SRH Owner Kavya Maran Car Collection: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అంటే ముందుగా గుర్తొచ్చేది.. ‘కావ్య మారన్’ (Kavya Maran). ఎస్ఆర్‌హెచ్ ఓనర్ మరియు సీఈఓ అయిన కావ్య.. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. జట్టును కూడా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్నపిల్లలా డ్యాన్స్ వేస్తుంది, మరికొన్ని సార్లు భావోద్వేగానికి గురవుతుంది. మొత్తానికి ఈమెకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది. సుమారు 400 కోట్ల రూపాయల సంపద కలిగిన కావ్య గురించి అందరికి తెలుసు. కానీ ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను నిశితంగా పరిశీలిద్దాం.. వచ్చేయండి.
కావ్య మారన్ కార్ల ప్రపంచం
ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ఉపయోగించే కార్ల జాబితాలో.. బెంట్లీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, ఫెరారి బ్రాండ్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం.
బెంట్లీ బెంటాయెగా ఈడబ్ల్యుబీ
కావ్య మారన్ ఉపయోగించే కార్ల జాబితాలో బెంట్లీ కంపెనీకి చెందిన ‘బెంటాయెగా ఈడబ్ల్యుబీ’ (Bentley Bentayga EWB) ఉంది. ఈ కారు ఎరుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది 22 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. దీని ధర రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ద్వారా.. 542 హార్స్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు బ్రాండ్‌కు చాలా ప్రత్యేకం, ఎందుకంటే.. ఇది బ్రాండ్ తయారు చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీ.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ
కావ్య మారన్ గ్యారేజిలోని అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ (Rolls Royce Phantom VIII EWB) ఒకటి. దీని ధర రూ. 12.2 కోట్లు. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ రోల్స్ రాయిస్ కారు.. గోల్డ్ అండ్ బ్లాక్ అనే డ్యూయెల్ కలర్లో ఉంది.
ఈ కారు 6.75 లీటర్ వీ12 ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 571 హార్స్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఇక ఈ కారు యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: 2025లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!.. రూ.10 లక్షల కంటే తక్కువే
బీఎండబ్ల్యూ ఐ7
జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 కూడా కావ్య మారన్ గ్యారేజిలో ఉంది. ఇది ఎలక్ట్రిక్ కారు. రూ.2.03 కోట్ల ఖరీదైన ఈ కారు.. బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇందులోని 101.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 603 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా విలాసవంతమైన ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఫెరారీ రోమా
కావ్య మారన్ ఉపయోగించే కార్లలో ఫెరారీ కంపెనీకి చెందిన రోమా (Ferrari Roma) కూడా ఒకటి. దీని ధర రూ. 4.5 కోట్లు. ఈ కారులో 3.9 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది 680 హార్స్ పవర్, 760 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.