Scrap Your Vehicle and Get Rs.25000 Discount On New Car: ఏ వస్తువుకైనా ఓ నిర్దిష్ట వయసు ఉంటుంది. అంటే దాన్ని కొన్ని సంవత్సరాలు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆ తరువాత అతి పనికిరాని వస్తువే!. ఒకవేళా ఉపయోగిస్తే దానివల్ల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం దేనికి వర్తించినా? వర్తించకపోయినా? వాహనాల విషయంలో మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఒక వాహనాన్ని 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చని కంపెనీలు సైతం చెబుతున్నాయి. ఆ తరువాత వాహనాల్లో సమస్యలు ఎదురవుతాయి. అవి ఇంజిన్లో సమస్యలు కావొచ్చు.. లేదా ఇతర సమస్యలు కావచ్చు. ఇలాంటి సమయంలో వాటిని రిపేర్ చేసుకోవడానికే లెక్కకు మించిన డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వీటివల్ల కాలుష్యం కూడా పెరుగుతుందని మోటార్ వెహికల్ చట్టం చెబుతోంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రవాణా శాఖ గత కొంతకాలంగా.. నిర్దిష్ట వయసుదాటిని వాహనాలను స్క్రాపేజ్ చేయాలని చెబుతూనే ఉంది. కొంతమంది ఇప్పటికి కూడా చాలా వయసైపోయిన వాహనాలను ఉపయోగిస్తున్నారు. ప్రజలు తమ పాతవాహనాలను స్క్రాపేజికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ఆలోచన చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
కొత్త కారు కొనుగోలుపై రూ.25000 తగ్గింపు!
భారత ప్రభుత్వం పాత కార్ల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి ‘నితిన్ గడ్కరీ’ (Nitin Gadkari) దేశంలోని పలు కార్ల తయారీ సంస్థల సీఈఓలు మరియు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తరువాత ఆటోమేకర్లు వాహనాల ఎక్స్-షోరూమ్ ధారాలపైన రూ. 20000 నుంచి రూ. 25000 తగ్గింపు అందిస్తామని ప్రకటించారు. అయితే దీనికి కస్టమర్ చేయాల్సిన పని ఏమిటంటే? చెల్లుబాటు అయ్యే స్క్రాపేజ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ‘గడ్కరీ’ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఇందులో గడ్కరీ కార్ల తయారీ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమవ్వడం చూడవచ్చు. వీడియో షేర్ చేస్తూ.. నా సిఫార్సుకు ప్రతిస్పందనగా, పాత వెహికల్ స్క్రాప్ తరువాత.. కొత్త వాహనాల కొనుగోలు చేసేవారికి వాహన తయారీదారులు తగ్గింపులు అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇది సురక్షితమైన వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచుతుందని ఆయన అన్నారు.
సమావేశానికి హాజరైన కంపెనీలు
నితిన్ గడ్కరీ సమావేశానికి హాజరనైనా సంస్థల జాబితాలో మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్, నిస్సాన్ ఇండియన్, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ మరియు జేఎస్డబ్ల్యు మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా పాతవాహనాలను స్వచ్ఛందంగా రద్దు చేయడానికి కావలసిన వ్యూహాల గురించి చర్చించుకున్నారు.
సమావేశం సారాంశం
నితిన్ గడ్కరీ సమావేశంలో.. పాత మరియు కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా తొలగించి, వాటి స్థానంలో కొత్త వాహనాలను తీసుకురావాలని చర్చించారు. దీనికోసం ఇప్పటికే దేశంలో ఇప్పటికే అనేక రిజిస్టర్డ్ స్క్రాపేజ్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. అవసరమైతే మరిన్ని సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని గడ్కరీ తెలిపారు.
డిస్కౌంట్ వివరాలు
పాతవాహనాలను స్క్రాప్ చేసిన తరువాత కంపెనీలు డిస్కౌంట్స్ అందిస్తాయి. దీనికి కంపెనీలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి. కియా మోటార్స్, టయోటా, హోండా, నిస్సాన్ ఇండియా, జేఎస్డబ్ల్యు, స్కోడా ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ కంపెనీలు కొత్త కారు కొనుగోలుపైన ఎక్స్ షోరూమ్ ధరలో 1.5 శాతం లేదా రూ. 20000 తగ్గింపు అందించడానికి ఒప్పుకున్నాయి.
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ రూ. 25000 తగ్గింపు ప్రకటించింది. అదే సమయంలో వాణిజ్య కార్గో వాహనాల స్క్రాప్ తరువాత.. టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్స్ మోటార్స్, ఇసుజు వంటి కంపెనీకు 1.5 శాతం నుంచి 3 శాతం వరకు డిస్కౌంట్ అందించడానికి సుముఖత చూపాయి.
స్క్రాపింగ్ యొక్క అదనపు ప్రయోజనాలు
వాహనదారుడు తన పాత వాహనాలను స్క్రాప్ చేస్తే కొత్త కారు కొనుగోలుపైన డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. స్క్రాప్ విలువకు తగ్గ అమౌంట్ కూడా పొందుతారు. అంటే తమ పాతవాహనాన్ని స్క్రాపేజికి పంపితే అక్కడ కొంత డబ్బు రావడమే కాకుండా.. స్క్రాపేజ్ సర్టిఫికెట్ ద్వారా కొత్త కారు కొనే సమయంలో డిస్కౌంట్ కూడా పొందుతాడు.
పాత కారును ఉంచుకోవడం లేదా వినియోగించడం మంచిదేనా?
ప్రభుత్వం ప్రకారం, కారు వయసును బట్టి పాత కార్లను రద్దు చేస్తున్నాయి. ఇది వంద శాతం సరైనదే అని చెప్పలేము. ఎందుకంటే వాహనం సరైన స్థితిలో ఉండి, ఇంజిన్ కూడా సరిగ్గా పనిచేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఇంజిన్ బాగా పనిచేస్తున్నప్పుడు.. దాని వల్ల పెద్ద స్థాయిలో కాలుష్యం జరగదు. కాబట్టి ఇది ప్రజల ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. ఎలా అంటే?.. పాత కారును వద్దనుకుని, కొత్త కారు కొనాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది అందరికి సాధ్యంకాకపోవచ్చు. అలాంటి వ్యక్తులకు పాత కారు వినియోగం ఆర్థికంగా నిలబడటానికి ఉపయోగపడుతుంది.
Don’t Miss: వాహనదారులకు అలెర్ట్.. ఆ ఒక్క సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు ఫైన్!
అయితే పాత కార్లు దాదాపు జీర్ణస్థితిలో ఉంటాయి. అలాంటి కార్లు పర్యావరణంలో కాలుష్య తీవ్రతను గణనీయంగా పెంచుతుంది. అంతే కాకుండా కారులోని పరికరాలు పాడైపోయి ఉండటం వల్ల అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాత వాహనాలను రద్దు చేస్తోంది.