Tata Curvv EV Launched in India: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా కర్వ్ ఈవీ’ (Tata Curvv EV) దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఆధునిక హంగులతో.. అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ కర్వ్ ఈవీ లాంచ్‌తో మరింత వృద్ధి చెందనుంది.
వేరియంట్స్ & ధరలు (Variants and Price)
భారతీయ విఫణిలో లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 21.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).
డిజైన్ (Design)
టాటా కర్వ్ ఈవీ క్లోజ్డ్ గ్రిల్ ఉంటుంది. ముందు భాగంలో బ్రాండ్ లోగో ఉన్న ప్రదేశంలోనే ఛార్జింగ్ పోర్ట్ ఉండటం గమనించవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, హై మౌంటెడ్ స్పాయిలర్ మొదలైనవన్నీ కూడా ఇక్కడా చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి.
ఇంటీరియర్ ఫీచర్స్ (Interior Features)
టాటా కర్వ్ ఈవీ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 9 స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టం, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ లోగోతో.. 4 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటివి వన్నీ ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా.. ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరీఫైర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి మరెన్నో అప్డేటెడ్ ఫీచర్స్ టాటా కర్వ్ ఈవీలో ఉన్నాయి.
బ్యాటరీ మరియు రేంజ్ (Battery & Range)
టాటా కర్వ్ ఈవీ యొక్క క్రియేటివ్, అకాంప్లిష్డ్ మరియు అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్స్.. 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 502 కిమీ రేంజ్ అందిస్తుంది. అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ వేరియంట్స్ 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. ఇవి ఒక సింగిల్ చార్జితో 585 కిమీ రేంజ్ అందిస్తాయని ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడింది.
కర్వ్ ఈవీ 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ కావడం గమనార్హం. 55 కిలోవాట్ బ్యాటరీ కలిగిన టాటా కర్వ్ 167 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. 45 కిలోవాట్ బ్యాటరీ కలిగిన టాటా కర్వ్ 150 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండు 215 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
ఛార్జింగ్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఈవీ 70 కేడబ్ల్యు లేదా అంతకంటే ఎక్కువ డీసీ ఛార్జర్ ద్వారా 40 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జర్ ద్వారా 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 150 కిమీ ప్రయాణించగలిగే ఛార్జ్ చేసుకుంటుందని తెలుస్తోంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)
టాటా మోటార్స్ అంటేనే సేఫ్టీ.. కాబట్టి కంపెనీ యొక్క ఇతర వేరియంట్స్ మాదిరిగానే టాటా కర్వ్ కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణికులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి కూడా ఉన్నాయి. వీటితో పాటు 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
Don’t Miss: గేమ్ చేంజర్ నటి ‘కియారా అద్వానీ’ ఉపయోగించే కార్లు ఇవే.. మీకు తెలుసా?
ప్రత్యర్థులు (Rivals)
కొత్త టాటా కర్వ్ ఈవీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఎంజీ జెడ్ఎస్ ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దీంతో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ400 మరియు నెక్సాన్ ఈవీ వంటి వాటికీ కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే టాటా కర్వ్ అమ్మకాల పరంగా దేశీయ విఫణిలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.