Most Bizarre Car Museum in The World: కారు లేదా బైక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ బూట్, బర్గర్, బుక్, కంప్యూటర్ వంటివి కార్ల రూపంలోకి మారి పబ్లిక్ రోడ్డుపైకి వచ్చేస్తే.., ఇది వినడానికి కొంత వింతగా అనిపించినా చూస్తే మాత్రం ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటివి తయారుచేసిన వ్యక్తి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద విచిత్రమైన వాహనాలను తయారు చేసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన కన్యబోయిన సుధాకర్. ఈయన తయారుచేసిన కార్లను చూపిస్తూ ఓ వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. సుధాకర్ కూర్చునే టేబుల్ కూడా కారు కావడం గమనార్హం. దీనిని మీరు వీడియోలో చూడవచ్చు.
హ్యాండ్‌బ్యాగ్ ఆకారంలో ఉన్న కారును కూడా సుధాకర్ చూపిస్తారు. తాను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఇలాంటి కార్లను డిజైన్ చేయడం స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రారంభంలో ఈయన సైకిల్స్ మాత్రమే తయారు చేసినట్లు వెల్లడించారు. అదే ఈ రోజు గిన్నిస్ రికార్డులో చోటు దక్కేలా చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదని సుధాకర్ పేర్కొన్నారు. ఎరుపురంగు షూ ఆకారంలో ఉండే కారును కూడా ఈయన డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదే తాను రూపొందించిన మొట్టమొదటి కారు అని తెలుస్తోంది.
విచిత్ర వాహనాలు
షూ ఆకారంలో ఉన్న కారును తయారు చేసిన తరువాత.. కెమెరా కారును చూపించారు. ఇది సుధాకర్ యొక్క రెండో కారు అని తెలుస్తోంది. ఇందులో ఫ్లాష్‌లైట్ హెడ్‌లైటుగా రూపొందించారు. దీని తరువాత 150 సీసీ ఇంజిన్ కలిగిన పెళ్లి దుస్తుల ఆకారంలో కారును రూపొందించారు. ఆ తరువాత టాయిలెట్ ఆకారపు కారు, స్నూకర్ ఆకారపు కారు, షటిల్ కాక్ డిజైన్ కారు, కంప్యూటర్ కారు, కాన్ఫరెన్స్ టేబుల్ కారు, సోఫా ఆకారపు కారు, బ్యాట్ ఆకారపు కారు, టెన్నిస్ బాల్ కారు, ఫుట్‌బాల్ షేప్ కారు, పంజరం మాదిరిగా ఉండే కారు.. ఇలా ఎన్నెన్నో రూపాల్లో ఉండే కార్లను ఇక్కడ చూడవచ్చు. పిల్లలను పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుందో ఆ అనుభూతి వారు పొందాలని, ఆ అనుభూతి పొందిన తరువాత వారు ఎప్పుడూ పక్షులను బంధించరని సుధాకర్ అన్నారు.
సుధాకర్ సృష్టించిన ఈ అద్భుతమైన వాహనాలు ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రత్యేకమైన వాహనాలన్నింటినీ వీక్షించడానికి అనుకూలంగా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి విచిత్రమైన వాహనాలు బహుశా ప్రపంచంలోనే మరో చోట లేదని తెలుస్తోంది. దీంతో ఈయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి చేరింది.
మొత్తం 60 వాహనాలు
విచిత్రమైన కార్లను మాత్రమే కాకుండా.. సుధాకర్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైసైకిల్ తయారు చేశారు. దీని ఎత్తు 12.67 మీటర్లు. ఈయన వద్ద మొత్తం 60 కార్లు ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్యను 100 చేర్చడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. సుధాకర్ మ్యూజియం హైదరాబాద్‌లో ఉంది. దీనిని రోజుకు 1000 నుంచి 1500 మంది సందర్శకులు, సందర్శిస్తున్నారు. ఇది గత 24 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది.
సుధాకర్ మ్యూజియంలో కార్లను తయారు చేయడానికి ఆరు నెలల సమయం (ఒక్కో కారు తయారు చేయడానికి కనీసం 6 నెలల సమయం) పడుతుందని సమాచారం. మరికొన్ని కార్లను నిర్మించడానికి ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు సుధాకర్ వెల్లడించారు. సాధారణ వాహనాల కంటే కూడా విచిత్రమైన వాహనాల మీద ఆమిసక్తి ఉండటం వల్లనే సుధాకర్ ఈ వాహనాలను రూపొందించారు.
Don’t Miss: రతన్ టాటా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు
విచిత్రమైన వాహనాలు రోడ్డుపైన తిరగవచ్చా?
నిజానికి భారతీయ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. మోడిఫైడ్ వాహనాలు ప్రజా రహదారులపైన నడపడం లేదా డ్రైవ్ చేయడం నేరం. దీనికి భారీ జరిమానా విధించడమే కాకుండా వాహన వినియోగదారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి విచిత్రమైన వాహనాలు రోడ్డుపై తిరగటం నేరం. ఇవి ప్రైవేట్ స్థలాల్లో మాత్రమే తిరగవచ్చు. సుధాకర్ క్రియేటివిటీ చాలా గొప్పదే.. అయినప్పటికీ అలంటి వాహనాలు రోడ్డుపై తిరగటానికి అనుమతి ఉండదు. గతంలో వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల్లో చాలా మోడిఫైడ్ వాహనాలను సంబంధిత అధికారులు సీజ్ చేశారు.