Indian Shooter Manu Bhaker Gifted Tata Curvv EV: 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటి రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న ‘మను భాకర్’ (Manu Bhaker)ను ఇటీవల దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఘనంగా సత్కరించింది. ఇందులో భాగంగానే కంపెనీ రూ. 17 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ‘టాటా కర్వ్ ఈవీ’ (Tata Curvv EV) కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన దేశం గర్వించేలా చేసిన మను భాకర్.. భారతదేశపు మొట్ట మొదటి కర్వ్ ఈవీ కారును సొంతం చేసుకుంది. గురుగ్రామ్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇందులో ఆమెకు కారును అందించారు. ఇందులో కంపెనీ అధికారులతో పాటు.. మను భాకర్ తల్లిదండ్రులు రామ్ కిషన్ మరియు సుమేధా భాకర్ కూడా ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో.. మను భాకర్ ఫోటోలకు పోజులివ్వడం వంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇక్కడ కనిపించే కారు ప్యూర్ గ్రే క్లాసీ షేడ్‌లో ఉంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. మనుకు అభినందనలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ పోటోలను లెక్కకు మించిన యూజర్లు లైక్ చేశారు.
టాటా కర్వ్ ఈవీ
భారతీయ విఫణిలో ఇటీవల టాటా మోటార్స్ తన కర్వ్ కూపేను.. పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరలు రూ. 17.49 లక్షలు కాగా.. టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 21.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. చూడగానీ నెక్సాన్ ఈవీని తలపించే ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉంది. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సింగిల్ చార్జితో ఏకంగా 585 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే రేంజ్ అనేది వాస్తవ పరిస్థితుల్లో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లలో లభించే టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్స్ పొందుతాయి. అవి 45 కిలోవాట్ బ్యాటరీ.. 55 కిలోవాట్ బ్యాటరీ. ఈ రెండూ వరుసగా 502 కిమీ రేంజ్ మరియు 585 కిమీ రేంజ్ అందిస్తాయి. మను భాకర్ పొందిన కార్ టాప్ వేరియంట్ (55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్) అని తెలుస్తోంది.
మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన టాటా కర్వ్ ఈవీ.. ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, హిల్ డీసెంట్ కంట్రోల్ మొదలైన లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా ‘ఎంజీ జెడ్ఎస్ ఈవీ’కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) అందుకోనున్న మను భాకర్
ఇప్పుడు టాటా కర్వ్ ఈవీ కారును గిఫ్ట్‌గా పొందిన మను భాకర్ కోసం ఎంజీ మోటార్ వారి కొత్త ‘విండ్సర్ ఈవీ’ కూడా ఎదురు చూస్తోంది. ఈ కారును కూడా ఈమె గిఫ్ట్‌గా పొందనుంది. ఇప్పటికే ఈ విషయం అధికారికంగా వెల్లడైంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన ప్రతి ఒక్కరికీ జేఎస్‌డబ్ల్యు గ్రూప్ ఎంజీ విండ్సర్ ఈవీ కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాబట్టి ఈ కారును వారు ఏ సమయంలో అయిన అందించవచ్చు.
ఎంజీ విండ్సర్ ఈవీ కారు ఈ రోజు (సెప్టెంబర్ 11) అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 331 కిమీ అందిస్తుందని సమాచారం. ఈ లేటెస్ట్ మోడల్ కొత్త డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.
Don’t Miss: చిన్న కారు కొన్న పెద్ద హీరోయిన్.. దీని రేటు తెలిస్తే మీరూ కొనేస్తారు
మను భాకర్ ఎంజీ గ్లోస్టర్
ఒలంపిక్ కాంస్య పతక విజేత మను భాకర్ ఎంజీ గ్లోస్టర్ కారును కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది స్టార్రీ బ్లాక్ షేడ్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మను భాకర్ ఉపయోగించే ఎంజీ గ్లోస్టర్ ఏ వేరియంట్ అనేది తెలియాల్సిన విషయం. అయితే ఈ కారు ప్రారంభ ధర రూ. 38.80 లక్షలు అని తెలుస్తోంది.