ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకోలెక్క!.. వచ్చేసింది నెక్సాన్ సీఎన్‌జీ

Tata Nexon iCNG Launched in India: భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) చెప్పినట్లుగా నెక్సాన్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పుడు సీఎన్‌జీ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది. సీఎన్‌జీ విభాగంలో అడుగుపెట్టిన నెక్సాన్ యొక్క డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి? మైలేజ్ ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధరలు

ముందుగా తెలుసుకోవాల్సిన విషయం నెక్సాన్ సీఎన్‌జీ (Tata Nexon CNG) యొక్క ధరలు. ఇది మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త సీఎన్‌జీ వెర్షన్ ధరలు రూ. 8.99 లక్షల నుంచి రూ. 14.59 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు ధర దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా రూ. లక్ష ఎక్కువని తెలుస్తోంది. అయితే ఇది మంచి మైలేజ్ అందిస్తుంది.

స్మార్ట్: రూ. 8.99 లక్షలు
స్మార్ట్ ప్లస్: రూ. 6.69 లక్షలు
స్మార్ట్ ప్లస్ ఎస్: రూ. 9.99 లక్షలు
ప్యూర్: రూ. 10.69 లక్షలు
వ్యూస్ ఎస్: రూ. 10.99 లక్షలు
క్రియేటివ్: రూ. 11.69 లక్షలు
క్రియేటివ్ ప్లస్: రూ. 12.19 లక్షలు
ఫియర్‌లెస్ ప్లస్ ఎస్: రూ. 14.59 లక్షలు

డిజైన్

చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉండే టాటా నెక్సాన్ సీఎన్‌జీ అదే హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు సైడ్ ప్రొఫైల్ పొందుతుంది. అయితే ఇది సీఎన్‌జీ వెర్షన్ అని గుర్తించడానికి బ్యాడ్జెస్ట్ పొందుతుంది. వీటి ద్వారా ఇది సీఎన్‌జీ కారు అని ఇట్టే కనిపెట్టవచ్చు.

ఫీచర్స్

టాటా నెక్సాన్ సీఎన్‌జీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, నాలుగు స్పెయికర్లు, లెదర్ అపోల్స్ట్రే, 360 కెమెరా మరియు వైపర్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ మునుపటి మోడల్లో ఉన్నట్లే ఉంటాయి.

పవర్‌ట్రెయిన్ & మైలేజ్

టాటా నెక్సాన్ సీఎన్‌జీ కారు డ్యూయెల్ సిలిండర్ సీఎన్‌జీ కిట్ పొందుతాయి. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 98.6 Bhp పవర్ మరియు 110 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది 24 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

నెక్సాన్ సీఎన్‌జీ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు. ఒక ఫుల్ ట్యాంక్ సీఎన్‌జీతో నెక్సాన్ 1440 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. డ్యూయెల్ సిలిండర్ టెక్నలజీ కలిగి ఉండటం వల్ల ఈ కారులో బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది. కాబట్టి నెక్సాన్ సీఎన్‌జీ బూట్ స్పేస్ 321 లీటర్లు. అయితే ఇది పెట్రోల్ మరియు డీజిల్ కార్ల బూట్ స్పేస్ కంటే కూడా తక్కువే అని తెలుస్తోంది.

టాటా మోటార్స్ తన సీఎన్‌జీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో భాగంగానే నెక్సాన్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ, టయోటా టైసర్ సీఎన్‌జీ, మారుతూ బ్రెజ్జా సీఎన్‌జీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: రూ. 5.65 లక్షలకే.. వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్: మంచి డిజైన్ & సరికొత్త ఫీచర్స్

ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ఎన్నెన్నో కార్లు లాంచ్ అయ్యాయి. అయితే ఒకే కారు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ విభాగాల్లో లాంచ్ కావడం అనేది జరగలేదు. ఇది కేవలం టాటా మోటార్స్ కంపెనీకి మాత్రమే సాధ్యమైంది. దీన్ని బట్టి చూస్తే టాటా మోటార్స్ అంటే ఇండియన్ మార్కెట్లో ప్రజలకు ఎంత నమ్మకమో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న నెక్సాన్.. సీఎన్‌జీ విభాగంలో కూడా గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.