Lamborghini First Revuelto Delivery: భారతీయ రోడ్ల మీద ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన కారును చూసుంటారు. అతి తక్కువ ధరకే లభించే కారును చూసుంటారు. ఇందులో దేశీయ, విదేశీయ బ్రాండ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు.. ఇక్కడ కనిపిస్తున్న కారు వాటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఈ కలర్ ఆప్షన్ కారును బహుశా మునుపెన్నడూ.. చూసి ఉండరు. దీని ధర ఏకంగా రూ. 10 కోట్లు వరకు ఉందని సమాచారం. అంతే కాకుండా ఇది భారతదేశంలో మొట్ట మొదటి ”లంబోర్ఘిని రెవెల్టో” కూడా.. ఇంకెందుకు ఆలస్యం ఈ కారు గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.. వచ్చేయండి.
మొదటి కారు డెలివరీ
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘిని’ (Lamborghini) భారతదేశంలో తన మొట్ట మొదటి ‘రెవెల్టో’ (Revuelto) డెలివరీ చేసింది. బెంగళూరులోని బ్రాండ్ డీలర్ ద్వారా కంపెనీ చెన్నైవాసికి డెలివరీ చేసినట్లు సమాచారం. నిజానికి కంపెనీ ఈ కారు డెలివరీలను 2023 చివరిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డెలివరీ ఆలస్యమైంది.
దేశీయ మార్కెట్లో లంబోర్ఘిని రెవెల్టో కారు ప్రారంభ ధర రూ. 8.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). దీనిని ప్రత్యేకంగా దిగుమతి చేసుకోవాలి, కాబట్టి ఆన్ రోడ్ ధర రూ. 10 లక్షలకు చేరుతుంది. దీంతో భారతీయ విఫణిలో ఇదే అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారుగా నిలిచింది. కంపెనీ ఈ కారును భారతదేశానికి లిమిటెడ్ ఎడిషన్‌గా పరిచయం చేసింది. అంటే కొంతమందికి మాత్రమే ఈ కారును విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి బ్యాచ్ మొత్తం అమ్ముడయ్యాయి.
ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్
భారతదేశంలో డెలివరీ చేయబడిన ఈ కొత్త లంబోర్ఘిని రెవెల్టో కారు వియోలా బెస్ట్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. క్యాబిన్ ఊదా రంగులో ఉంటుంది. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆకర్షణీయమైన కలర్ లంబోర్ఘిని కారును చూడవచ్చు. ఈ ఫోటోలు చూసిన చాలామంది తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
లంబోర్ఘిని రెవెల్టో కారు.. 2022లో నిలిపివేయబడింది బ్రాండ్ యొక్క అవెంటడోర్ కారుకు వారసుడు. అయితే రెవెల్టో అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. కేవలం 2.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 350 కిమీ/గం కావడం గమనించదగ్గ విషయం.
ఇంజిన్ వివరాలు
రెవెల్టో కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేయబడి 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులోని హైబ్రిడ్ సెటప్ కలిసి మొత్తం హార్స్ పవర్ 1015 వద్ద, టార్క్ 807 వద్ద ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో 3.8 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ద్వారా 10 కిమీ రేంజ్ పొందవచ్చు.
డిజైన్ విషయానికి వస్తే.. లంబోర్ఘిని రెవెల్టో కారు చాలా సూక్ష్మమైన బాడీ లైన్స్, ప్యానల్స్, సిల్హౌట్ ఉన్నాయి. వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, టెయిల్ లాంప్, హాయ్ మౌంటెడ్ హెక్సాగోనల్ ఎగ్జాస్ట్, 20 ఇంచెస్ ఫ్రంట్ వీల్స్ మరియు వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. సిజర్ డోర్స్ సాధారణ బ్రాండ్ కార్ల మాదిరిగానే ఉన్నాయి. మొత్తం మీద ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉందని స్పష్టంగా అర్థమైపోతోంది.
Don’t Miss: నటి ‘త్రిష’ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా?.. అన్నీ లగ్జరీ బ్రాండ్స్ గురూ!
ప్రత్యర్థి
ఫీచర్స్ విషయానికి వస్తే.. లంబోర్ఘిని రెవెల్టో కారు.. మూడు పెద్ద స్క్రీన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 8.4 ఇంచెస్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, రెండు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మూడు 9.1 ఇంచెస్ ప్యాసింజర్ డిస్‌ప్లే. సెంటర్ కన్సోల్‌లోని బటన్స్ ఫైటర్ జెట్‌లో చూసిన విధంగా ఉన్నాయి. ఇక ఏసీ వెంట్స్.. సీటింగ్ పొజిషన్ మొదలైనవన్నీ వాహన వినియోగదారులకు అనుకూలంగానే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని రెవెల్టో.. ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడెల్ (రూ. 7.5 కోట్లు, ఎక్స్ షోరూమ్) కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.