Maruti Swift CNG Launched in India: మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే అందరికీ గుర్తొచ్చే కారు స్విఫ్ట్. ప్రారంభం నుంచి ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన ఈ కారు ఇప్పటికి కూడా మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఇప్పటి వరకు ఫ్యూయెల్ కారుగానే మార్కెట్లో విక్రయించబడిన స్విఫ్ట్.. ఎట్టకేలకు సీఎన్‌జీ రూపంలో లాంచ్ అయింది.
సీఎన్‌జీ రూపంలో లాంచ్ అయిన కొత్త ‘మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ’ (Maruti Swift CNG) చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో సీఎన్‌జీ బ్యాడ్జెస్ వంటివి ఉండనున్నట్లు సమాచారం. వీటి ద్వారానే ఇది సీఎన్‌జీ కారు అని గుర్తించడానికి సాధ్యమవుతుంది.
వేరియంట్స్ & ధరలు
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ.. ప్రారంభ ధర రూ. 8.20 లక్షలు. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ) మరియు జెడ్ఎక్స్ఐ వేరియంట్స్. వీటి ధరలు వరుసగా రూ. 8.20 లక్షలు, రూ. 8.47 లక్షలు మరియు రూ. 9.20 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).
కొత్త మారుతి సుజుకి సీఎన్‌జీ ధర దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా రూ. 90000 ఎక్కువ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా స్విఫ్ట్ సీఎన్‌జీ కారును విక్రయించే ముందు.. గుజరాత్‌లో మాత్రమే విక్రయించనున్నారు. ఆ తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలలో విక్రయించనున్నారు.
సీఎన్‌జీ ఇంజిన్ వివరాలు
మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ కారు 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజిన్ పొందుతుంది. సీఎన్‌జీలో ప్రయాణించే సమయంలో ఇది 69 Bhp పవర్, 102 Nm టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఆప్షన్లో నడిచే సమయంలో ఇది 80.4 Bhp పవర్, 112 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.
డిజైన్ & ఫీచర్స్
ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానీ మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 7 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, రియర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్, యూఎస్బీ పోర్ట్స్ మరియు 60:40 స్ప్లిట్ రియర్ సీటు మొదలైనవి ఉన్నాయి.
మారుతి సుజుకి సీఎన్‌జీ సేల్స్
దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఇప్పటికి పద్నాలుగు (స్విఫ్ట్ సీఎన్‌జీతో కలిపి) సీఎన్‌జీ కార్లను లాంచ్ చేసింది. దీంతో సీఎన్‌జీ విభాగంలో మారుతి సుజుకి అగ్రగామిగా ఉంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఆరు లక్షల కంటే ఎక్కువ ప్యాసింజర్ సీఎన్‌జీ మరియు ఎస్‌యూవీలను విక్రయించింది. గత ఏడాది భారతదేశంలో 4.77 లక్షల సీఎన్‌జీ కార్లను మారుతి సుజుకి విక్రయించింది. కాగా 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు మధ్యలో 2.21 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క సీఎన్‌జీ కార్లకు దేశీయ విఫణిలో ఎంత డిమాండ్ ఉందొ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
Don’t Miss: వేలానికి Mahindra Roxx మొదటి కారు: మీరు కూడా సొంతం చేసుకోవచ్చు
స్విఫ్ట్ సీఎన్‌జీ సేల్స్ ఎలా ఉండబోతున్నాయి?
నిజానికి ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్ కారుకు అధిక డిమాండ్ ఉంది. అయితే ఇది ఇప్పటి వరకు కేవలం పెట్రోల్ వెర్షన్ రూపంలోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో అందుబాటులోకి వచ్చేసింది. అంతే కాకుండా ఈ కారు మైలేజ్ 32.85 కిమీ/కేజీ. ఇది పెట్రోల్ కారు మైలేజ్ కంటే కూడా చాలా ఎక్కువ దీన్ని బట్టి చూస్తే.. స్విఫ్ట్ కొనాలనుకే ఎవరైనా ఇప్పుడు తప్పకుండా సీఎన్‌జీ వెర్షన్ స్విఫ్ట్ కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.