Suzuki Motorcycle India Achieves New Record in Production: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా’ (SMIPL) ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో సంస్థ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 80 లక్షలు లేదా 8 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగలిగింది. మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
జపాన్‌కు చెందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న ప్రముఖ కంపెనీలలో ఒకటి. కంపెనీ ఉత్పత్తి చేసిన ద్విచక్ర వాహనాలకు దేశీయ విఫణిలో మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ కారణంగానే సంస్థ ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకోగలిగింది.
ఇండియాలో కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే?
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా భారతదేశంలో తన కార్యకలాపాలను 2006 ఫిబ్రవరి నెలలో గుర్‌గావ్‌లోని ఖేర్కి ధౌలాలోని దాని ఉత్పత్తి కేంద్రంలో ‘సుజుకి యాక్సెస్ 125’ (Suzuki Access 125)తో ప్రారంభించింది. అయితే మొదటి నాలుగు మిలియన్ (40 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేయడానికి కంపెనీకి సుమారు 13 సంవత్సరాలు సమయం పట్టింది. ఆ తరువాత మిగిలిన 40 లక్షల (4 మిలియన్) వాహనాలను ఉత్పత్తి చేయడానికి కేవలం 5 సంవత్సరాల సమయం పట్టింది.
8 మిలియన్ వాహనాల ఉత్పత్తికి పట్టిన సమయం..
రెండోసారి కంపెనీ 4 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఐదు సంవత్సరాల సమయం మాత్రమే పట్టింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా సుజుకి వాహనాలను డిమాండ్ ఏ విధంగా పెరిగింది అనేది ఇట్టే అర్థమవుతుంది. మొత్తం మీద కంపెనీ భారతదేశంలో తన ఉత్పత్తిని ప్రారంభించిన 19వ సంవత్సరంలో 8 మిలియన్ వాహనాల ఉత్పత్తిని చేరుకుంది.
80 లక్షల యూనిట్ ఏదంటే?
గత ఏడాది మాత్రమే కంపెనీ 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాగా సంస్థ విడుదల చేసిన 80 లక్షల యూనిట్ పెర్ల్ ఆరెంజ్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ ‘అవెనిస్ 125’ (Suzuki Avenis 125) స్కూటర్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో 8 మిలియన్ యూనిట్ అవెనిస్ 125ను చూడవచ్చు.
ఉత్పత్తిలో అరుదైన మైలురాయి చేరుకున్న సందర్భంగా.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ‘కెనిచి ఉమెడ’ (Kenichi Umeda) మాట్లాడుతూ.. 8 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోడవం చాలా ఆనందంగా ఉందన్నారు. కంపెనీ ఉత్పత్తుల మీద ప్రజలకున్న నమ్మకం చాలా గొప్పదని.. వారికి కృతఙ్ఞతలు తెలిపారు. కంపెనీ ఇంత గొప్ప రికార్డ్ సాధించడంలో ఉద్యోగుల పాత్ర కూడా చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా సుజుకి మోటార్‌సైకిల్ మంచి ఆదరణ పొందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు స్కూటర్లు మార్కెట్లో లాంచ్ చేసి కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.
సుజుకి బైకులు & స్కూటర్లు
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ దేశీయ మార్కెట్లో 125 సీసీ విభాగంలో యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్‌మాన్ స్ట్రీట్ మరియు బర్గ్‌మాన్ స్ట్రీట్ ఎస్ఎక్స్ వంటి వాటిని లాంచ్ చేసింది. అదే సమయంలో 150 సీసీ నుంచి 250 సీసీ విభాగంలో జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్ 250, జిక్సర్ 250 ఎస్ఎఫ్ మరియు వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటి వాటిని లాంచ్ చేసింది. ఇవన్నీ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతూ.. ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది.
కంపెనీ ఇటీవల ప్రారంభించిన సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ, నియో రిట్రో కటన సూపర్‌నేక్డ్ మరియు హయబుసా వంటి బైకులు దేశీయ మార్కెట్లో ఖరీదైన మరియు ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులు. ఇటీవల కంపెనీ హయబుసా స్పెషల్ ఎడిషన్ కూడా మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.
Don’t Miss: కేవలం రూ. 69999లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్
ఆధునిక కాలంలో కంపెనీ తన కస్టమర్లకు ఇష్టమైన ఫీచర్స్ మరియు డిజైన్ కలిగిన వాహనాలను అందించాలనే ఉద్దేశ్యంతో అప్డేటెడ్ వాహనాలను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే సుజుకి హయబుసా స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము. అంతే కాకుండా ఉత్పత్తిలో మాత్రమే కాకుండా అమ్మకాల్లో కూడా సంస్థ అరుదైన రికార్డ్ చేరుకుంటుందని భావిస్తున్నాము.