MG Comet EV Blackstorm Edition Launched: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్.. జేఎస్‌డబ్ల్యూతో జత కట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఎంజీ కామెట్’ (MG Comet EV) ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలు పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు ఎంజీ కామెట్ ఈవీ.. బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
ధర
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ (MG Comet EV Blackstrom Edition) అనేది గ్లోస్టర్, హెక్టర్ మరియు ఆస్టర్ తరువాత బ్లాక్‌స్టోర్మ్ ట్రీట్‌మెంట్ పొందిన బ్రాండ్ యొక్క నాల్గవ మోడల్. ఇది కేవలం టాప్ స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి దీని ధర రూ. 9.81 లక్షలు (బ్యాటరీ ప్యాక్‌తో పాటు). అయితే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) కింద దీనిని రూ. 7.80 లక్షలకే (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) కొనుగోలు చేయవచ్చు.
డిజైన్
కొత్త ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ ధర.. దాని స్టాండర్డ్ ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ వేరియంట్ కంటే కూడా రూ. 13200 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఈంలాటెస్టర్ ఎడిషన్ స్పెషల్ బ్యాడ్జ్, వీల్ కవర్స్, హుద్ బ్రాండింగ్, కస్టమ్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటితో పాటు స్కిడ్ ప్లేట్స్, డోర్ ప్యానెల్స్, వీల్స్, లోయర్ గ్రిల్ మీద కనిపించే రెడ్ కలర్ హైలెట్ అన్నీ కూడా యాక్సెసరీస్ ప్యాకేజీలో భాగంగా సొంతం చేసుకోవచ్చు.
ఇంటీరియర్
ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలోని సీట్లు పూర్తిగా నలుపు రంగులో ఉన్నాయి. డోర్ ప్యానెల్స్ బూడిద రంగులో ఉన్నాయి. కొన్ని ఇతర భాగాలు తెలుపు రంగులో ఉన్నాయి. హెడ్‌రెస్ట్‌ల మీద ఎరుపు రంగులో కుట్టబడిన బ్లాక్‌స్టోర్మ్ ఉండటం చూడవచ్చు.
ఈ కారులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లతో పాటు.. సాధారణ ఎంజీ కామెట్ ఈవీలో ఉండే దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయి. అయితే ఈ స్పెషల్ ఎడిషన్‌లో అదనంగా నాలుగు స్పీకర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ మరియు రేంజ్
కొత్త ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్లలో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కానీ బ్యాటరీ మరియు రేంజ్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో అదే 17.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని 7.4 కేడబ్ల్యు ఏసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 3.5 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే 2.8 గంటల సమయంలో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.
బుకింగ్స్ & డెలివరీలు
ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 11000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. ఎంజీ కామెట్ ఈవీ కారును మరింత ఆకర్షణీయంగా లేదా కొత్తగా కావాలని కోరుకునేవారికి కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ చాలా అద్భుతమైన ఆప్షన్.
Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి
ఎంజీ కామెట్ ఈవీ సేల్స్
అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ‘ఎంజీ కామెట్ ఈవీ’ చెప్పుకోదగ్గ మోడల్. సింపుల్ డిజైన్, సరికొత్త ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందించడమే కాకుండా.. రోజువారీ ప్రయాణాలకు లేదా నగర ప్రయాణాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఈ కారు చిన్నదిగా ఉండటం వల్ల సజావుగా ముందుకు సాగిపోవచ్చు.
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లక్షల మంది.. ఈ కారును కొనుగోలు చేశారు. ఇందులో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడటానికి ఈ కారు చిన్నదిగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది.
Also Read: మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!
ఎంజీ మోటార్ కార్లు
భారతదేశంలో ఎంజీ మోటార్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇందులో ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్, గ్లోస్టర్, జెడ్ఎస్ ఈవీ, విండ్సర్ ఈవీ మరియు కామెట్ ఈవీ వంటివి ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. అంతే కాకుండా కంపెనీ కూడా.. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ కారణంగానే సంస్థ.. దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే, కస్టమర్లను కూడా ఆకర్శించడంలో విజయం పొందుతోంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్ కూడా మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తోంది.