Shraddha Kapoor Buys Lexus LM 350h: శ్రద్దా కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే అటు బాలీవుడ్, మరోవైపు టాలీవుడ్‌లో కూడా నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసు దోచేసింది. సాహో సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ అమ్మడు తెలుగు అభిమానులకు కూడా సుపరిచయం అయింది. కాగా ఈమె ఇటీవల ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.
సినిమాలో నటించడం మాత్రమే కాకుండా.. చాలామంది సెలబ్రిటీలకు విలాసవంతమైన జీవితం గడపడం కూడా ఇష్టమే. ఇందులో భాగంగానే శ్రద్దా.. లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ (Lexus LM 350h) కారును కొనేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈమె ఇటీవల ఈ కారుతో ముంబైలో కనిపించింది. ఈ కారును 10 రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు సమాచారం.
లగ్జరీ కార్లను ఉపయోగించే హీరోయిన్ల జాబితాలో ఒకరైన శ్రద్దా కపూర్.. తన రోజువారీ వినియోగానికి తరచుగా లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా సూపర్ కారును ఉపయోగిస్తుంది. దీని ధర రూ. 4.5 కోట్ల కంటే ఎక్కువ. కాగా ఇప్పుడు తన కార్ల జాబితాలోకి కొత్తగా లెక్సస్ కారు కూడా చేరింది. ఇది గ్రాఫైట్ బ్లాక్ గ్లాస్ ఫ్లేక్ యొక్క క్లాసీ షేడ్‌లో ఉండటం చూడవచ్చు.
లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో.. లెక్సస్ యొక్క ఎల్ఎమ్ 350హెచ్ ఒకటి. ఈ కారు ఇతర కార్ల కంటే ఎక్కువ లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారు లోపల కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఇవి విమానంలోని ఫస్ట్ క్లాస్ సీట్ల అనుభూతిని అందిస్తాయి. ఇవి రిక్లైనింగ్, మసాజ్ మరియు వెంటిలేషన్ వంటి ఫీచర్స్ పొందుతాయి.
ఈ కారు లోపల 48 ఇంచెస్ టీవీ, 23 స్పీకర్లు వంటి వాటితో పాటు.. రియర్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, అంబ్రెల్లా హోల్డర్, ఫోల్డ్ అవుట్ టేబుల్స్ మరియు ఫ్రిజ్ వంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
లెక్సస్ ఎల్ఎమ్ 35హెచ్ 2.5 లీటర్ 4 సిలిండర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 పీఎస్ పవర్, 239 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
శ్రద్దా కపూర్ కార్ కలెక్షన్
నటి శ్రద్దా కపూర్ ఉపయోగించే కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్, లంబోర్ఘిని కార్లు కాకుండా.. బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, ఆడి క్యూ7, టయోటా ఫార్చ్యూనర్, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు మారుతి విటారా బ్రెజ్జా వంటి కార్లు ఉన్నాయి.
Also Read: సంచలన విషయాలు బయటపెట్టిన పూజా హెగ్డే: లక్షలు ఖర్చు పెట్టి తిట్టించారు
లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కలిగిన సెలబ్రిటీలు
శ్రద్దా కపూర్ వద్ద మాత్రమే కాకుండా.. అక్కినేని నాగార్జున, రణబీర్ కపూర్, హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్, షారుక్ ఖాన్ మరియు రాధికా మర్చెంట్ వద్ద కూడా ఈ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు ఉంది. దీన్ని బట్టి చూస్తే.. సెలబ్రిటీలకు, క్రికెటర్లకు, ధనవంతులకు ఇష్టమైన కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ చెప్పుకోదగ్గ మోడల్ అని తెలుస్తోంది.