23,515 యూనిట్ల కార్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయ విఫణిలో కేవలం ఆరు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో కొరియా కార్ మేకర్ ఈ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

2020 ఆర్థిక సంవత్సరంలో కియా ఇండియా మొత్తం 84904 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో 81717 యూనిట్లు సెల్టోస్ కార్లు, 3187 కార్నివాల్ కార్లు ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో 89173 కియా సెల్టోస్ కార్లు, 63717 సోనెట్ కార్లు, 2796 కార్నివాల్ కార్లు, 12692 కారెన్స్ కార్లు ఇలా.. మొత్తం 155686 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో కూడా కియా మోటార్స్ యొక్క మొత్తం అమ్మకాలు 186787 యూనిట్లు. ఇందులో 95929 సెల్టోస్ కార్లు, 73864 యూనిట్ల సోనెట్ కార్లు, 4302 కార్నివాల్ కార్లు మరియు 12692 కారెన్స్ కార్లు ఉన్నాయి.

2023లో కంపెనీ 100423 యూనిట్ల సెల్టోస్ కార్లను, 94096 యూనిట్ల సోనెట్ కార్లను, 4257 కార్నివాల్ కార్లను, 70314 యూనిట్ల కారెన్స్ కార్లను, 430 యూనిట్ల ఈవీ6 కార్లను.. ఇలా మొత్తం 269229 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 100423 యూనిట్ల సెల్టోస్, 81384 యూనిట్ల సోనెట్, 63167 యూనిట్ల కారెన్స్ మరియు 660 యూనిట్ల ఈవీ6 కార్లు అమ్ముడయ్యాయి. మొత్తం మీద 2024 ఆర్థిక సంవత్సరంలో కియా ఇండియా 245634 కార్లను విక్రయించింది.

అత్యధికంగా అమ్ముడైన కియా కారు

2025 ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25123 యూనిట్ల సెల్టోస్, 34609 యూనిట్ల సోనెట్ మరియు 21477 యూనిట్ల కారెన్స్ మరియు 66 ఈవీ6 కార్లను కియా ఇండియా విక్రయించింది. మొత్తం మీద కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో 81275 యూనిట్ల కార్లను విక్రయించినాట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు కియా ఇండియా మొత్తం 492497 సెల్టోస్ కార్లను విక్రయించింది. సోనెట్ అమ్మకాలు 347670 యూనిట్లు, 14542 కార్నివాల్ కార్లు, 167650 యూనిట్ల కారెన్స్ మరియు 1156 ఈవీ6 కార్లు.. ఇలా మొత్తం 1023515 యూనిట్ల కార్లను కంపెనీ విజయవంతంగా విక్రయించి అమ్మకాల్లో అరుదైన రికార్డ్ పొందగలిగింది.

కియా ఇండియా నవంబర్ 2022లో 6 లక్షల అమ్మకాలను అధిగమించింది. ఆ తరువాత కేవలం ఐదు నెలల్లో.. అంటే 2023 ఏప్రిల్ నాటికి మరో లక్ష కార్లను విక్రయించి అమ్మకాల్లో 7 లక్షల మైలురాయిని చేరగలిగింది. ఆ తరువాత 13 నెలల కాలంలో కంపెనీ 1 మిలియన్ సేల్స్ క్రాస్ చేసింది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ కంపెనీ ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లో సరికొత్త కార్లను లాంచ్ చూస్తూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.

Don’t Miss: రాజకుమారుడు ‘మహేష్ బాబు’ గ్యారేజిలోని కార్లు ఇవే: రేంజ్ రోవర్, లంబోర్ఘిని, ఆడి ఇంకా..

నాలుగు మోడల్స్/కార్లు

ప్రస్తుతం కియా ఇండియా భారతదేశంలో నాలుగు ఉత్పత్తులను విక్రయిస్తోంది. అవి సెల్టోస్, సోనెట్, ఈవీ6 మరియు కారెన్స్. కంపెనీ యొక్క మొత్తం అమ్మకాల్లో గణనీయమైన వాటా కలిగి ఉన్న మోడల్ సెల్టోస్ కావడం గమనార్హం. కంపెనీ భారతదేశంలో మాత్రమే కాకుండా ఇండియా నుంచి విదేశాలకు 258339 కార్లను ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కంపెనీ నెట్‌వర్క్‌ & రాబోయే కార్లు

కియా ఇండియా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. ప్రస్తుతం కంపెనీ తన డీలర్షిప్ నెట్‌వర్క్‌ను 265 నగరాలకు విస్తరించింది. ఇప్పుడు కంపెనీకి 5885 టచ్‌పాయింట్‌లు ఉన్నట్లు సమాచారం. కాగా కంపెనీ రాబోయే రోజుల్లో ఈవీ9 కారును మరియు కార్నివాల్ ఎంపీవీని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే కార్నివాల్ లాంచ్ తరువాత ప్రారంభంలో దిగుమతి చేసుకుని, ఆ తరువాత స్థానికంగా ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.

UMA SRI
UMA SRIhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.
RELATED ARTICLES

Most Popular

Recent Comments