Sircilla Saree for Bhadrachalam Seethamma: భద్రాచలంలో సీతారాముల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించడానికి అశేష భక్తజనం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు. ఆ కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు సీతమ్మ వారికి ఓ బంగారు పట్టు చీరను రూపొందించాడు. చీరకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్.. పదిరోజులు శ్రమించి, మగ్గంపై బంగారు పట్టు చీరను నేసాడు. ఏడు గజాలున్న ఈ చీరను వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో ప్రత్యేకంగా రూపొందించాడు. దీని బరువు ఏకంగా 800 గ్రాములు కావడం గమనార్హం. ఈ పట్టు చీర కొంగుమీద ఆలయ మూల విరాట్ ఉన్నారు. అంచుల మీద (బార్డర్) శంఖ, చక్రం, నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వంటి చిత్రాలను చూడవచ్చు.
సీతమ్మ కోసం తయారు చేసిన ఈ పట్టుచీర మీద మొత్తం 51 సార్లు ‘శ్రీరామ రామ రామేతి’ అనే శ్లోకం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా.. సీతారాముల కల్యాణంలో సీతమ్మకు చీరను నేసె భాగ్యాన్ని సిరిసిల్ల నేతన్నలకు కల్పించమని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యంమత్రి రేవంత్ రెడ్డిని వెల్ది హరిప్రసాద్ కోరినట్లు సమాచారం.
సిరిసిల్ల చీర ఇదే మొదటిసారి కాదు
నిజానికి భద్రాచలం సీతమ్మవారి సిరిసిల్ల వాసులు చీరను నేసి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2024 శ్రీరామనవమి సందర్భంగా కూడా సిరిసిల్ల వెల్ది హరిప్రసాద్ చీరను నేసి ఇచ్చారు. ఆ సమయంలో నేసిన చీరమీద సీతారాముల కళ్యాణానికి సంబంధించిన చిత్రాలను ముద్రించారు. ఆ చీర బరువు కూడా 800 గ్రాములే. అయితే ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టు దారాలతో ఎంతో అద్భుతంగా చీరను నేసాడు.
అయోధ్య బాల రామునికి బంగారు వస్త్రం
భద్రాచలం సీతమ్మకు మాత్రమే కాకుండా వెల్ది హరిప్రసాద్ అయోధ్య రామయ్యకు కూడా వస్త్రం నేసి ఇచ్చాడు. ఎనిమిది గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో.. 20 రోజులు ఎంతో భక్తి శ్రద్దలతో అయోధ్య రామునికి వస్త్రం నేసాడు. ఈ వస్త్రం తయారు చేయడానికి రూ. 1,50,000 ఖర్చు అయినట్లు సమాచారం. వస్త్రాన్ని నేసిన తరువాత దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామునికి సమర్పించారు. మొత్తం మీద రాముని, సీతమ్మను వస్త్రాలను నేసె భాగ్యన్ని వెల్ది హరిప్రసాద్ సొంతం చేసుకున్నాడు.
శ్రీరామనవమి
వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి రోజున.. రాముడు జన్మించాడు. ఆయన జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకున్నారు. అంతే కాకుండా తండ్రిమాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసి.. సీతమ్మను అపహరించిన రావణాసురునితో యుద్ధం చేసి మళ్ళీ అయోధ్యకు వచ్చి.. సీతాసమేతంగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ కార్యక్రమం కూడా చైత్ర శుద్ద నవమి రోజున జరిగిందని కొందరు చెబుతారు. ఈ కారణంగానే చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి (Sri Rama Navami) జరుపుకుంటారు. ఈ వేడుక భద్రాచలంలో కన్నుల పండుగగా కరుగుతుంది.