Maruti Baleno Regal Edition Launched: మారుతి సుజుకి యొక్క అత్యధిక అమ్మకాలు పొందుతున్న బాలెనో ఇప్పుడు ‘రీగల్ ఎడిషన్’ రూపంలో లాంచ్ అయింది. పండుగ సీజన్‌లో కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ లేటెస్ట్ ఎడిషన్ విడుదల చేసింది. ఇది బాలెనో యొక్క అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంది.
బాలెనో రీగల్ ఎడిషన్ ఇప్పుడు పెట్రోల్ మరియు సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అందుబాటులో ఉండటం వల్ల, కస్టమర్లు తమకు నచ్చిన ఇంజిన్ ఆప్షన్‌లో ఈ కారును ఎంచుకోవచ్చు. రీగల్ ఎడిషన్ యొక్క ప్రతి వేరియంట్ స్పెషల్ ఫీచర్స్ పొందనుంది. అయితే దీనికోసం యాక్ససరీస్ కిట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మారుతి బాలెనో రీగల్ ఎడిషన్ యాక్ససరీస్ కిట్ ధరలు
బాలెనో రీగల్ ఎడిషన్ కోసం యాక్ససరీస్ కొనుగోలు చేయాలంటే రూ. 60,199 (సిగ్మా వేరియంట్), రూ. 49,990 (డెల్టా వేరియంట్), రూ. 50,428 (జీటా వేరియంట్), రూ. 45,829 (ఆల్ఫా వేరియంట్) వెచ్చించాల్సి ఉంటుంది.
కొత్త యాక్ససరీస్ కొనుగోలు చేస్తే.. ఫ్రంట్ అండ్ అండర్ బాడీ స్పాయిలర్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, డ్యూయెల్ టోన్ సీట్ కవర్, బాడీ సైడ్ మోల్డింగ్, మడ్ ప్లాఫ్, 3డీ బూట్ మ్యాప్, గ్రిల్ అప్పర్ గార్నిష్, ప్రీమియం స్టీరింగ్ కవర్, బ్యాక్ డోర్ గార్నిష్, మిడిల్ క్రోమ్ గార్నిష్, హై పర్ఫామెన్స్ వాక్యూమ్ క్లీనర్, ప్రీమియం బాడీ కవర్, డోర్ విజర్, రియర్ పార్సిల్ సెల్ఫ్, లోగో ప్రొజెక్టర్ లాంప్, క్రోమ్ హ్యాండిల్ మొదలైనవి పొందవచ్చు. ఇవన్నీ కారును మరింత హుందాగా చేయడంలో సహాయపడతాయి. అయితే యాక్ససరీస్ అనేవి మీరు కొనుగోలు చేసే ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి.
బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. కస్టమర్ల అంచనాలను అనుకూలంగా.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాలెనో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ పండుగ సీజన్‌లో మా కస్టమర్ల కోసం ఈ సరికొత్త ఎడిషన్ లాంచ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కారు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుందని పేర్కొన్నారు.
అమ్మకాల్లో అగ్రగామిగా బాలెనో
మారుతి సుజుకి తన బాలెనో కారును భారతీయ విఫణిలో లాంచ్ చేసినప్పటి నుంచి సుమారు 15 లక్షల యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. అంటే మార్కెట్లో బాలెనో కారును కొనుగోలు చేసిన వాహనదారుల సంఖ్య 1.5 మిలియన్స్ కంటే ఎక్కువ. కంపెనీ యొక్క అమ్మకాలు గణనీయంగా పెరగడానికి బాలెనో చాలా దోహదపడింది. గత నెలలో కూడా బాలెనో అమ్మకాలు 14వేలు దాటాయి. 2023 సెప్టెంబర్ నెలతో పోలిస్తే బాలెనో సేల్స్.. సెప్టెంబర్ 2024లో 22.40 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.
బాలెనో ఎక్కువ అమ్మకాలు పొందటానికి కారణం
భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మారుతి కారు బాలెనో. ఇది సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంది. అంతే కాకుండా ఈ కారు ప్రారంభ ధర దాని ప్రత్యర్థులతో పోలిస్తే తక్కువే. ఇలాంటి కారణాల వల్ల ఎక్కువమంది బాలెనో కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.
Don’t Miss: ఖరీదైన ఫెరారీలో శిల్పా శెట్టి.. ఈ కారు రేటు తెలిస్తే షాకవుతారు!
ఇప్పటికే మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న మారుతి బాలెనో.. తాజాగా రీగల్ ఎడిషన్ రూపంలో లాంచ్ కావడం వాహన ప్రియులకు ఓ శుభవార్త అనే చెప్పాలి. ఈ ఎడిషన్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతుందని, కస్టమర్లను పండుగ సీజన్‌లో ఆకర్శించడంలో సక్సస్ సాధిస్తుందని భావిస్తున్నాము. అంతే కాకుండా కంపెనీ తన ఉనికిని మరింత వ్యాపించడానికి, వాహన వినియోగదారులను ఆకర్శించడానికి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఎలాంటి కార్లను లాంచ్ చేస్తుంది? ఎలక్ట్రిక్ విభాగంలో అడుగుపెట్టనుందా? ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఏ కారును లాంచ్ చేస్తుందనే విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.