Lotus Eletre SUV Launched In India: ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ‘లోటస్’ (Lotus) ఈ రోజు భారతీయ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతూనే తన మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ‘ఎలెట్రే’ (Eletre) SUV లాంచ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన ఈ కారు ధర, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లోటస్ ఎలెట్రే ధర రూ. 2.55 కోట్లు. ప్రస్తుతానికి ఈ కంపెనీకి మన దేశంలో డీలర్షిప్ లేదు కావున ఢిల్లీలోని బెంట్లీస్‌ను రిటైల్ చేస్తున్న ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ద్వారా విక్రయాలు సాగిస్తుంది. అయితే కంపెనీ 2024 ప్రారంభం నాటికి ఢిల్లీలో రిటైలర్లను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత దేశవ్యాప్తంగా మరిన్ని షోరూమ్‌లు ప్రారంభిస్తుంది.
లోటస్ ఎలెట్రే ఎక్స్టీరియర్ డిజైన్
కొత్త లోటస్ ఎలెట్రే క్యాబ్ ఫార్వర్డ్ స్టాన్స్, పొడవాటి వీల్‌బేస్, చిన్న ఫ్రంట్ మరియు రియర్ ఓవర్‌హాంగ్‌లతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులోని చాలా ఎలిమెంట్స్ కంపెనీ యొక్క ఇతర కార్ల నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇండియన్ రోడ్లకు అనుకూలంగా ఉండటానికి 22 ఇంచెస్ 10 స్పోక్ వీల్ పొందుతుంది. ఈ కారు ఎలక్ట్రిక్ మోడల్ కావున ఇందులో యాక్టివ్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కూడా చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.
రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఈ SUV వెడల్పు అంతటా విస్తరించి ఉండే రిబ్బన్ లైట్ చూడవచ్చు. ఇది వీల్ ఆర్చ్‌ల నుంచి ఎయిర్ అవుట్‌లెట్‌లలోకి వంగి ఉంటుంది. కార్బన్ ఫైబర్, త్రీ స్టేజ్ డిప్లోయబుల్, స్ప్లిట్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వెనుక భాగంలో చక్కగా విలీనం చేయబడి ఉంటుంది. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల మంచి పనితీరుని అందిస్తుంది.
లోటస్ ఎలెట్రే ఇంటీరియర్ అండ్ ఫీచర్స్
లేటెస్ట్ లోటస్ ఎలెట్రే కారు మంచి డిజైన్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 15.1 ఇంచెస్ ల్యాండ్‌స్కేప్-ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీనిని కంపెనీ ‘లోటస్ హైపర్ OS’ అని పిలుస్తుంది. ఇక్కడ గమనించినట్లతే డ్యాష్‌బోర్డ్ రెండుగా విభజించబడి వెనుకవైపు స్ప్లిట్ స్పాయిలర్ డిజైన్‌ను అనుకరిస్తుంది. దాని క్రింద, డాష్‌బోర్డ్ యొక్క పూర్తి వెడల్పుతో లైట్ బ్లేడ్ ఉంది. ఈ ఫీచర్ ఉండటం వల్ల ఫోన్ కాల్ వస్తే అది ఫ్లాష్ అవుతుంది.
దానికి కింది భాగంలో లోటస్ మూడు వేర్వేరు స్క్రీన్‌లతో కూడిన ‘రిబ్బన్ ఆఫ్ టెక్నాలజీ’ ని పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు బదులుగా, డ్యాష్‌బోర్డ్‌కు ఇరువైపులా 30 మిమీ స్ట్రిప్ ఉంది, అది కారు గురించి కావలసిన చాలా సమాచారం అందిస్తుంది. మూడవ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే.
కారులోని అన్నింటినీ డిజిటల్‌గా లేదా వాయిస్ కమాండ్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు, కానీ కొన్ని HVAC కంట్రోల్స్ మాత్రం టోగుల్ స్విచ్‌లను కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో స్మార్ట్‌ఫోన్ యాప్, 5G డేటా కంపాటిబిలిటీ మరియు ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు కూడా ఉంటాయి.
ఈ కారులో వైర్‌లెస్ ఛార్జింగ్, 12 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 15 స్పీకర్ డాల్బీ అట్మోస్ మరియు కేఈఎఫ్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, కాన్ఫిగర్ చేయదగిన యాంబియంట్ లైటింగ్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లు మరియు లైడార్ టెక్నాలజీ ఆధారంగా ADAS ఫీచర్లు ఉన్నాయి.
లోటస్ ఎలెట్రే పవర్‌ట్రెయిన్, రేంజ్ అండ్ బ్యాటరీ
ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్ మరియు ఎలెట్రే ఆర్. ఇవి మూడు రెండు పవర్‌ట్రెయిన్‌ల ఎంపికలతో లభిస్తాయి. మొదటి రెండు వెర్షన్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్ మోటార్ సిస్టమ్ కలిగిన గరిష్టంగా 600 కిమీ రేంజ్ అందిస్తాయి. ఇక మూడవ మోడల్ ఎలెట్రే ఆర్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే డ్యూయల్-మోటార్ సెటప్‌తో పాటు 2 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కలిగి గరిష్టంగా 490 కిమీ రేంజ్ అందిస్తాయి. టార్క్ గణాంకాలు వరుసగా 710 ఎన్ఎమ్ మరియు 985 ఎన్ఎమ్.
Don’t Miss: ధర ఎక్కువైనా అస్సలు వెనక్కి తగ్గని జనం – ఎగబడి మరీ కొనేస్తున్నారు!
కొత్త ఎలెట్రే, ఎలెట్రే ఎస్ కార్లు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అయితే.. ఎలెట్రే ఆర్ మాత్రం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి. దీని టాప్ స్పీడ్ గంటకు 258 కిమీ కావడం గమనార్హం. లోటస్ మూడు వేరియంట్‌లు 112 కిలోవాట్ బ్యాటరీని పొందుతాయి. ఇది ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఇది స్టాండర్డ్ 22 కిలోవాట్ AC ఛార్జర్ పొందుతుంది.