అమ్మకాల్లో అదరగొట్టిన Nissan Magnite.. గ్లోబల్ మార్కెట్లో కూడా తగ్గని హవా!

Nissan Magnite Sales Croses 30146 Units: నిస్సాన్ అనగానే ఆధునిక కాలంలో అందరికి గుర్తొచ్చే కారు మాగ్నైట్. ఎందుకంటే భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాల్లో ఏ మాత్రం తగ్గకుండా ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించింది. అలాంటి ఈ కాంపాక్ట్ SUV అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

నిజానికి నిస్సాన్ (Nissan) కంపెనీ దేశీయ విఫణిలో కిక్స్, సన్నీ వంటి అనేక కార్లను విడుదల చేసినప్పటికీ.. ప్రారంభంలో కొంత ఆశాజనక అమ్మకాలను పొంది, కాలక్రమంలో ప్రత్యర్థులను ఎదుర్కోలేకపోయాయి. నేడు ప్రత్యర్థులను ఎదుర్కొని, కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధించిన కారు మాగ్నైట్ (Magnite) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దేశీయ మార్కెట్లో అమ్మకాలు..

2020లో భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కారు ప్రారంభంలో విపరీతమైన అమ్మకాలు సాధించి.. నెలవారీ అమ్మకాల్లో కంపెనీకి మంచి పేరు తీసుకువచ్చింది. మొత్తం మీద కంపెనీ గత జనవరి నాటికి ఒక లక్ష (100000) యూనిట్ల అమ్మకాలను (దేశీయ మార్కెట్లో మాత్రమే) సాధించగలిగింది. జపాన్ బ్రాండ్ అయినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం అదరగొట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ 2023 – 2024 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 30146 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. ఈ సంఖ్య గత ఆర్ధిక సంవత్సరం కంటే కొంత తక్కువగా ఉంది (గత ఆర్థిక సంవత్సరంలో మాగ్నైట్ అమ్మకాలు 32546 యూనిట్లు). అంతకు ముందు లేదా 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో 33905 యూనిట్లను విక్రయించి, అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.

విదేశీ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు..

ఎగుమతుల విషయానికి వస్తే 30000 యూనిట్లకు పైగా నిస్సాన్ మాగ్నైట్ SUVలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నిస్సాన్ యొక్క మాగ్నైట్ SUVకి అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉందని స్పష్టమవుతోంది. ఈ కాంపాక్ట్ SUV ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు ఉగాండా వంటి దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.

నిజానికి ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిస్సాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక SUV నిస్సాన్ మాగ్నైట్. కంపెనీ ఇతర ఏ కార్లను దేశీయ విఫణిలో విక్రయించడం లేదు. ఇదే కంపెనీ యొక్క అమ్మకాలను కొంతమేర వృద్ధి చెందేలా చేసింది.. చేస్తోంది.

ధర..

నిస్సాన్ మాగ్నైట్ SUV ధర రూ. 6 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది రెనాల్ట్ కిగర్ మాదిరిగా ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన కారు. ఇది 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 72 హార్స్ పవర్ మరియు 100 హార్స్ పవర్ డెలివరీ చేస్తాయి. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణంగానే చాలామంది కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ..

దేశీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న కిస సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. వీటిని అన్నింటికి మాగ్నైట్ గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందగలిగిందంటే.. ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

సిద్దమవుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్..

మార్కెట్లో ఉత్తమ అమ్మకాలను పొందిన నిస్సాన్ మాగ్నైట్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. పలుమార్లు టెస్టింగ్ సమయంలో కెమెరాలకు చిక్కింది. బహుశా ఇది అభివృద్ధి చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: భారత్‌లో అడుగుపెట్టిన అమెరికన్ బ్రాండ్ కారు ఇదే!.. పూర్తి వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం మీద అటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. విడుదలకు సిద్దమవుతున్న ఈ కారు అప్డేటెడ్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. కంపెనీ ఈ కారు ధర మరియు ఇతర వివరాలను వెల్లడించాల్సి ఉంది. మరిన్ని వివరాలు అధికారికంగా కంపెనీ త్వరలోనే తెలియజేస్తుందని భావిస్తున్నాము.