Royal Enfield Shotgun 650 Icon Edition Sold Out: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కంపెనీ కొన్ని రోజులకు ముందు మార్కెట్లో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ (Shotgun 650 Icon Edition) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సంస్థ ఈ రోజు (ఫిబ్రవరి 12) రాత్రి 8:30 గంటలకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బైక్ అన్నీ అమ్ముడైపోయినట్లు కంపెనీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వచ్చేయండి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే మొత్తం అమ్ముడైపోయాయి. ఈ బైక్ లిమిటెడ్ ఎడిషన్. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ఈ బైకును 100 మందికి మాత్రమే విక్రయిస్తుంది. అందులో భారత్ కోసం 25 బైకులను కేటాయించింది. అంటే ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ బైకులను కేవలం 25 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు.
సాధారణ షాట్‌గన్ 650 బైక్ కంటే కూడా షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ధర రూ. 65,000 ఎక్కువ. అంటే ఐకాన్ ఎడిషన్ ధర మార్కెట్లో రూ. 4.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధర ఎక్కువైనప్పటికీ.. కొనుగోలుదారులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. మొత్తం మీద కంపెనీ లాంచ్ చేసిన స్పెషల్ ఎడిషన్ బైక్ అమ్మకాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా కంపెనీ కొనుగోలుదారులకు ధన్యవాదాలు తెలిపింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్
కంపెనీ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్.. దాని మునుపటి అన్ని బైకుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గది కలర్ ఆప్షన్. ఎందుకంటే ఈ బైక్ వైట్, రెడ్, సీ బ్లూ రంగులతో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ యొక్క రిమ్స్ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ బైకును కంపెనీ ప్రత్యేకంగా.. రైడింగ్ గేర్ తయారీదారు ఐకాన్ మోటార్‌స్పోర్ట్స్ సహకారంతో రూపొందించింది.
ఈ ఐకాన్ ఎడిషన్ బైకును కంపెనీ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయడానికంటే ముందు.. EICMA 2024 మరియు మోటోవర్స్ 2024లో ప్రదర్శించింది. ఆ సమయంలో ఈ బైక్ ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. ఇప్పుడు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేసేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ బైకును బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు త్వరలోనే జరుగుతాయని సమాచారం. కానీ డెలివరీలు ఎప్పుడనేది స్పష్టంగా వెల్లడికాలేదు.
డిజైన్ కాకూండా.. ఈ బైక్ యొక్క ఇంజిన్ మరియు మెకానికల్స్ ఎటువంటి మార్పు లేదు. కాబట్టి షాట్‌గన్ 650 బైకులోని అదే 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 46.6 Bhp పవర్ మరియు 5650 rpm వద్ద 52.3 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ముందు భాగం లేత నీలం మరియు తెలుపు రంగులో ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ కూడా లేత నీలం, ఎరుపు మరియు తెలుపు రంగుల్లో ఉంది. సైడ్ ప్యానెల్ 24 సంఖ్యతో ఉండటం చూడవచ్చు. రియర్ ఫెండర్ ఐకాన్ లోగోతో పాటు ఎరుపు మరియు తెలుపు రంగుల కలయికలో ఉంటుంది. గోల్డ్ కలర్ వీల్స్, రెడ్ కలర్ సీటు మరియు లేత నీలం రంగులో పెయింట్ చేయబడిన రియర్ స్ప్రింగ్ వంటివి ఈ బైకులో గమనించవచ్చు.
Also Read: ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!
కంపెనీ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ బుక్ చేసుకున్న వారికి.. ప్రత్యేకంగా రూపొందించబడిన జాకెట్ కూడా ఇస్తుంది. దీని కలర్.. బైక్ రంగుకు సరిపోయేలా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ ప్రత్యేకంగా.. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఈ కారణంగానే చాలా తొందరగా అమ్ముడైనట్లు తెలుస్తోంది.