రాజకుమారుడు ‘మహేష్ బాబు’ గ్యారేజిలోని కార్లు ఇవే: రేంజ్ రోవర్, లంబోర్ఘిని, ఆడి ఇంకా..

Mahesh Babu Birthday Special His Luxury Cars and Caravan: బాలనటుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. పాపులర్ హీరోగా ఎదిగిన సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ (Mahesh Babu) అందరికి సుపరిచయమే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, సర్కారివారి పాట వంటి ఎన్నో బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచిన ఈ రాజకుమారుడు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబీ29’ (SSMB29) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా బహుశా వచ్చే ఏడాదికి విడుదలయ్యే అవకాశం ఉంది.

సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా తనదైన రీతిలో సమాజసేవ చేస్తున్న మహేష్ బాబు చాలా దయార్ద్ర హృదయుడు, మచ్చలేని మహామనిషి. సినిమాల్లో నటించడం, ప్రజా సేవ చేయడమే కాకుండా మహేష్ బాబుకు విలాసవంతమైన కార్లను ఉపయోగించడంపై కూడా ఎక్కువ ఆసక్తి. ఈ కారణంగానే అనేక అన్యదేశ్య కార్లు, ఖరీదైన కారావ్యాన్ వంటివి ఈయన గ్యారేజిలో ఉన్నాయి. ఈ రోజు (ఆగష్టు 9) మురారి పుట్టినరోజు సందర్భంగా ఈ కథనంలో ఈయన ఎలాంటి కార్లను ఉపయోగిస్తున్నారు? వాటి ఖరీదు ఎంత? అనే వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం..

మహేష్ బాబు కార్ల ప్రపంచం
రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)

మహేష్ బాబు గ్యారేజిలో ఉన్న ఖరీదైన మరియు విలాసవంతమైన కార్ల జాబితాలో ఒకటి రేంజ్ రోవర్ వోగ్. ఈ కారు 7 సీటర్ వేరియంట్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 3.38 కోట్లు. ఇది 3.0 లీటర్ వీ6 డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్ 240 బ్రేక్ హార్స్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రేంజ్ రోవర్ వోగ్ మహేష్ బాబు గ్యారేజిలో మాత్రమే కాకుండా.. అలియా భట్, రణబీర్ కపూర్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖ సినీతారల గ్యారేజిలో కూడా ఉంది.

ఆడి ఈ-ట్రాన్ (Audi E-Tron)

జర్మన్ బ్రాండ్ అయిన ఆడి యొక్క ఎలక్ట్రిక్ కారు ఈ-ట్రాన్ కూడా మహేష్ బాబు గ్యారేజిలో ఉంది. రూ. 1.19 కోట్ల ఖరీదైన ఈ కారు లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి గరిష్టంగా 582 కిమీ రేంజ్ (సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. ఇందులో 71 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 308 హార్స్ పవర్, 540 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

కొత్త డిజైన్ కలిగిన ఆడి ఎలక్ట్రిక్ కారు ఐదు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, 16 స్పీకర్ ఆడియో సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్, ఏసీ వెంట్స్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.

రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ (Range Rover Vogue Autobiography)

మహేష్ బాబు గ్యారేజిలో రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన మరో కారు ‘వోగ్ ఆటోబయోగ్రఫీ’ కూడా కూడా ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 2.18 కోట్లు. ఎంచుకునే వేరియంట్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ కారు పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ అనే మూడు ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఫోర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ (BMW 730LD)

సూపర్ స్టార్ మహేష్ బాబు గ్యారేజిలోని మరో ఖరీదైన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 730ఎల్‌డీ. రూ. 1.30 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఈ జర్మన్ బ్రాండ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గ్యారేజిలో కూడా ఉంది. ఈ కారు 2993 సీసీ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 262 బ్రేక్ హార్స్ పవర్ (BHP) మరియు 2000 rpm వద్ద 620 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

కారావ్యాన్

మహేష్ బాబు గ్యారేజిలో ఖరీదైన కార్లు మాత్రమే కాకుండా.. ప్రత్యేకంగా రూపొందించబడిన కారావ్యాన్ కూడా ఉంది. దీని ధర రూ. 6.25 కోట్లు కంటే ఎక్కువ. ధర పరంగా చూస్తే మహేష్ బాబు కారావ్యాన్ షారుఖ్ ఖాన్ కారావ్యాన్ కంటే ఖరీదైనది. ఈ వ్యాన్ ఇంటీరియర్ డిజైన్ కోసమే రూ. 2కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో సీటింగ్ హౌస్, కిచెన్, టీవీ మరియు బాత్‌రూమ్‌లు కూడా ఉన్నాయి.

Don’t Miss: బల్లెం వీరుడు ‘నీరజ్ చోప్రా’ బహు ఖరీదైన కార్లు.. ఒక్కసారైనా చూడాల్సిందే!

ఇతర ఖరీదైన కార్లు

పైన చెప్పుకున్న కార్లు మాత్రమే కాకుండా.. మహేష్ బాబు ఉపయోగించే కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఈ (రూ. 66.99 లక్షల నుంచి రూ. 84.99 లక్షలు), రూ. 2.80 కోట్ల ఖరీదైన లంబోర్ఘిని గల్లార్డో స్పోర్ట్స్ కారు, మెర్సిడెస్ జీఎల్ క్లాస్ మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్ వీ8 (రూ. 1.5 కోట్లు) కూడా ఉన్నట్లు తెలుస్తోంది.