ఇవి కదా ఎలక్ట్రిక్ బైక్స్ అంటే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడో తెలుసా?

Ola Electric Motorcycles To Be Launched in 2025 At Indian Market: దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి అధిక ప్రజాదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనున్నట్లు గత కొన్ని సంవత్సరాలుగా చెబుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు.. కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ బైకులను గురించి వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు ధ్రువీకరించింది.

2025లో ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్..

ఓలా ఎలక్ట్రిక్ కొన్ని రోజులకు ముందు తన ఎలక్ట్రిక్ బైకులను ప్రదర్శించింది. కాగా.. ఇప్పుడు ఈ బైకులను ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ బైకును 2026 ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థంలో షోరూమ్‌లకు చేరనున్నట్లు ప్రకటించింది. అంటే 2025 జూన్ – డిసెంబర్ మధ్యలో కంపెనీ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

కంపెనీ లాంచ్ చేయనున్న బైకులు.. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉన్న లేదా వినియోగిస్తున్న బైకులకు భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో లాంచ్ చేయనున్న నాలుగు ఎలక్ట్రిక్ బైకుల కాన్సెప్ట్‌లను గత సంవత్సరమే పరిచయం చేసింది. వీటి పేర్లు డైమండ్‌హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్ మరియు క్రూయిజర్. ఇవి ఇప్పటికే ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో సక్సెస్ సాధించాయి.

2026లో డెలివరీలు..

2025లో కంపెనీ ఈ బైకులను లాంచ్ చేసిన తరువాత 2026లో డెలివరీలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అంటే కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాదికి భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కొత్త చరిత్రను సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలో కూడా తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ.. కస్టమర్లకు చేరువవ్వడానికి సన్నద్ధమవుతోంది.

ఇప్పటికే కంపెనీ పరిచయం చేసిన నాలుగు ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైకులలో దేన్ని ముందుగా లాంచ్ చేస్తుందనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో 49 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో కూడా ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంటుంది.

ధరలు ఎలా ఉండనున్నాయంటే?

ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయలకంటే తక్కువ ధర వద్ద కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోని ఉన్నాయి. కాబట్టి కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ బైకులు కూడా తప్పకుండా సరసమైన ధరల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ ఈ బైకును లాంచ్ చేసే సమయంలో వెల్లడిస్తుందని భావిస్తున్నాము.

ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా.. ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు కూడా దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ కంపెనీలు కూడా 2026 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేయడానికి సర్వత్రా సిద్ధమవుతున్నాయి. ఈ కంపెనీలు రాబోయే ఎలక్ట్రిక్ బైకులకు సంబంధించిన కాన్సెప్ట్ మోడల్స్ కూడా ఇంకా పరిచయం చేయలేదు. కాబట్టి ఈ సంస్థలు ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేస్తే.. ఎలాంటి డిజైన్‌లో లాంచ్ చేస్తుందని బైక్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ పెరగటానికి కారణం?

నిజానికి ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ భారీగానే ఉంది. ఎలక్ట్రిక్ బైకులను ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారటం, లేదా పెరిగుతున్న ఇంధన ధరల నుంచి తప్పించుకోవడం. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని నగరాల్లోనే పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఒక్కసారిగా రూ. 3 పెంచుతూ ప్రకటించింది.

Don’t Miss: భారత్‌లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే!.. రేటు తెలిస్తే కొనేయాలనిపిస్తుంది

రోజు రోజుకి పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు మాత్రమే కాకుండా మధ్యతరగతి ప్రజలకు షాకిస్తోంది. ఈ ధరల పెరుగుదల భూతం నుంచి తప్పించుకోవడానికి పెట్రోల్ బైకులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం తప్పా.. వేరే మార్గం లేదని తెలుస్తోంది. అంతే కాకుండా పెట్రోల్ బైకులకు పెట్టే ఖర్చు కంటే.. ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్‌కు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. అయితే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఇది కొంతమందిని ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే సమయంలో కొంత ఆలోచింపజేస్తోంది. కాబట్టి దేశంలో విరివిగా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.