Most Affordable Electric Car in India Wings EV Robin: కాలం మారుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది. ఈ సమయంలో కొందరు పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని వింగ్స్ ఈవీ అనే కొత్త స్టార్టప్ రాబిన్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ కారును సృష్టించింది. ఈ కారు ధర కేవలం రూ. 2 లక్షలు మాత్రమే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
వింగ్స్ ఈవీ రాబిన్
రాబిన్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మూడు విభిన్న వేరియంట్లలో అందిస్తోంది. అవి బేస్ వేరియంట్ (60 కిమీ రేంజ్), ఎస్ వేరియంట్ (90 కిమీ రేంజ్), ఎక్స్ వేరియంట్ (90 కిమీ రేంజ్). వీటి ధరలు వరుసగా రూ. 2 లక్షలు, రూ. 2.5 లక్షలు మరియు రూ. 3 లక్షలు. మొదటి రెండు వేరియంట్లలో ఏసీ ఉండదు. టాప్ వేరియంట్ మాత్రమే ఏసీ ఆప్షన్ పొందుతుంది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు. డెలివరీలు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి.
వింగ్స్ ఈవీ రాబిన్ చూడటానికి ఓ బైక్ పరిమాణంలో ఉంది. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేవారు ఒకరు. వెనుక ప్యాసింజర్ సీటు ఒకటి మాత్రమే ఉంది. టూ డోర్స్ కారు మాదిరిగా ఇది టూ సీట్ కారన్నమాట. ఈ కారు ఒక ఫుల్ చార్జితో ఏకంగా 90 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అంతే కాకుండా ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ / గం వేగవంతమవుతుంది.
రాబిన్ ఎలక్ట్రిక్ కారు రోజువారీ వినియోగానికి, రద్దీగా ఉన్న నగర ప్రయాణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్ సమయంలో కూడా ఇది సజావుగా ముందుకు సాగిపోతుంది. ఛార్జింగ్ పోర్ట్ కారు యొక్క వెనుక భాగంలో ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఐదు గంటల (16 ఆంపియర్ ప్లగ్ ఉపయోగించి) సమయం పడుతుంది. ఈ కారులో బీఎల్డీసీ హబ్ మోటార్ ఉంటుంది. ఇది 282 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
డైమెన్షన్ (పరిమాణం)
వింగ్స్ ఈవీ ఎలక్ట్రిక్ కారు పరిమాణం విషయానికి వస్తే.. దీని పొడవు 2250 మిమీ, వెడల్పు 945 మిమీ, ఎత్తు 1560 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ మాత్రమే. చూడటానికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ మాదిరిగా కనిపించే ఈ కారు అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని నిర్దారించబడింది.
సింపుల్ డిజైన్ కలిగిన వింగ్స్ ఈవీ రాబిన్ ఎలక్ట్రిక్ కారు కేవలం రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంటుందని తెలుస్తోంది. మెయిన్ డోర్ లేదా డ్రైవర్ డోర్ కుడివైపున ఉంటుంది. వెనుక ప్రయాణికుల కోసం డోర్ ఎడమవైపున ఉంటుందని. కాబట్టి ప్రయాణికులు సులభంగా లోపలి వెళ్ళవచ్చు, బయటకు రావచ్చు.
ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్
సరసమైన ధర వద్ద లభించే రాబిన్ ఎలక్ట్రిక్ కారు 5.6 కేడబ్ల్యుహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సాధారణ బ్యాటరీలతో పోలిస్తే ఈ రకమైన బ్యాటరీలు ఎక్కువ స్థిరంగా ఉంటాయి. భారతదేశ సమశీతోష్ణ స్థితిని తట్టుకునేలా ఈ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పొడవు కేవలం 69 మిమీ మాత్రమే. కాబట్టి ఇదే ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆటోమోటివ్ బ్యాటరీ ప్యాక్ అని తెలుస్తోంది.
డ్రైవ్ బై వైర్ టెక్నాలజీ
వింగ్స్ రాబిన్ ఈవీ కారులో లేటెస్ట్ డ్రైవ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. సాధారణంగా ఈ టెక్నాలజీని ఫైటర్ జెట్ మరియు ఎఫ్1 కార్లలో మాత్రమే ఉపయోగించేవారు. ఇది మోటార్ల యొక్క స్వతంత్ర నియంత్రణకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఉత్తమ పెరఫామెన్స్ లభిస్తుంది.
Don’t Miss: ఆగష్ట్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే!.. థార్ 5 డోర్, టాటా కర్వ్ ఇంకా..
చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ రూ. 2 లక్షల ధర అంటే చాలా సరసమైనదనే చెప్పాలి. ఇంత తక్కువ ధరకు ప్రస్తుతం భారతదేశంలో ఏ కారు అందుబాటులో లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తక్కువ ధరలో లభించే ఈ కారు తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ మరియు రేంజ్ వంటివి ఉత్తమంగా ఉన్నప్పటికీ.. సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయో తెలియాల్సి ఉంది.