ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్.. ధరకు తగ్గ రేంజ్!

Mercedes Benz EQB And EQA launched India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) ఇండియన్ మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్, మరొకటి మెర్సిడెస్ ఈక్యూఏ. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్ (Mercedes Benz EQB Facelift)

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బెంజ్ కార్లలో ఒకటి ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్. దీని ధర 250 ప్లస్ 7 సీటర్ మరియు 350 4 మ్యాటిక్ 5 సీటర్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 70.90 లక్షలు, రూ. 77.50 లక్షలు (ధరలు ఎక్స్ షోరూమ్).

అద్భుతమైన డిజైన్ కలిగిన కొత్త ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్.. కొత్త గ్రిల్, అప్డేటెడ్ బంపర్స్, వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఎంబీయూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇంటర్‌ఫేస్, డాల్బీ అట్మోస్‌తో కూడిన సౌండ్ సిస్టం, డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఎలక్ట్రిక్ కారు ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం), ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు 5 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్‌ 250 ప్లస్ వేరియంట్ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒకే ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్ మరియు 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక పుల్ చార్జితో 535 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఈక్యూబీ 350 4మ్యాటిక్ వేరియంట్ కూడా 70.5 కిలోవాట్ బ్యాటరీనే పొందుతుంది. ఇందులో డ్యూయెల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 292 హార్స్ పవర్ మరియు 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 447 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ (Mercedes Benz EQA)

బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన ఈక్యూఏ విషయానికి వస్తే.. ఇది ఈక్యూఏ 250 ప్లస్ అనే ఒకే వేరియంట్లో లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కారును కేవలం 7 సీటర్ రూపంలో లాంచ్ చేసింది. దీనికోసం ఈ రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది క్రాస్‌ఓవర్ లాంటి స్టైలింగ్ పొందుతుంది. ఇది 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ ఫీచర్స్ వంటివి పొందుతాయి.

కొత్త బెంజ్ ఈక్యూఏ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పోలార్ వైర్, మౌంటెన్ గ్రే, పటగోనియా రెడ్ మెటాలిక్, హైటెక్ సిల్వర్, కాస్మోస్ బ్లాక్, మౌంటెన్ గ్రే మాగ్నో మరియు స్పెక్ట్రల్ బ్లూ కలర్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

Don’t Miss: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

వోల్వో XC40 రీఛార్జ్ మరియు బీఎండబ్ల్యూ ఐఎక్స్1 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్ మరియు 385 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మొత్తం మీద ఈ బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన ఈక్యూబీ మరియు ఈక్యూఏ ఎలక్ట్రిక్ కార్లు అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తాయని తెలుస్తోంది. అయితే ఈ కార్లు మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతాయి? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.