మొదలైన ‘టాటా కర్వ్ ఈవీ’ బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?

Tata Curvv EV Bookings Test Drive And Delivery: సుదీర్ఘ నిరీక్షణ తరువాత దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు తన ‘కర్వ్ ఈవీ’ (Curvv EV) లాంచ్ చేసింది. అయితే బుకింగ్స్ మాత్రం ఇప్పుడు ప్రారంభించింది. ఈ సందర్భంగానే కంపెనీ డెలివరీలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.

బుకింగ్ ధర & డెలివరీలు

టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త కర్వ్ ఈవీ కారును బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందుగా రూ. 21000 చెల్లించి కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఆగష్టు 23 నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే ఈ నెలాఖరు నాటికి డెలివరీ పొందవచ్చని తెలుస్తోంది.

ధరలు మరియు వేరియంట్స్

టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త టాటా కర్వ్ ఈవీ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ. వీటి ధరలు రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ధర అనేది ఎంచుకునే వేరియంట్ మరియు బ్యాటరీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది.

డిజైన్ మరియు ఫీచర్స్

చూడగానే టాటా నెక్సాన్ ఈవీ కారు మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కనెక్టెడ్ టెయిల్ లాంప్, ఎల్ఈడీ లైట్ బార్, ఫాగ్ లాంప్, కర్నరింగ్ ఫంక్షన్, ఆటో వైపర్లు మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కారును చాలా ఆకర్షనీయంగా చేయడంలో సహాయపడతాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. బేస్ మోడల్ 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, కీలెస్ గో, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉంటాయి. అయితే టాప్ ఎండ్ మోడల్ 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రియర్ సీట్ల కోసం రిక్లైన్ ఫంక్షన్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.

పవర్‌ట్రెయిన్

ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం బ్యాటరీ మరియు రేంజ్. టాటా కర్వ్ ఇవే 45 కిలోవాట్ మరియు 55 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. బేస్ మోడల్ యూనిట్ 45 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది, అదే టాప్ వేరియంట్స్ 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.

45 కిలోవాట్ బ్యాటరీ కలిగిన టాటా కర్వ్ ఈవీ ఒక సింగిల్ ఛార్జ్ ద్వారా 502 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే విధంగా 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన కారు ఒక ఫుల్ ఛార్జ్ ద్వారా 585 కిమీ రేంజ్ అందిస్తుంది. టాటా కర్వ్ ఈవీ 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.

సేఫ్టీ ఫీచర్స్

టాటా అంటేనే సేఫ్టీ. ఎక్కువ మంది టాటా కార్లను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ప్రజలకు నమ్మికయిన టాటా మోటార్స్ ఇప్పుడు తన కర్వ్ ఈవీలో కూడా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే టాటా కర్వ్ ఇవే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి మరిన్నో ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

టెస్ట్ డ్రైవ్స్

టాటా కర్వ్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ కూడా కంపెనీ ఆగష్టు 14 అంటే రేపటి నుంచి ప్రారంభిస్తోంది. కాబట్టి ఆసక్తి కలిగిన కస్టమర్లు టెస్ట్ డ్రైవ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ కోసం కస్టమర్లు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

Don’t Miss: టాటా సరికొత్త ఎలక్ట్రిక్ కారు ‘కర్వ్’ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

ప్రత్యర్థులు

టాటా కర్వ్ ఈవీ దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎంజీ మోటార్స్ యొక్క జెడ్ఎస్ ఈవీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము. అయితే టాటా కర్వ్ ఈవీ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.