30 లక్షల మంది ఈ కారును కొనేశారు!.. దీనికే ఎందుకింత డిమాండ్ అంటే..

Maruti Swift Achieves 30 Lakh Sales Milestone: మారుతి సుజుకి అంటే అందరికి మొదట గుర్తొచ్చే కారు ‘స్విఫ్ట్’ (Swift).. అంతలా భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఈ కారు అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2005లో మారుతి స్విఫ్ట్ విక్రయాలు ప్రారంభమైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు (సుమారు 19 సంవత్సరాలు) కంపెనీ 30 లక్షల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

సెప్టెంబర్ 2021 నాటికి 25 లక్షల యూనిట్స్

2005లో స్విఫ్ట్ అమ్మకాలు మొదలైనప్పటి నుంచి.. ఈ కారు ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. కంపెనీ 30 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకోవడానికి ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన నాల్గవ తరం స్విఫ్ట్ కూడా దోహదపడింది. సెప్టెంబర్ 2021 నాటికి కంపెనీ 25 లక్షల అమ్మకాల మైలురాయిని ఛేదించింది. ఆ తరువాత 5 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకోవడానికికి కంపెనీకి 3 సంవత్సరాల సమయం పట్టింది.

మారుతి బ్రాండ్ కార్లను కొనాలనుకునే పది మందిలో కనీసం ఐదు మంది కంటే ఎక్కువ స్విఫ్ట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కారు అత్యధిక అమ్మకాలు పొందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా రికార్డ్ సాధించింది.

మారుతి స్విఫ్ట్ పవర్‌ట్రెయిన్

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి స్విఫ్ట్ 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 హార్స్ పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కంపెనీ ఈ కారును ఈ ఏడాది చివరి నాటికి సీఎన్‌జీ రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో లాంచ్ కానున్న స్విఫ్ట్ సీఎన్‌జీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మారుతి స్విఫ్ట్ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 4.2 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వింగ్ మిర్రర్స్ వంటివి పొందుతుంది.

మారుతి స్విఫ్ట్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. వాహన వినియోగదారులకు కావలసిన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటిని పొందుతుంది.

ధరలు

మారుతి సుజుకి యొక్క నాల్గవ తరం ఎడిషన్ స్విఫ్ట్ మోడల్ మే 2024లో లాంచ్ అయింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన తరువాత ఒక నెలలోనే మొత్తం 19393 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించింది. కాగా ఇప్పటికే కొత్త స్విఫ్ట్ 40000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.

Don’t Miss: సలార్ నటుడి కొత్త కారు.. వారెవ్వా కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

కంపెనీ దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఈ కొత్త మారుతి స్విఫ్ట్.. ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ కంపెనవె యొక్క ఐ10 నియోస్, టాటా మోటార్స్ యొక్క టియాగో, సిట్రోయెన్ కంపెనీ యొక్క సీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. పలు కార్లకు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ మారుతి స్విఫ్ట్ మాత్రం అమ్మకాల్లో దూసుకెళ్తోంది.

స్విఫ్ట్ అమ్మకాలకు ప్రధాన కారణం

మారుతి స్విఫ్ట్ దేశంలో భారీ అమ్మకాలను పొందటానికి ప్రధాన కారణం సరసమైన ధర మాత్రమే కాదు. సింపుల్ డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ లభించడం కూడా. ప్రస్తుతం కంపెనీ సేఫ్టీ పరంగా కూడా అత్యుత్తమ ఫీచర్స్ అందిస్తోంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ కారణాల వల్ల మారుతి స్విఫ్ట్ అమ్మకాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి.