Toyota Hilux Black Edition Launched in India: ఇండియన్ మార్కెట్లో టయోటా కంపెనీ యొక్క ‘హైలెక్స్ పికప్ ట్రక్’కు (Toyota Hilux Pickup Truck) మంచి డిమాండ్ ఉంది. ఇది రోజువారీ వినియోగానికి లేదా సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, వాణిజ్య పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది సాధారణ రోడ్ల మీద ప్రయాణిస్తుంది. కఠినమైన భూభాగాల్లో కూడా ముందుకు సాగుతుంది. అంటే ‘ఆఫ్-రోడర్’గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఇప్పుడు కొత్త బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ధర, బుకింగ్స్ & డెలివరీలు
కొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ ధర రూ. 37.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది డీజిల్ ఏటీ 4×4 రూపంలో.. ఒకే వేరియంట్లో లభిస్తుంది. కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతాయి.
డిజైన్
టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ మోడల్.. 2025 జనవరి ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. ఇప్పుడు అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయింది. చూడటానికి ఇది సాధారణ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కాస్మొటిక్ అప్డేట్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే హుందాగా కనిపిస్తుంది.
2025 టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ పేరుకు తగ్గట్టుగానే.. గ్రిల్, వింగ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ వంటివన్నీ బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. బ్లాక్ అవుట్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వంటివి ఇందులో గమనించవచ్చు. అంతే కాకుండా సాధారణ యాక్ససరీలుగా.. దాదాపు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇంటీరియర్‌లో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేదు.
ఫీచర్స్
2025 హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా పెద్దగా మార్పులు లేవు. కాబట్టి ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడా అదే 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. డ్యూయెల్ జోన్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏఈడీ హెడ్‌లైట్స్, 8 వే పవర్డ్ డ్రైవర్ సీటు, క్రూయిక్ కంట్రోల్, రియర్ కెమెరా మరియు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
కలర్ ఆప్షన్స్
టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్.. ఎమోషనల్ రెడ్, వైట్ పెర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, సూపర్ వైట్ మరియు గ్రే మెటాలిక్ అనే ఇది రంగులలో లభిస్తుంది. ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఐదు రంగులలో లభిస్తుండటం వల్ల.. కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఇంజిన్ వివరాలు
కొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ డీజిల్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఇందులో 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ 204 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది. మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం ఎలక్ట్రానిక్ డిఫరెన్షియక్ లాక్ మరియు ఆటోమాటిక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ వంటివి పొందుతుంది.
Also Read: కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్.. మునుపటి కంటే మరింత కొత్తగా: రేటెంతో తెలుసా?
హైలెక్స్ చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇప్పుడు లాంచ్ అయిన హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్, టాటా హారియర్, సఫారీ మరియు ఎంజీ కామెట్ స్పెషల్ బ్లాక్ ఎడిషన్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.