ఆరు నెలల్లో 1.26 లక్షల మంది కొనేశారు!.. టాటా కారంటే ఆ మాత్రం ఉంటది

Tata Punch is Best Selling Car in India From January to July 2024: భారతదేశంలో ఎక్కువమందికి నమ్మికైన కార్ బ్రాండ్ ‘టాటా మోటార్స్’ (Tata Motors). ఎందుకంటే ఈ కంపెనీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా తన బ్రాండ్ కార్లలో అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందిస్తుంది. టాటా కార్ల వినియోగదారులు పెద్ద పెద్ద ప్రమాదాల్లో కూడా ప్రాణాలతో బయటపడిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో బ్రాండ్ మీద ప్రజలకు నమ్మకం విపరీతంగా పెరిగింది.

టాటా మోటార్స్ యొక్క సురక్షితమైన కార్లలో ఒకటి ‘పంచ్’ (Punch). ఈ మైక్రో ఎస్‍యూవీ క్రాష్ టెస్టులో ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. దీంతో ఈ కారు ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను పొందుతూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.

మొదటి ఆరు నెలల్లో 1.26 లక్షల యూనిట్స్

టాటా మోటార్స్ యొక్క పంచ్ ఎస్‍యూవీ 2024 జనవరి నుంచి జులై వరకు.. అంటే మొత్తం ఆరు నెలల కాలంలో 1.26 లక్షల అమ్మకాలను పొందగలిగింది. దీంతో అమ్మకాల పరంగా అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి టాటా పంచ్ సేల్స్ పరిశీలిస్తే.. 2024 జనవరిలో 17978 యూనిట్లు, ఫిబ్రవరిలో 18,438 యూనిట్లు, మార్చిలో 17,547 యూనిట్లు, ఏప్రిల్ నెలలో 19,158 యూనిట్లు, మే నెలలో 18949 యూనిట్లు, జూన్ మాసంలో 18,238 యూనిట్లు మరియు జులైలో 16,121 యూనిట్లుగా తెలుస్తోంది.

టాటా పంచ్ తరువాత ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా మారుతి వ్యాగన్ ఆర్.. ఆ తరువాత హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా నిలిచాయి. టాటా పంచ్ ఎక్కువ అమ్మకాలు పొందటానికి ప్రధాన కారణం ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ రూపంలో అందుబాటులో ఉండటమే అని తెలుస్తోంది. అన్ని విభాగాల్లోనూ అందుబాటులో ఉండటం, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటంతో ఈ కారు గొప్ప అమ్మకాలను పొందగలిగింది.

మూడు విభాగాల్లో పంచ్

టాటా పంచ్ ప్రారంభంలో కేవలం పెట్రోల్ కారుగా మాత్రమే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందగలిగింది. అయితే కస్టమర్లు ఈ కారు ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ రూపంలో ఉంటే బాగుంటుందని యోచించారు. దీనిని గమనించిన టాటా మోటార్స్ వెంటనే ఈ కారును ఎలక్ట్రిక్, సీఎన్‌జీ విభాగాల్లో కూడా లాంచ్ చేసింది. ఇవి కూడా చాలామంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించాయి.

చూడటానికి కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. టాటా పంచ్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందింది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క అభిరుచికి తగిన విధంగా ఉండటం వల్ల చాలామంది ఎగబడి మరీ కొనుగోలు చేశారు. ఇప్పటికి కూడా ఈ కారుకు దేశీయ విఫణిలో డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు అంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

రూ. 6.13 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయిత్ చూడటానికి అన్ని వేరియంట్లు ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్ల విషయంలో మాత్రం కొంత తేడాని గమనించవచ్చు. ఈ కారు సింగిల్ మరియు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

టాటా పంచ్ కారులో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం సేఫ్టీ ఫీచర్స్. ఎందుకంటే ఇది అత్యంత సురక్షితమైన కారుగా పరిగణించబడింది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివన్నీ ఉన్నాయి. ఈ కారణంగానే ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందింది.

Don’t Miss: వాహనదారులకు అలెర్ట్.. ఆ ఒక్క సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు ఫైన్!

దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ఈవీ ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 25 కిలోవాట్ మరియు 35 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 315 కిమీ మరియు 421 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారు ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ కారు 7.2 kW ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది.