Tata Altroz Racer Launched in India: ఏడాది కంటే ఎక్కువ రోజులు ఈ కారు కోసం వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు భారతీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ (Tata Motors) దేశీయ విఫణిలో సరికొత్త ‘ఆల్ట్రోజ్ రేషన్’ (Altroz Racer) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధర & బుకింగ్స్
ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ రేసర్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి ఆర్1, ఆర్2 మరియు ఆర్3. వీటి ధరలు వారుగా రూ. 9.49 లక్షలు, రూ. 10.49 లక్షలు మరియు రూ. 10.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). కంపెనీ ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని సమాచారం.
డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్
కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్ మరియు ప్యూర్ గ్రే కలర్స్. ఈ కొత్త కారు బ్లాక్ అవుట్ రూప్, బానెట్ మీద డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. హుడ్ మరియు రూప్ మీద వైట్ స్ట్రిప్, బ్లాక్ అవుట్ ఆల్ట్రోజ్ బ్యాడ్జింగ్, డార్క్ థీమ్ అల్లాయ్ వీల్స్, అక్కడక్కడా రేసర్ బ్యాడ్జ్‌లు దీనిని కొత్త కారు అని గుర్తించడానికి సహాయపడతాయి.
ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్
మార్కెట్లో విడుదలైన కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ యొక్క ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇతర టాటా కార్లకంటే ప్రత్యేకంగా మరియు భిన్నంగా ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో చూడవచ్చు.
ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా ఆల్ట్రోజ్ రేసర్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్, సెగ్మెంట్ ఫస్ట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, ఏసీ వెంట్స్ చుట్టూ.. రెడ్ కలర్ హైలెట్స్, సెంటర్ కన్సోల్‌లోని గేర్ లివర్ మరియు కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో లెథెరెట్ అపోల్స్ట్రే మొదలైన లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
ఇంజిన్
కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ కంటే 10 హార్స్ పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్స్ & ప్రత్యర్థులు
అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన కొత్త టాటా ఆల్ట్రోజ్ టాటా యొక్క ఇతర మాదిరిగానే అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి స్టాండర్డ్‌గా లభిస్తాయి. అయితే ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
భారతదేశంలో లాంచ్ అయిన కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇప్పటికే మార్కెట్లో మంచి విక్రయాలు పొందుతున్న ఐ20 ఎన్ లైన్ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా అమ్మకాల పరంగా మారుతి ఫ్రాంక్స్ కారుకు కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Don’t Miss: ఇవి కదా బెనిఫీట్స్ అంటే!.. హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్!
ఇండియన్ మార్కెట్లో టాటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కొత్త ఆల్ట్రోజ్ రేసర్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. ఈ కారు గత ఏడాది మొదటి సారి కనిపించినప్పుడే ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్శించింది. కాగా ఇప్పుడు అమ్మకాల పరంగా ఆకర్శించడంలో విజయం పొందుతుందా? ప్రత్యర్థులను తట్టుకుంటుందా? అనేది త్వరలోనే తెలుస్తుంది.