Kuppam Tirupati Gangamma Jatara 2025 Dates: అమ్మలుగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ అని బమ్మెర పోతన చెప్పినట్లు.. అక్కడి ప్రజలను కాపాడే అమ్మ, కొలిచిన వారికి కొంగు బంగారం, అందరి ఇళ్ల ఇలవేల్పు. ఇంతకీ ఆ దేవత ఎవరనుకుంటున్నారా?.. ‘కుప్పం తిరుపతి గంగమ్మ‘ (Kuppam Tirupati Gangamma).
కుప్పం ప్రాంత ప్రజలందరూ.. కుప్పం తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుందా? అని వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక్కడ జాతర అంటే.. కేవలం ఒక పండుగ కాదు, అదోక ఎమోషన్. అమ్మవారిని చూసిన వెంటనే ఎవరికైన మనసు పులకరిస్తుంది. ఆనందబాష్పాలు నేలరాలుతాయి. ఏడాదికి ఒక్కసారి జరిగినా.. ఆ రోజులనే సంవత్సరం మొత్తం మదిలో దాచుకుంటారు అక్కడి ప్రజలు.
పిలిస్తే పలికే అమ్మగా.. భక్తులను కాపాడుకుంటున్న కుప్పం తిరుపతి గంగమ్మ జాతర మహాయోత్సవానికి సమయం ఆసన్నమైంది. దేవాలయ కమిటీ దీనికి సంబంధించిన తేదీలను కూడా ప్రకటించింది. 2025 ఏప్రిల్ 14న పత్రిక పూజతో ప్రారంభమై.. జూన్ 25న జరిగే మరుపూజతో ముగుస్తుంది.
అమ్మవారి జాతర వివరాలు
➤ఏప్రిల్ 14 (సోమవారం): పత్రిక పూజ
➤జూన్ 6 (మంగళవారం): జాతర చాటింపు
➤జూన్ 14 (బుధవారం): వినాయక స్వామి ఉత్సవం
➤జూన్ 15 (గురువారం): ముత్తుమారెమ్మ ఉత్సవం
➤జూన్ 16 (శుక్రవారం): శేషవాహనం
➤జూన్ 17 (శనివారం): సింహ వాహనం
➤జూన్ 18 (ఆదివారం): అశ్వ వాహనం
➤జూన్ 19 (సోమవారం): అగ్నిగుండం
➤జూన్ 20 (మంగళవారం): శిరస్సు ఊరేగింపు
➤జూన్ 21 (బుధవారం): విశ్వరూప దర్శనం
➤జూన్ 22 (గురువారం): హుండీ లెక్కింపు
➤జూన్ 25 (ఆదివారం): మరుపూజ
అమ్మవారి ఉత్సవం మొదలైన తరువాత ఇక్కడ చెప్పుకోదగ్గ కార్యక్రమాలు రెండు. ఒకటి శిరస్సు ఊరేగింపు, రెండు అమ్మవారి విశ్వరూప దర్శనం. శిరస్సు ఊరేగింపు సమయంలో.. అమ్మవారి శిరస్సును కుప్పం పట్టణంలో ఊరేగిస్తారు. ఆ తరువాత రోజు.. అమ్మవారి విగ్రహానికి శిరస్సును అలంకరిస్తారు. ఆ విశ్వరూపాన్ని దర్శించుకోవాలంటే.. ఎన్నోజన్మల పుణ్యం చేసుకుండాలి. ఈ రెండు రోజులు కార్యక్రమాలకు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆ దేవత కృపకు పాత్రులవుతారు. మనిషి తన జీవితంలో తప్పకుండా చూడాల్సిన జాతర ఏదైనా ఉంది అంటే.. అది తప్పకుండా కుప్పం తిరుపతి గంగమ్మ జాతర అనే చెప్పాలి.
అమ్మవారి శిరస్సు కథ
సాధారణ విగ్రహాలు మాదిరిగా కాకుండా.. కుప్పం తిరుపతి గంగమ్మ విగ్రహానికి శిరస్సు ఉండదు. ఏడాది ఒకసారి మాత్రమే విగ్రహానికి శిరస్సును అలంకరిస్తారు. దీని వెనుక ఒక జానపద ఐతిహ్యం కూడా ప్రచారంలో ఉంది.
”వెంకటేశ్వర స్వామి, తిరుపతి గంగమ్మ అన్నా, చెల్లెళ్లని చెబుతారు. అన్న శాంతిమూర్తి అయినప్పటికీ.. చెల్లెలు మాత్రం కోపోద్రిక్తురాలై తిరిగేదని, రాత్రి వేళల్లో స్మశానంలో శవాలను పీక్కుతినేదని.. దీంతో భయపడిపోయిన ప్రజలు వెంకటేశ్వర స్వామికి తమ మొరను విన్నవించారు. కోపోద్రిక్తుడైన స్వామివారు చెల్లెలు అని కూడా చూడకుండా.. తల తీసేశాడని, ఆ తరువాత శాంతించి.. ఏడాదికి ఒకసారి మాత్రమే శిరస్సుతో దర్శనమిస్తావని వరమిచ్చాడట”. ఈ కారణంగానే అమ్మవారి విశ్వరూపం ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శించుకోగలుగుతున్నాము.
కుప్పం
ఆంధ్రప్రదేశ్‌లో.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులలో ఉన్న ‘కుప్పం’ (Kuppam) గురించి ఒకప్పుడు ఎవరికీ తెలియదు. 1989లో కుప్పం నియోగకవర్గం నుంచి ఎంఎల్ఏగా గెలిచిన తరువాత ఆ ప్రాంతం రూపురేఖలు మారాయి. చదువుకోవడానికి కావలసిన సదుపాయాలు పెరిగాయి. చదువుకున్న వారి సంఖ్య ఎక్కువైంది. నేడు కుప్పం అంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. భవిష్యత్తుకు నిలువెత్తు నిదర్శనం.
కుప్పం అనే పేరుకు సమావేశ స్థలం లేదా సంగమం అని అర్థం. ఇక్కడి ప్రజలు భాష తెలుగు, అయితే తమిళం, కన్నడ కూడా మాట్లాడగలరు. కుప్పం అమ్మవారు మాత్రమే కాకూండా.. పెద్దపులి గంగమ్మ జాతర, ఆడి కృత్తిక సందర్భంగా గురివంకలో ఉన్న సుబ్రమణ్య స్వామి జాతరలు కూడా ఇక్కడ వైభవంగా జరుపుతారు.
Also Read: ఇంటర్ ఫలితాలు.. ఏయూ, ఎస్వీయూ పీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ వివరాలు
సమ శీతోష్ణస్థితి కలిగిన కుప్పం ప్రాంతల్లో.. వేసవి కాలంలో వర్షపాతం కొంత ఎక్కువగా ఉంటుంది. సగటున వార్షిక ఉష్ణోగ్రత 22.3°C వద్ద ఉంటుంది. సగటు వర్షపాతం 680 మిమీ. ఫిబ్రవరిలో అత్యల్ప వర్షపాతం ఉంటుంది. అక్టోబర్ నెలలో కొంత ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. మే నెలలో ఇక్కడ ఉష్ణోగ్రత తీవ్రంగా (28.0°C) ఉంటుంది. డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రత 18.0°C కు చేరుకుంటుంది.