టాప్ 5 మోస్ట్ పవర్‌ఫుల్ బైక్స్.. ధర రూ.2.50 లక్షల కంటే తక్కువే!

Top 5 Best Bikes Under Rs.2.50 Lakh in India: భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు, కార్లను అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే చాలామంది ఒక రేంజ్ ధర వద్ద లభించే వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే 5 ఉత్తమ బైకులు ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సంగతులు వివరంగా తెలుసుకుందాం.

కేటీఎమ్ 250 డ్యూక్

ఎక్కువమంది కుర్రకారుకు ఇష్టమైన బైక్ బ్రాండ్ కేటీఎమ్ (KTM). ఇది దాదాపు అందరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే మోడల్ ‘కేటీఎమ్ 250 డ్యూక్’. దీని ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 9250 rpm వద్ద 31 హార్స్ పవర్ మరియు 7250 rpm వద్ద 25 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 249 సీసీ ఇంజిన్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కేటీఎమ్ 250 డ్యూక్.. అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇందులో అల్యూమినియం స్వింగార్మ్ మరియు క్విక్‌షిఫ్టర్ వంటివి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర బైక్ కొనాలనుకునే వారికి కేటీఎమ్ 250 డ్యూక్ ఓ మంచి ఆప్షన్.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310

దేశీయ మార్కెట్లో ఎక్కువ మందిని ఇష్టమైన బైక్ బ్రాండ్లలో ఒకటైన టీవీఎస్ కూడా మన జాబితాలో ఉంది. టీవీఎస్ కంపెనీ యొక్క అపాచీ ఆర్‌టీఆర్ 310 రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధరలకు లభించే బైక్. దీని ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 2.43 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ. 2.63 లక్షలు (ఎక్స్ షోరూమ్).

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 బైక్ 312 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9700 rpm వద్ద 35.6 హార్స్ పవర్ మరియు 6650 rpm వద్ద 28.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి ఇది బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

బజాజ్ డామినార్ 400

డామినార్ 400 బైక్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. బజాజ్ కంపెనీ యొక్క ఈ బైక్ ధర రూ. 2.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8800 rpm వద్ద 40 హార్స్ పవర్ మరియు 6500 rpm వద్ద 35 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 192 కేజీల బరువున్న ఈ బైక్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి మంచి రైడింగ్ అభుభూతిని అందిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్

రూ. 1.85 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ‘బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్’ కూడా రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ బైకులలో ఒకటి. ఇది బజాజ్ డామినార్ 400 మాదిరిగా అదే ఇంజిన్ మరియు ఫ్రేమ్‌ పొందినప్పటికీ.. డామినార్ 400 కంటే 18 కేజీలు తక్కువ. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ బరువు రూ. 174 కేజీలు.

Don’t Miss: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ 373 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8800 rpm వద్ద 39.4 Bhp పవర్ మరియు 6500 rpm వద్ద 35 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. తద్వారా ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

ట్రైయంఫ్ స్పీడ్ 400

ఎక్కువమందికి ఇష్టమైన మరియు రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ట్రైయంఫ్ స్పీడ్ 400 కూడా ఒకటి. దీని ధర రూ. 2.34 లక్షలు. ఇది 398 సీసీ ఇంజిన్ కలిగి 8000 rpm వద్ద 40 hp పవర్ మరియు 6500 rpm వద్ద 37.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.