Royal Enfield Classic 650 India Launch on 2025 March 27: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇండియన్ మార్కెట్లో ‘క్లాసిక్ 650’ పేరుతో మరో బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ బైకును ఈ నెల 27న (మార్చి 27) దేశీయ విఫణిలోకి అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్, త్వరలోనే క్లాసిక్ 650 పేరుతో లాంచ్ కానుంది. ఈ బైక్ ఏకంగా 243 కేజీల వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇది.. దాని విభాగంలో అత్యంత ఖరీదైన బైక్ అని తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులో 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 47 హార్స్ పవర్, 52 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.
648 సీసీ ఇంజిన్
ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. క్లాసిక్ 650 బైకులోని 648 సీసీ ఇంజిన్, ఇప్పటికే మీటియోర్ 650, బేర్ 650, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వంటి బైకులలో ఉంది. కాబట్టి క్లాసిక్ 650 బైక్.. దాని విభాగంలోని ఇతర బైకుల మాదిరిగానే ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ మంచి డిజైన్, అత్యుత్తమ బ్రేకింగ్ సెటప్, ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. దీని ముందు భాగంలో 120 మిమీ, వెనుక భాగంలో 90 మిమీ సస్పెన్షన్ ఉంటుంది. చూడటానికి ఇది షాట్‌గన్ 650 మాదిరిగా ఉన్నప్పటికీ.. చాలా వరకు తేడాలను గమనించవచ్చు. అయితే దీని బరువు.. బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ కంటే ఎక్కువ.
కలర్ ఆప్షన్స్ & ధరలు
క్లాసిక్ 650 మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి రెడ్, బ్లూ, టీల్ మరియు బ్లాక్ కలర్స్. ఈ బైక్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ధర సూపర్ మీటియోర్ (రూ. 3.64 లక్షలు), షాట్‌గన్ (రూ. 3.59 లక్షలు) బైకులకు దగ్గరగా ఉంటుంది.
Also Read: పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఎందుకంత డిమాండ్
దశాబ్దాల చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన బైకులను లాంచ్ చేసింది. ఇవన్నీ వేటికవే యూనిక్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తున్నాయి. అంతే కాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది దాని డుగ్.. డుగ్ సౌండ్. సాధారణ బైకులను మాత్రమే కాకుండా, కంపెనీ ఎలక్ట్రిక్ బైకులను కూడా తీసుకురావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ విభాగంలో బైకులను లాంచ్ కూడా చేసింది. త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బైకులు రోడ్డు మీదికి వస్తాయి.
ప్రస్తుతం మార్కెట్లో 350 సీసీ బైకులకు మాత్రమే కాకుండా.. 650 సీసీ బైకులకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 650 సీసీ విభాగంలో బైకులను లాంచ్ చేస్తోంది. ఈ విభాగంలోకి త్వరలోనే క్లాసిక్ 650 కూడా చేరనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మార్చి 27న అధికారికంగా వెల్లడవుతాయి.