Tata Altroz Racer Launch Details: భారతీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ (Tata Motors) గత ఆటో ఎక్స్‌పోలో ఢిల్లీ వేదికపై ప్రదర్శించిన సరికొత్త ‘ఆల్ట్రోజ్ రేసర్’ (Altroz Racer) కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయం వెల్లడించింది. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
టాటా మోటార్స్ యొక్క కొత్త ఆల్ట్రోజ్ రేసర్ వచ్చే నెలలో (2024 జూన్) లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే రెండు సార్లు ప్రదర్శించబడిన ఈ లేటెస్ట్ కారు ఇక త్వరలోనే లాంచ్ కావడానికి సిద్దమైపోయింది. ఈ కొత్త కారు ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
డిజైన్
విడుదలకు సిద్దమవుతున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు యొక్క బోనెట్ మరియు రూప్ మీద ట్విన్ రేసింగ్ స్ట్రిప్స్‌తో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ చూడవచ్చు. ఫ్రంట్ పెండర్ మీద రేసర్ బ్యాడ్జింగ్ చూడవచ్చు. కొత్తగా అప్డేట్ చేయబడిన గ్రిల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ ఇక్కడ చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగానే ఉంటుంది.
ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్
కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు ఇంటీరియర్ కూడా అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క డ్యాష్‌బోర్డ్ మీద రెడ్ కలర్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ వంటి వాటితో పాటు.. కలర్ యాక్సెంట్‌లతో కూడిన కొత్త లెథెరెట్ అపోల్స్ట్రే ఉంటుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్ద 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెగ్మెంట్ ఫస్ట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్స్ ఆప్ డిస్‌ప్లే, అల్యూమినియం పెడల్స్ మరియు వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
ఇంజిన్
కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు.. ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన నెక్సాన్ మాదిరిగానే అదే 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 120 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్
దేశంలో సేఫ్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది టాటా మోటార్స్. కాబట్టి కంపెనీ ఈ కారులో కూడా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తాయి. సేఫ్టీ ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రత్యర్థులు మరియు అంచనా ధర
భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా ఆట్రోజ్ రేసర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్‌కు ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉంది. అయితే ధరలను బట్టి ఈ హ్యాచ్‌బ్యాక్ మారుతి కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ మరియు టయోటా టైసర్ యొక్క టర్బో పెట్రోల్ వేరియంట్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త టాటా ఆట్రోజ్ రేసర్ అంచనా ధర రూ. 9.20 లక్షల నుంచి రూ. 10.10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. అయితే ఖచ్చితమైన ధరలు కంపెనీ ఈ కారును లాంచ్ చేసే సమయంలో వెల్లడిస్తుంది. అంతే కాకుండా రేసర్ యొక్క బుకింగ్స్ మరియు డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు సమాచారం.
Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన 2024 మారుతి స్విఫ్ట్ – ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
భారతదేశంలో టాటా కార్లు అత్యధిక అమ్మకాలను పొందుతూ.. మార్కెట్లో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ తరుణంలో టాటా కంపెనీ మరో కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో లాంచ్ కానున్న కొత్త రేసర్ తప్పకుండా కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతుందని భావిస్తున్నాము.