MS Dhoni New Citroen Basalt Dark Edition: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారతీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా.. తన బసాల్ట్ కారును డార్క్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. దీని ఫస్ట్ యూనిట్ ‘మహేంద్ర సింగ్ ధోని‘(MS Dhoni)కి డెలివరీ చేసింది.
సిట్రోయెన్ కంపెనీ తన బసాల్ట్ డార్క్ ఎడిషన్ కారును ధోనికి డెలివరీ చేయడానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ధోని కారును డెలివరీ తీసుకోవడం చూడవచ్చు.
బసాల్ట్ డార్క్ ఎడిషన్
సిట్రోయెన్ కంపెనీ లాంచ్ చేసిన బసాల్ట్ డార్క్ ఎడిషన్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా భిన్నంగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 12.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). అంటే ఈ కారు ధర స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 19,500 ఎక్కువని తెలుస్తోంది. కంపెనీ ఈ డార్క్ ఎడిషన్ కారును పరిమిత సంఖ్యలో మాత్రమే డెలివరీ చేయనుంది. అయితే ఎన్ని కార్లను డెలివరీ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. సంస్థ ఈ కారు కోసం ఏప్రిల్ 10 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది.
కొత్త సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. వెలుపలి భాగం మొత్తం నలుపు రంగులో ప్రత్యేకంగా కనిపిస్తుంది. డార్క్ ఎడిషన్ బసాల్ట్ కారును.. సాధారణ మోడల్ నుంచి వేరు చేసే అంశాలు ఏమిటంటే సైడ్ మోల్డింగ్ మీద డార్క్ క్రోమ్ యాక్సెంట్స్, చెవ్రాన్ బ్యాడ్జ్ మరియు ఫ్రంట్ గ్రిల్. అంతే కాకుండా బంపర్ మరియు డోర్ హ్యాండిల్స్ అన్నీ గ్లోస్ బ్లాక్ ట్రీట్‌మెంట్ పొందుతాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ యొక్క లోపలి భాగం కూడా బ్లాక్ థీమ్ పొందుతుంది. బ్లాక్ లెథరెట్ సీట్లు మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్. ఇవి కాకుండా.. కొన్ని ఎలిమెంట్స్ ఎరుపు రంగులో ఉంటాయి. టచ్‌పాయింట్‌లపై కూడా హై-గ్లా ఫినిషింగ్ ఉండటం చూడవచ్చు.
బసాల్ట్ డార్క్ ఎడిషన్ అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 80 Bhp పవర్ మరియు 115 Nm టార్క్ అందిస్తుంది. టర్బోఛార్జ్డ్ వెర్షన్ 109 Bhp పవర్ మరియు 205 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్స్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.
సిట్రోయెన్ డార్క్ ఎడిషన్స్
కంపెనీ బసాల్ట్ కారును మాత్రమే కాకుండా ఎయిర్‌క్రాస్ మరియు సీ3 వంటి వాటిని కూడా డార్క్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. ఎయిర్‌క్రాస్ డార్క్ ఎడిషన్ ధర రూ. 13.13 లక్షలు కాగా.. సీ3 డార్క్ ఎడిషన్ రూ. 8.38 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇవన్నీ స్టాండర్డ్ మోడల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. బయట మరియు లోపల కొన్ని భాగాలు నలుపు రంగులో ఉంటాయి.
Also Read: రూ. 59900లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు
మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే సిట్రోయెన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ఇప్పుడు మొదటి బసాల్ట్ డార్క్ ఎడిషన్ కారును డెలివరీ చేసుకున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లు, బైకులు కలిగి ఉన్న ధోని గ్యారేజిలోకి మరో కొత్త అతిధి బసాల్ట్ డార్క్ ఎడిషన్ రూపంలో చేరింది. మొత్తం మీద ధోని గ్యారేజిలో 50 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం.