ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్!.. 650 సీసీ విభాగంలో మరో బైక్ ఇదే..

Royal Enfield Interceptor Bear 650 unveiled in India: భారతీయ మార్కెట్లో ఎన్ని బైకులున్నా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులుకున్న క్రేజే వేరు అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఇప్పటికి కూడా ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటోందంటే.. అది చాలా గొప్ప విషయం. ఇప్పటికే పలు బైకులను దేశీయ విఫణిలో లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు మరో కొత్త బైక్ ఆవిష్కరించింది. దానిపేరే ‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’. దీని గురించి పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 (Royal Enfield Interceptor Bear 650)

ఇప్పటికే 650 సీసీ విభాగంలో కూడా తిరుగులేని అమ్మకాలను పొందుతూ.. దూసుకెళ్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు ఇంటర్‌సెప్టర్ బేర్ 650 పేరుతో మరో బైక్ ఆవిష్కరించింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ బైక్ అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే కంపెనీ బైక్ ధరలను వెల్లడించాల్సి ఉంది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్.. ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న స్టాండర్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇది కంపెనీ యొక్క స్క్రాంబ్లర్ బైక్ స్వభావానికి అనుగుణంగా అనేక మార్పులను పొందినట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. పెయింట్ స్కీమ్ మరియు ఎగ్జాస్ట్ సిస్టం అన్నీ కూడా కొంత భిన్నంగా ఉంటాయి.

ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ సైడ్ ప్యానెల్స్ కొత్తగా అనిపిస్తాయి. సీటు స్క్రాంబ్లర్ మాదిరిగా ఉంటుంది. ఈ బైకుపై నెంబర్ బోర్డు కూడా చూడవచ్చు. ఇందులోని అన్నీ లైట్స్ ఎల్ఈడీ. అయితే వీల్ సైజ్ ఇప్పుడు భిన్నంగా స్పోక్ వీల్ కలిగి కొత్త ఎంఆర్ఎఫ్ నైలోరెక్స్ ఆఫ్ రోడ్ టైర్లను పొందుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ బైక్ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ పొందదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్‌లో కనిపించే విధంగా బేర్ 650 బైక్ షోవా యూఎస్‌డీ పోర్క్స్ పొందుతుంది. సస్పెన్షన్ అనేది సాధారణ ఇంటర్‌సెప్టర్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీటు కొంత ఎత్తుగా ఉంటుంది. బ్రేక్స్ అన్నీ కూడా ఇంటర్‌సెప్టర్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్రంట్ బ్రేక్ డిస్క్ పరిమాణం కొంత పెద్దదిగా ఉంటుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. రియర్ ఏబీఎస్ ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

ఈ కొత్త ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ అంతర్నిర్మిత న్యావిగేషన్ సిస్టం కలిగి కలర్ టీఎఫ్టీ స్క్రీన్ పొందుతుంది. ఇది మంచి దృశ్యమానతను అందిస్తుంది. బైక్ స్పీడ్ మరియు ఫ్యూయెల్ వంటి వాటిని గురించి వెల్లడించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ బైక్ మొత్తం ఐదు రంగులలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంచుకునే రంగును బట్టి ధరలు ఉండొచ్చని సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ 650 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 Bhp పవర్ మరియు 57 Nm టార్క్ అందిస్తుంది. అంటే టార్క్ అనేది స్టాండర్డ్ ఇంటర్‌సెప్టర్ బైకు కంటే 5 Nm ఎక్కువని తెలుస్తోంది. ఈ బైక్ టూ-ఇన్‌-టూ ఎగ్జాస్ట్ సిస్టం పొందుతుంది. కాబట్టి ఇది యువ రైడర్లను తప్పకుండా ఆకర్షిస్తుంది.

లాంచ్ డేట్ మరియు అంచనా ధరలు

దేశీయ మార్కెట్లో సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైక్ వచ్చే నెల 5న (2024 నవంబర్ 5) అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరలు కూడా అప్పుడే అధికారికంగా వెల్లడవుతాయి. అయితే ఈ బైక్ ధర రూ. 3.35 లక్షల నుంచి రూ. 3.40 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Don’t Miss: ఈ కారు కావాలంటే 3 నెలలు వేచి ఉండాల్సిందే!.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన కొత్త ఇంటర్‌సెప్టర్ బేర్ 650 బైకును లాంచ్ చేసిన తరువాత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే.. 650 సీసీ విభాగంలో కంపెనీ ఇప్పటికే బైక్స్ లాంచ్ చేసిన మంచి అమ్మకాలను పొందుతోంది. కాబట్టి రాబోయే 650 సీసీ బైక్ కూడా కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నాము.