Mahindra XUV 3XO Launched in India: దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఎట్టకేలకు మార్కెట్లో కొత్త ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ (XUV 3XO) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? బుకింగ్స్ మరియు డెలివరీ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
వేరియంట్స్ & ధర
భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర లేదా బేస్ వేరియంట్ XUV 3XO MX1 ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). టాప్ వేరియంట్ AX7 L ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). మహీంద్రా కొత్త కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.
బుకింగ్స్ మరియు డెలివరీ
దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైన మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ బుకింగ్స్ 2024 మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు మే 26 నుంచే ప్రారంభమవుతాయని సమాచారం. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు అత్యద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.
డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్
మహీంద్రా యొక్క కొత్త XUV 3XO చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు బంపర్‌పై పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌తో కూడిన రెండు భాగాలుగా ఉన్న గ్రిల్.. బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. వేణు భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్, సీ ఆకారంలో ఉండే టెయిల్ లాంప్ డార్క్ క్రోమ్‌లో పూర్తి చేయబడిన కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి ఉందులో చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్లేట్ ఇప్పుడు టెయిల్‌గేట్‌కు కాకుండా రియర్ బంపర్ మీద అమర్చబడి ఉండటం చూడవచ్చు.
కొత్త మహీంద్రా XUV 3XO కారు మొత్తం 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి సిట్రిన్ ఎల్లో, డోన్ డస్ట్, నెబ్యులా బ్లూ, డీప్ ఫారెస్ట్, స్టెల్త్ బ్లాక్ మరియు ఎవరెస్టు వైట్ కలర్స్. టాప్ వేరియంట్స్ డ్యూయెల్ టన్న కలర్ ఆప్షన్‌లను పొందుతాయి.
ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్
మహీంద్రా XUV 3XO ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏడు స్పీకర్ హర్మాన్, 380W యాంప్లిఫైయర్‌తో కూడిన కార్టాన్ సిస్టం, అడ్రినాక్స్ కనెక్ట్ ఇన్ కార్ కనెక్టివిటీ సూట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటితో పాటు.. వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ టైప్ సీ ఛార్జర్ మొదలైనవి ఉన్నాయి. మహీంద్రా XUV 3XO బూట్ స్పేస్ 295 లీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
ఇంజిన్
XUV 3XO పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 112 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2 లీటర్ T-GDi ఇంజిన్ 130 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. 117 పీఎస్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవన్నీ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి.
Don’t Miss: సింగిల్ ఛార్జ్‌తో 530 కిమీ రేంజ్ అందించే కారుపై రూ.2 లక్షలు డిస్కౌంట్ – పూర్తి వివరాలు
సేఫ్టీ ఫీచర్స్
కొత్త మహీంద్రా XUV 3XO సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), ఐసోఫిక్స్ యాంకర్లు, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్, హిల్ డిసెంట్ అసిస్ట్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు లెవెల్ 2 ఏడిఏఎస్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.